SRHvsGT: 300 కాదు 152 కొట్టారు.. కాటేరమ్మ కొడుకులు మళ్లీ ఫెయిల్.. SRH గెలవాలంటే..

SRHvsGT: 300 కాదు 152 కొట్టారు.. కాటేరమ్మ కొడుకులు మళ్లీ ఫెయిల్.. SRH గెలవాలంటే..

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో SRH టీం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. 153 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని గుజరాత్ ముందు నిలిపింది. కాటేరమ్మ కొడుకులుగా SRH అభిమానులు పిలుచుకునే హిట్టర్లు మళ్లీ ఘోరంగా ఫెయిలయ్యారు. 

8 పరుగులు చేసి ట్రావిస్ హెడ్, 18 పరుగులు చేసి అభిషేక్ శర్మ, 17 పరుగులకే ఇషాన్ కిషన్.. ఇలా సన్ రైజర్స్ 50 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. అయితే.. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి 31 పరుగులు, క్లాసెన్ 27 పరుగులు చేసి SRH జట్టుకు 100 పరుగుల మార్క్ చేరుకునేందుకు సాయపడ్డారు. ఈ ఇద్దరూ ఔట్ అయిన తర్వాత SRH బ్యాటింగ్ తీరు మళ్లీ అదే తంతు. అనికేత్ వర్మ 18 పరుగులు, మెండిస్ ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్టారు.

ALSO READ | SRH vs GT : సన్ రైజర్స్ మూడో వికెట్ ఔట్

జట్టు కెప్టెన్ కమ్మిన్స్ 22 పరుగులు, షమీ 6 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో SRH జట్టు 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులైనా చేయగలిగింది. గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో సన్ రైజర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి SRH బ్యాటింగ్ ను గట్టి దెబ్బకొట్టాడు. ప్రసీద్ కృష్ణ 2 వికెట్లు, సాయి కిషోర్ 2 వికెట్లతో రాణించారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ లోయెస్ట్ స్కోరింగ్ మ్యాచ్ లో గెలవాలంటే ఒక్కటే దారి. వాంఖడే వేదికకగా 2018 ఏప్రిల్ 24న ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆడినట్టు ఆడాలి. ఆ మ్యాచ్ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచుల్లో ఆ మ్యాచ్ స్థానం వేరు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు 18.4 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లు SRH బ్యాటింగ్ను కుప్పకూల్చారు. ఆ తర్వాత 119 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టుకు SRH బౌలర్లు అంతకు మించిన షాక్ ఇచ్చారు.

18.5 ఓవర్లలో 87 పరుగులకే ముంబై జట్టును ఆలౌట్ చేసి ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని SRH జట్టు కైవసం చేసుకుంది. 119 పరుగులు మాత్రమే చేసి ప్రత్యర్థిని 87 పరుగులకే కట్టడి చేసి SRH జట్టు శభాష్ అనిపించుకుంది. 152 పరుగులు చేసిన ప్రస్తుత మ్యాచ్లో కూడా అదే రీతిలో గుజరాత్ బ్యాటింగ్కు  SRH బౌలర్లు అడ్డుకట్ట వేస్తేనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచే అవకాశం ఉంది. లేకపోతే.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న SRH మరో అపజయాన్ని మూటగట్టుకుని విమర్శల పాలవక తప్పదు.