
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్)
డెక్కన్ చార్జర్స్ స్థానంలో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టి నాలుగో ప్రయత్నంలోనే టైటిల్ నెగ్గిన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. 2016 డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో కప్పు అందుకున్న సన్ రైజర్స్ మరోసారి విజేతగా నిలవలేకపోయింది. 2016 నుంచి 2019 వరకు వరుసగా నాలుగుసార్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లిన ఆ జట్టు తర్వాతి మూడు సీజన్లలో తీవ్రంగా నిరాశపరిచింది. కానీ, ఆస్ట్రేలియా స్టార్ పాట్ కమిన్స్ కెప్టెన్సీలో గత సీజన్‌లో తమ రూపురేఖలను పూర్తిగా మార్చుకొని బరిలోకి దిగిన సన్ రైజర్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను గడగడలాడించింది. అదిరిపోయే ఆటతో ఫైనల్ చేరినా.. కేకేఆర్‌ను పడగొట్టలేక రన్నరప్‌తో సరిపెట్టింది.
ఈ సీజన్ వేలానికి ముందు కెప్టెన్ కమిన్స్, డేర్ డెవిల్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్‌తో పాటు తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డిని రిటైన్ చేసుకొని కోర్ టీమ్‌ను అలాగే నిలుపుకుంది. వీళ్లకు తోడుగా ఇషాన్ కిషన్, కమిందు మెండిస్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, రాహుల్ చహర్ వంటి ఆటగాళ్లను తీసుకొని అన్ని విభాగాలను మరింత బలోపేతం చేసుకుంది. గత సీజన్ జోరును కొనసాగిస్తూ... ఈ సారి కచ్చితంగా కప్పు కొట్టాలని కృత నిశ్చయంతో బరిలోకి దిగుతోంది.
బలాలు
బ్యాటింగే సన్ రైజర్స్ ప్రధాన బలం. లీగ్‌లోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ యూనిట్ రైజర్స్ సొంతం. గతేడాది పవర్‌ప్లేలో ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకున్న ఓపెనర్లు హెడ్, అభిషేక్, నిలకడకు మారుపేరైన హెన్రిచ్ క్లాసెన్, రోజు రోజుకూ మెరుగవుతున్న నితీష్ రెడ్డికి ఇప్పుడు మరో డ్యాషింగ్ బ్యాటర్ ఇషాన్ జతయ్యాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో దంచికొట్టిన అభినవ్ మనోహర్ కూడా రావడంతో అవతలి జట్ల బౌలర్లకు తలనొప్పి తప్పేలా లేదు. 17వ సీజన్‌లో రైజర్స్ పవర్ ప్లేలోనే 120 రన్స్ చేసింది.
మూడుసార్లు 260 ప్లస్ స్కోర్లు చేయడంతో పాటు అత్యధిక స్కోరు (287/3) రికార్డును బ్రేక్ చేసింది. ఈసారి 300 మార్కుపై ఫోకప్ పెట్టే చాన్సుంది. కమిన్స్ వరల్డ్ క్లాస్ కెప్టెన్సీ జట్టుకు అదనపు బలం. లీడర్‌గానే కాకుండా ప్రధాన పేసర్‌గానూ తను టీమ్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈసారి ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, ఐపీఎల్‌లో రెండుసార్లు పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్, జైదేవ్ ఉనాద్కట్, వియాన్ ముల్డర్ చేరికతో పేస్ విభాగం మరింత పదునెక్కింది. ఆస్ట్రేలియా స్టార్ ఆడమ్ జంపా, ఐపీఎల్‌లో మంచి రికార్డున్న రాహుల్ చహర్‌తో స్పిన్ కూడా బలంగానే కనిపిస్తోంది.
బలహీనతలు
గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్న కెప్టెన్ కమిన్స్ ఫిట్‌నెస్‌పై ఆందోళన ఉంది. తను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ మధ్యే బౌలింగ్ ప్రారంభించాడు. ఈ కారణం వల్ల కమిన్స్ ఆటకు దూరమైతే జట్టుపై తీవ్ర ప్రభావం ఉండనుంది. షమీ ఫిట్‌నెస్‌పైనా అనుమానాలున్నాయి. రాహుల్ చహర్, ఆడమ్ జంపాకు తోడుగా బ్యాకప్ స్పిన్నర్లు లేరు.
జీషన్ అన్సారీకి టీ20ల్లో అనుభవం తక్కువ. టి. నటరాజన్ జట్టు మారడంలో డెత్ ఓవర్లలో రైజర్స్ బౌలింగ్ వీక్ అవ్వనుంది. హర్షల్ పటేల్‌కు అనుభవం ఉన్నా.. ఫ్లాట్ పిచ్‌లపై ఇబ్బంది పడుతున్నాడు. ఈసారి రైజర్స్ జట్టులో 20 మంది ప్లేయర్లే ఉండటంతో బెంచ్ బలం తగ్గింది. ప్రధాన ఆటగాళ్లకు గాయాలైతే ఇది ఇబ్బందిగా మారొచ్చు. బ్యాటింగ్ విభాగంపై అతిగా ఆధారపడటం కూడా ప్రతికూలంగా మారొచ్చు.
అవకాశాలు
బ్యాటింగ్‌లో అత్యంత పవర్‌ఫుల్‌గా. అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న సన్ రైజర్స్ వద్ద ట్రోఫీ నెగ్గే బలమైన సైన్యం ఉంది. అయితే, కీలక ఆటగాళ్ల గాయాల చరిత్ర, ఫిట్‌నెస్ సమస్యలు ప్రతికూలంగా మారొచ్చు. కమిన్స్, షమీ తదితరులు ఫిట్‌గా ఉండి, మిగతా ప్లేయర్లు అదే జోరును కొనసాగిస్తే రైజర్స్ ఈజీగా ప్లేఆఫ్స్ చేరి టైటిల్ రేసులో నిలవగలదు. ఈసారి రైజర్స్ తరఫున సత్తా చాటితే ఇషాన్ కిషన్ తిరిగి టీమిండియాలోకి వచ్చే చాన్సుంది.
సన్ రైజర్స్ జట్టు
పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చహర్, ఆడమ్ జంపా, అథర్వ తైడే, అభినవ్ మనోహర్, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జైదేవ్ ఉనద్కట్, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఎషాన్ మలింగ, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్.