
అహ్మదాబాద్: టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్–18లో బోణీ చేసేందుకు రెడీ అవుతోంది. తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిన నేపథ్యంలో.. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తోంది. వారం రోజుల విరామం లభించడంతో ముంబై టీమ్.. జామ్‌నగర్‌లో రిలయన్స్ ఫెసిలిటీ సెంటర్‌లో ఉత్సాహంగా గడిపింది. దీంతో రెట్టించిన జోరుతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది.
అయితే స్టార్ పేసర్ బుమ్రా లేకపోవడం ఇంకా మైనస్‌గా కనిపిస్తుండగా, బ్యాటర్లు కూడా గాడిలో పడాల్సి ఉంది. పాండ్యా రాకతో రాబిన్ మింజ్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని వార్తలు వస్తున్న నేపథ్యంలో భారీ స్కోరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రోహిత్, రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ భారీ ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టారు. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, శాంట్నర్‌తో పాటు కొత్త కుర్రాడు విఘ్నేశ్ పుతూర్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు గుజరాత్ కూడా తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. బౌలింగ్‌లో రబాడ, రషీద్ ఖాన్, సిరాజ్ సత్తా చాటాలి. బ్యాటింగ్‌లో కెప్టెన్ గిల్, బట్లర్, సాయి సుదర్శన్, రూథర్‌ఫోర్డ్, రాహుల్ తెవాటియా చెలరేగాలి.