
వెలుగు స్పోర్ట్స్ డెస్క్ : 15 సీజన్లు.. 10 ఫైనల్స్.. 5సార్లు టైటిల్ విన్నర్.. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర ఇది. పటిష్టమైన టాప్ ఆర్డర్, బలమైన ఆల్‌రౌండర్స్, అత్యంత నైపుణ్యం కలిగిన స్పిన్నర్లు.. వీటన్నింటిని మించి వికెట్ల వెనకాల లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహాలు.. పక్కాగ అమలు చేసే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. ఇలా చెప్పుకుంటూ పోతే మెగా లీగ్‌లో సీఎస్కేకు ఉన్న రికార్డులు, ప్రజాదరణ మరే జట్టుకు లేవంటే అతిశయోక్తి కాదు.
సాధారణ ఆటగాడు సైతం అసాధారణ పెర్ఫామెన్స్ చూపెట్టడం, టీమ్‌లో చోటు కష్టమనుకున్న ప్లేయర్లు కూడా ఒక్కో మ్యాచ్‌లో ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారడం... ఇవన్నీ కేవలం చెన్నై జట్టులోనే కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో 18వ సీజన్‌కు రెడీ అవుతున్న సీఎస్కే ఆరో టైటిల్ కొడుతుందా? ప్రస్తుతం ఉన్న జట్టు బలం, బలహీనతలు ఎలా ఉన్నాయో విశ్లేషిద్దాం..!
బలాలు
అన్ని జట్ల మాదిరిగానే ఈ సీజన్ కోసం చెన్నై కూడా పకడ్బందీగా జట్టును రూపొందించుకుంది. ఈ క్రమంలో కొంత మంది స్టార్లను వదులుకున్నా.. మెగా వేలంలో కుర్రాళ్లతో పాటు పాత స్టార్లను జట్టులోకి తీసుకుని సమతుల్యతను పాటించింది. దీంతో సీఎస్కేకు ఆడాలన్న ఏకైక కోరికతో ఉన్న చాలా మంది ప్లేయర్లు ఆ ఫ్రాంచైజీలో కనిపిస్తారు.
జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ధోనీ కెప్టెన్‌గా లేకపోయినా అతని ప్రభావం జట్టుపై చాలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సారథి రుతురాజ్‌కు విలువైన సలహాలిస్తూనే ప్లేయర్ల నుంచి అత్యుత్తమ పెర్ఫామెన్స్ రాబడుతున్నాడు. ఓపెనింగ్‌లో రుతురాజ్, డేవన్ కాన్వే బ్యాటింగ్‌కు మూల స్తంభాలుగా నిలుస్తున్నారు. సీఎస్కేకు ఐదో టైటిల్ అందించడంలో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి వంటి రన్ మెషీన్లతో కూడిన 11 మంది పవర్ ప్యాక్డ్ ఆల్‌రౌండర్స్ జట్టులో ఉండటం కొండంత బలం. ఎలాంటి ప్రత్యర్థినైనా వణికించే స్పిన్నర్లకూ కొదవలేదు. ఆల్‌రౌండర్స్‌గా జడేజా, అశ్విన్, సామ్ కరన్, విజయ్ శంకర్, శివమ్ దూబేతో టీమ్ బలంగా కనిపిస్తున్నది. దీనివల్ల తుది జట్టు ఎంపికలో చాలా ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వస్తాయి.
బలహీనతలు
బ్యాటింగ్, ఆల్‌రౌండర్స్, స్పిన్ వరకు బాగానే ఉన్నా.. సరైన పేసర్లు లేకపోవడం సీఎస్కేకు అతి పెద్ద బలహీనతగా మారింది. మతీష పతిరణ భారీగా రన్స్ ఇచ్చుకుంటున్నాడు. ఇటీవల సౌతాఫ్రికా టీ20లో ఆరు మ్యాచ్‌ల్లో 178 రన్స్ ఇచ్చి మూడు వికెట్లే తీశాడు. ‘బేబీ మలింగ’గా పేరు తెచ్చుకున్నా ఆ స్థాయిలో బౌలింగ్‌లో పదును ఉండటం లేదు. ముకేశ్ చౌదరీ, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, విజయ్ శంకర్ బౌలింగ్‌లోనూ నిలకడ లోపిస్తోంది.
కీలక టైమ్‌లో వీళ్లు వికెట్లు తీయడంలో విఫలం కావడం ఆందోళన కలిగించే అంశం. మిడిల్ ఆర్డర్‌లోనూ కొన్ని బలహీనతలు ఉన్నాయి. దీపక్ హుడా, జడేజా, ధోనీ అత్యుత్తమ ఫినిషర్లు అయినప్పటికీ అన్ని మ్యాచ్‌ల్లోనూ వాళ్లపైనే ఆధారపడటం కరెక్ట్ కాదు. వీళ్లు ఫెయిలైనప్పుడు మిడిల్‌లో గట్టిగా ఆదుకునే ప్లేయర్లు లేరు.
అవకాశాలు
పేస్ బౌలింగ్ బలహీనతలను అధిగమించడం, కెప్టెన్‌గా రుతురాజ్ సక్సెస్ కావడం, సీనియర్లపై ఎక్కువగా ఆధారపడకపోవడం, స్వదేశీ ప్లేయర్లు బ్యాట్లు ఝుళిపిస్తే చెన్నై ఫైనల్‌కు చేరడం పెద్ద కష్టం కాదు. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఉంటుంది కాబట్టి బలహీనతలను పసిగట్టడంలో ధోనీని మించిన ప్రతిభను రుతురాజ్ చూపెట్టాల్సి ఉంటుంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా సీఎస్కేకు కలిసొచ్చే అంశం. డెత్ ఓవర్లలో అద్భుతమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న నూర్ అహ్మద్ చాలా కీలకం కానున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ధోనీ, మతీషా పతిరణ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, ఆర్. అశ్విన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, విజయ్ శంకర్, సామ్ కరన్, షేక్ రషీద్, అన్షుల్ కాంబోజ్, ముకేశ్ చౌదరి, దీపక్ హుడా, గుర్‌జప్నిత్ సింగ్, నేథన్ ఎలిస్, జెమీ ఓవర్టన్, కమలేష్ నాగర్‌కోటి, రామకృష్ణ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వన్ష్ బేడీ, ఆండ్రీ సిద్దార్థ్.