జెడ్డా (సౌదీ అరేబియా): ఒక్క రాత్రితో కోటీశ్వరులను చేసి క్రికెటర్ల రాతను మార్చే వేలం పాటకు వేళయింది. రెండు రోజుల ఐపీఎల్ మెగా వేలం ఆదివారం మొదలవనుంది. వేలంలో 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా అందరి దృష్టి టీమిండియా కీపర్, స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌పైనే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన పంత్‌ను తమ జట్టులోకి తీసుకునేందుకు అన్ని ఫ్రాంచైజీల మధ్య బిడ్డింగ్ వార్ నడిచే అవకాశం కనిపిస్తోంది. దాంతో పంత్ రూ. 25 కోట్ల మార్కును దాటి లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారొచ్చు.
మొత్తంగా 204 స్లాట్స్ ఖాళీగా ఉండగా.. రిటెన్షన్స్ తర్వాత అన్ని ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 641.5 కోట్ల మొత్తం మిగిలుంది. పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉన్నాయి. ఆర్సీబీ (83 కోట్లు), డీసీ (రూ. 73 కోట్ల) మద్ద కూడా పెద్ద మొత్తం ఉంది. ఈ మూడు ఫ్రాంచైజీలు పంత్ కోసం పోటీ పడొచ్చు. రిషబ్‌తో పాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్.. విదేశీ ఆటగాళ్లలో జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, కగిసో రబాడ భారీ మొత్తం పలికే అవకాశం కనిపిస్తోంది. తొలి సెట్లోనే పంత్, బట్లర్, శ్రేయస్, అర్ష్‌దీప్, రబాడ, స్టార్క్ పేర్లు ఉన్న నేపథ్యంలో వేలం ఆరంభంలోనే బిడ్డింగ్ వార్ మొదలవనుంది.