
దుబాయ్ గడ్డపై చాంపియన్స్ ట్రోఫీ పోరు ముగిసింది. మెగా టోర్నీలో మన క్రికెటర్లంతా కలిసికట్టుగా కదం తొక్కుతూ టీమిండియాను జగజ్జేతగా నిలబెట్టారు. మొన్నటిదాకా మెగా ఐసీసీ వన్డే వార్‌ను ఆస్వాదించిన క్రికెట్ అభిమానుల కోసం స్వదేశంలో టీ20 వినోదం సిద్ధం అవుతోంది. ప్రతీ సమ్మర్‌లో క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే ఐపీఎల్ ధమాకా 18వ సీజన్ వచ్చేస్తోంది. ఈ లీగ్ ఆరంభానికి మరో పది రోజులే ఉంది. ఇప్పటికే అన్ని జట్లు అందుబాటులోని క్రికెటర్లతో ప్రాక్టీస్ ప్రారంభించగా... చాంపియన్స్ ట్రోఫీ హీరోలు వారం విశ్రాంతి తీసుకొని ఐపీఎల్ ప్రిపరేషన్స్ మొదలు పెట్టబోతున్నారు.
ఐసీసీ ట్రోఫీలో అంతా కలిసి జట్టుగా పోరాడిన స్టార్లంతా ఇప్పుడు ఐపీఎల్ ప్రత్యర్థులుగా పోటీపడనున్నారు. కొత్త సీజన్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. వేలంలో అన్ని ఫ్రాంచైజీలు తమ జట్ల రూపురేఖలు మార్చుకున్నాయి. సగం జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగబోతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా తమకు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను వదులుకొని టైటిల్ నిలబెట్టుకునేందుకు పోటీకి వస్తోంది. ఇప్పటికే మూడుసార్లు విజేతగా నిలిచిన కేకేఆర్ కొత్త కెప్టెన్ అజింక్యా రహానె నాయకత్వంలో నాలుగోసారి గెలిచి ఫోర్ కొడుతుందా? ఆ జట్టు బలాబలాలు, అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం!
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు కేకేఆర్. ముంబై, సీఎస్కే చెరో ఐదుసార్లు విజేతలుగా నిలిస్తే కోల్‌కతా ముచ్చటగా మూడుసార్లు (2012, 2014, 2024)గెలిచింది. గత సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని కేకేఆర్ ఫైనల్లో బలమైన సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి పదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరో టైటిల్ అందుకుంది. కానీ, తమకు ట్రోఫీ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను వదులుకొని షాకిచ్చిన కేకేఆర్ ఫ్రాంచైజీ జెడ్డాలో జరిగిన ఈ సీజన్ వేలంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. వెంకటేశ్ అయ్యర్‌ను జట్టులో కొనసాగించడం కోసం ఏకంగా 23.75 కోట్లు ఖర్చు చేసింది. అదే సమయంలో గత సీజన్‌లో జట్టును విజేతగా నిలిచిన కోర్ టీమ్ మెంబర్స్ అయిన వరుణ్ చక్రవర్తి, రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణాలను నిలబెట్టుకుంది. వీరికి తోడు వేలంలో కొత్తగా 15 మందిని తీసుకొని జట్టును బ్యాలెన్స్ చేసుకుంది. సీజన్ ఆరంభానికి ముందే కొత్త కెప్టెన్‌గా వెటరన్ ప్లేయర్ అజింక్యా రహానెను ప్రకటించింది. వైస్ కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్‌ను ఎంపిక చేసింది.
బ్యాటింగ్, స్పిన్‌లో బలంగా..
సీనియర్ ప్లేయర్లతో కేకేఆర్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. ఫిల్ సాల్ట్‌ను రిటైన్ చేయకపోవడంతో ఈసారి ఓపెనింగ్ కాంబినేషన్‌లో మార్పులు ఖాయం. సునీల్ నరైన్‌తో పాటు క్వింటన్ డికాక్ లేదా రహ్మనుల్లా గుర్బాజ్ ఓపెనర్‌గా వస్తాడు. ఈ ముగ్గురూ మంచి హిట్టర్లే. గుర్బాజ్ గత రెండేండ్లుగా టీమ్‌లో కీలకంగా ఉన్నాడు. యంగ్‌స్టర్ అంగ్‌క్రిష్ రఘువంశీ రూపంలో మరో బ్యాకప్ టాపార్డర్ బ్యాటర్ ఉన్నాడు. మిడిలార్డర్‌లో వెంకటేశ్ అయ్యర్‌కు తోడు కొత్త కెప్టెన్ అజింక్యా రహానె కీలకంగా మారనున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీల్లో రహానె ముంబై తరఫున దంచికొట్టి మంచి ఫామ్‌లో ఉన్నాడు. తను అదే జోరు కొనసాగిస్తే బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ లేని లోటును పూడ్చగలడు. జట్టుకు ఫినిషింగ్ పవర్ అందించేందుకు ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణ్ దీప్ సిద్ధంగా ఉన్నారు. కేకేఆర్ స్పిన్ విభాగం కూడా అత్యంత బలంగా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ అందుకున్న వరుణ్ చక్రవర్తి గత రెండు సీజన్లలో 20, 21 వికెట్లు తీశాడు. అలాగే, సునీల్ నరైన్ కూడా గత సీజన్‌లో అద్భుత పెర్ఫామెన్స్ చేశాడు. వీళ్లకు బ్యాకప్‌గా మయాంక్ మార్కండే, అనుకూల్ రాయ్ ఉన్నారు.
కెప్టెన్, పేసర్లపైనే ఆందోళన
గత సీజన్‌లో ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్ సత్తాకు తగిన కెప్టెన్ లేకపోవడం మైనస్ పాయింట్. వేలంలో వెంకటేష్ కోసం భారీగా ఖర్చు చేసిన ఫ్రాంచైజీ కెప్టెన్‌గా పనికొచ్చే కేఎల్ రాహుల్ ను సొంతం చేసుకోలేకపోయింది. వేలంలో భారీ మొత్తం పలికిన వెంకటేష్ కే కెప్టెన్సీ ఇస్తుందని అనుకున్నా.. మేనేజ్‌మెంట్ సేఫ్ ఆప్షన్‌గా రహానెను కెప్టెన్‌గా ప్రకటించింది. అయితే, గత ఐపీఎల్‌లో సీఎస్కేకు ఆడిన రహానె ఇబ్బంది పడ్డాడు. ఓ దశలో తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ఈ సీజన్‌లో బ్యాటర్‌గా తను ఫెయిలైతే అది జట్టుపైనా ప్రభావం చూపుతుంది. అదే సమయంలో స్టార్క్‌ను వదులుకోవడంతో కేకేఆర్ పేస్ బౌలింగ్ కూడా బలహీనం అయింది. ఈ మధ్యే టీమిండియా అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా ఇప్పుడు పేస్ బౌలింగ్‌ను నడిపించనున్నాడు. కానీ, అతను ఇంకా నిరూపించుకునే దశలోనే ఉన్నాడు. ఇక రెండు నెలల సుదీర్ఘ లీగ్‌లో నరైన్, రస్సెల్, అన్రిచ్ నోకియా వంటి కీలక ఆటగాళ్లు ఫిట్‌నెస్ మేనేజ్‌మెంట్ సమస్యగా మారొచ్చు. వీళ్లకు సరైన బ్యాకప్ ఆప్షన్స్ కూడా లేవు. అలాగే, ఇంపాక్ట్ ప్లేయర్ గా సత్తా చాటే ఆటగాళ్లు కూడా లేకపోవడం ప్రతికూలాంశం కావొచ్చు.
ఏం చేస్తుందో..
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బ్యాటింగ్, స్పిన్ విభాగాల్లో బలంగా ఉంది. నాణ్యమైన ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉండటంతో ఈ సీజన్‌లో కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరుతుందని ఆశించొచ్చు. అయితే, కెప్టెన్సీ మార్పులు, పేస్ బౌలింగ్ లోపాలు, కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలు జట్టును ఇబ్బంది పెట్టొచ్చు. కేకేఆర్ టైటిల్ నిలబెట్టుకోవాలంటే రహానె కెప్టెన్సీ ప్రభావవంతంగా ఉండాలి. ఇండియా పేసర్లు సత్తా చాటడంతో పాటు వెటరన్ ప్లేయర్లు రస్సెల్, నరైన్ ఫిట్‌నెస్ కాపాడుకోవాల్సి ఉంటుంది.