IPL 2025: ఆహా ఏమి తెలివితేటలు: ధోని కోసం CSK కొత్త ప్లాన్.. వ్యతిరేకించిన కావ్య మారన్

IPL 2025: ఆహా ఏమి తెలివితేటలు: ధోని కోసం CSK కొత్త ప్లాన్.. వ్యతిరేకించిన కావ్య మారన్

ఎంఎస్ ధోని.. ఎంఎస్ ధోని.. ఈ భారత మాజీ కెప్టెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి నాలుగేళ్లు గడుస్తున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. అతను సారథ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్(CSK) మ్యాచ్ ఏ నగరంలో జరిగిన అభిమానులు పోటెత్తుతున్నారు. మహేంద్రుడి పట్ల అభిమానుల్లో ఉన్న ఆ ఆదరణను చూసి చెన్నై యాజమాన్యం అతన్ని వదులుకునే సాహసం చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఆ జట్టు యాజమాన్యం.. బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముందు వింత ప్రతిపాదనను ఉంచింది. అయితే, దీనిని సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ సున్నితంగా వ్యతిరేకించింది.

అసలేంటి ఈ ప్రతిపాదన..?

క్రిక్‌ఇన్ఫో నివేదికల ప్రకారం, బుధవారం(జులై 31) ముంబైలో జరిగిన ఐపీఎల్ ఫ్రాంచైజీల సమావేశంలో ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా వర్గీకరించాలని చెన్నై సూచించింది. అనగా 16 ఏళ్ల పాటు  భారత క్రికెట్‌కు సుదీర్ఘ సేవలు అందించిన ధోనీని.. ఇప్పుడే క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్న ప్లేయర్‌గా గుర్తించమనడం. అలా చేయడం ద్వారా వారు అతన్ని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ విభాగంలో ఉంచుకోవచ్చు. ధోని నాలుగేళ్ల క్రితం 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు కనుక ఈ నిబంధనను సడలించాలని చెన్నై యాజమాన్యం తెలిపింది.

వాస్తవానికి మూడేళ్ల క్రితం వరకూ ఈ నిబంధన ఉండేది. 2008లో ప్రారంభ ఎడిషన్ నుండి 2021 సీజన్ వరకూ ఇలాంటి రూల్ ఒకటుండేది. ఈ నియమం ప్రకారం, ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైరై 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు గడిచినట్లయితే, వారు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా వర్గీకరించబడతారు. ఈ నియమాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని CSK కోరుకుంది. అయితే, అందుకు ఇతర ఫ్రాంచైజీలు అంగీకరించలేదు. ముఖ్యంగా సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్.. నిబంధనలు సడలించడం కుదరదని మొహమాటంగా లేకుండా ధైర్యంగా తన నిర్ణయాన్ని తెలిపింది. 

అగౌరవపరచకండి: కావ్య

రిటైర్డ్ ప్లేయర్‌ను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కొనసాగించడానికి అనుమతించడం అనేది వ్యక్తిని, వారి విలువను "అగౌరవపరచడమేనని కావ్య చెప్పుకొచ్చింది. అలా చేయడం వలన వేలంలో కొనుగోలు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు మాజీ అంతర్జాతీయ ఆటగాడు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంచిన దానికంటే ఎక్కువ వేతనం లభిస్తే అది ముమ్మాటికీ తప్పు అవుతుందని వివరణ ఇచ్చింది. కావాలంటే రిటైర్డ్ ప్లేయర్ వేలంలో భాగం కావాలని, అక్కడ మార్కెట్ వారి సరసమైన ధరను నిర్ణయిస్తుందని సూచించింది.

త్వరలోనే స్పష్టత

ఐపీఎల్‌ 2025 మెగా వేలానికి సంబంధించిన నియమ నిబంధనలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఐపీఎల్ లో పాల్గొంటున్న పది ఫ్రాంచైజీలతో బీసీసీఐ చర్చిస్తోంది. ఈ నియమనిబంధనల తర్వాత టోర్నమెంట్‌లో ధోనీ ఆడటం, ఆడకపోవడంపై స్పష్టత రావచ్చు. 2024 ఐపీఎల్‌లో ధోనీ బాగా రాణించాడు. 14 ఇన్నింగ్స్‌లలో 53.67 యావరేజ్‌తో 161 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 220గా ఉండటం గమనార్హం.