Uppal Stadium: మార్చి 22 నుంచి ఐపీఎల్‌.. ముస్తాబవుతున్న ఉప్పల్‌ స్టేడియం

Uppal Stadium: మార్చి 22 నుంచి ఐపీఎల్‌.. ముస్తాబవుతున్న ఉప్పల్‌ స్టేడియం

ఐపీఎల్‌-18వ సీజన్ ఏర్పాట్లు ఉప్పల్‌ స్టేడియంలో శరవేగంగా జరుగుతున్నాయి. మంగళవారం(మార్చి 4) ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) యాజమాన్యంతో కలిసి హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు ఐపీఎల్‌ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రావు మాట్లాడుతూ.. అభిమానులకు ఎలాంటి ఇబ్బందలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. గతేడాది కార్పొరేట్‌ బాక్సుల్లోని ఏసీలు, వాష్‌రూమ్స్‌ వల్ల కొన్ని చోట్ల సమస్యలు తలెత్తాయని, ఈసారి అటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల విక్రయం పూర్తి పారదర్శకంగా జరగాలని, స్టేడియంలో విక్రయించే ఆహార పదర్థాలు నాణ్యత బాగుండాలని ఆయన సిబ్బందికి సూచించారు. అదే సమయంలో ఆహార పదర్థాలను అధిక రేట్లకు విక్రయించకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రెసింగ్‌ రూమ్స్‌, కార్పొరేట్‌ బాక్సుల్లో జరుగుతున్న పనులను ఉపాధ్యక్షుడు దల్జిత సింగ్‌, సహాయ కార్యదర్శి బసవరాజు, కోశాధికారి సీజే శ్రీనివాస్‌తో కలిసి ఆయన పర్యవేక్షించారు.

ఈసారి ఉప్పల్ స్టేడియం 9 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. ఇందులో 7 సన్‌రైజర్స్ హోమ్ మ్యాచ్‌లు కాగా, మరో రెండు క్వాలిఫైయర్ గేమ్స్ ఉన్నాయి.

ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లు..

  • మార్చి 23: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ (మధ్యాహ్నం 3:30)
  • మార్చి 27: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌ (రాత్రి 7:30)
  • ఏప్రిల్ 06: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs గుజరాత్‌ టైటాన్స్‌ (రాత్రి 7:30)
  • ఏప్రిల్ 12: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs పంజాబ్ కింగ్స్ (రాత్రి 7:30)
  • ఏప్రిల్ 23: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs ముంబై ఇండియన్స్ (రాత్రి 7:30)
  • మే 05: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs ఢిల్లీ క్యాపిటల్స్ (రాత్రి 7:30)
  • మే 10: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (రాత్రి 7:30)
  • మే 20: క్వాలిఫయర్‌ 1 (హైదరాబాద్‌, రాత్రి 7:30)
  • మే 21: ఎలిమినేటర్‌ (హైదరాబాద్‌, రాత్రి 7:30)