
- శ్రేయస్, శార్దూల్, చహర్, ఇషాన్‌కు మస్తు డిమాండ్
- మ. 12 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
బెంగళూరు: రెండు రోజులు.. పది టీమ్స్.. 217 ఖాళీలు.. 561.5 కోట్లు.. 600 మంది ప్లేయర్లు..! క్రికెట్ ఫ్యాన్స్, ముఖ్యంగా ఐపీఎల్‌ను ఫాలో అయ్యే వాళ్లు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఒక్క దెబ్బతో క్రికెటర్లను కోటీశ్వరులను చేసేందుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 15వ సీజన్ కోసం బెంగళూరు వేదికగా శని, ఆదివారాల్లో మెగా ఆక్షన్ జరగనుంది. కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ సహా పది టీమ్స్‌లో ఖాళీగా ఉన్న 217 ప్లేస్‌ల కోసం మొత్తం 600 మంది ప్లేయర్లు బరిలో నిలిచారు. లీగ్‌లో ఇదే చివరి మెగా–ఆక్షన్ కావడంతో రాబోయే ఐదారేళ్లను దృష్టిలో ఉంచుకొని బలమైన టీమ్స్‌ను తయారు చేసుకోవాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. దాంతో, గత రికార్డులన్నీ ఈ ఆక్షన్‌లో బద్దలవనున్నాయి. టీమిండియా డ్యాషింగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడే చాన్సుంది. ఈ ఇద్దరూ లీగ్ హిస్టరీలోనే ఖరీదైన ప్లేయర్లుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ సీజన్ ఆక్షన్‌లో పది మంది కంటే ఎక్కువ క్రికెటర్లు ఏడున్నర కోట్ల నుంచి మ్యాగ్జిమమ్ 20 కోట్ల వరకూ పలకొచ్చని లీగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆక్షన్‌లో అయ్యరే టాపర్‌గా నిలిచే అవకాశం ఉండగా..శార్దూల్, ఇషాన్ కిషన్ రూ. 12–15 కోట్లు సొంతం చేసుకునే చాన్సుంది. మరో పేస్ ఆల్‌రౌండర్ దీపక్ చహర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కోసం ఫ్రాంచైజీలు రూ. 15 కోట్ల దాకా ఖర్చు పెట్టే అవకాశం లేకపోలేదు. లాస్ట్ సీజన్ టాప్ వికెట్ టేకర్స్ హర్షల్, అవేశ్ పది కోట్ల దాకా పలకనుండగా.. సీనియర్ ఇండియన్స్ అశ్విన్, రహానె, రాయుడుకు కూడా మంచి రేటు రావొచ్చు.
ఫారిన్ నుంచి వార్నర్, డికాక్, హోల్డర్‌పై కన్ను
ఫారిన్ ప్లేయర్లలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ హాట్ కేక్ అయ్యే చాన్సుంది. టీ20 వరల్డ్‌కప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన వార్నర్ కోసం కొత్త టీమ్ లక్నో సూపర్‌జెయింట్స్ పెద్ద మొత్తం ఖర్చు చేయనుందని తెలుస్తోంది. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ కోసం ఆర్‌సీబీ రూ. 12 కోట్లు రెడీ చేసినట్టు సమాచారం. సౌతాఫ్రికా వికెట్ కీపర్ డికాక్ కోసం పోటీ ఎక్కువే ఉంది.
షారుక్, నితీశ్, త్రిపాఠి, పడిక్కల్‌పై ఫోకస్
ఇండియా డొమెస్టిక్ ప్లేయర్లలో తమిళనాడు ఆల్‌రౌండర్ షారుక్ ఖాన్‌కు డిమాండ్ ఉంది. తను 5 నుంచి 8 కోట్లు పలికే చాన్సుంది. కేకేఆర్ మాజీ బ్యాటర్లు నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఆర్‌సీబీ తరఫున సూపర్ పెర్ఫామెన్స్ చూపెట్టిన ఓపెనర్ పడిక్కల్‌పై కూడా ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి.
అండర్19 హీరోల లేట్ ఎంట్రీ
అండర్-–19 వరల్డ్ కప్ విన్నింగ్ ఇండియా టీమ్ నుంచి పది మంది ప్లేయర్లను శుక్రవారం రాత్రి ఆక్షన్ లిస్ట్‌లో చేర్చారు. ఇండియన్స్‌కు కనీసం 19 ఏళ్ల ఏజ్ లిమిట్, స్టేట్ సీనియర్ టీమ్‌కు ఒక మ్యాచ్ అయినా ఆడాలన్న రూల్ నుంచి ఎగ్జెంప్షన్ ఇచ్చి కెప్టెన్ యశ్ ధూల్, వైస్ కెప్టెన్ రషీద్ తదితరులను అనుమతించారు. దాంతో, ఆక్షన్‌లో పాల్గొనే ప్లేయర్ల సంఖ్య 600కు పెరిగింది.
ఫస్ట్ డే 161 మందే..
2018 నుంచి ఐపీఎల్ ఆక్షనీర్‌గా ఉన్న ఇంగ్లండ్‌కు చెందిన హ్యూ ఎడ్మీడ్స్ ఈసారి కూడా ఆక్షన్ నిర్వహిస్తాడు. ఫస్ట్ డే ఆక్షన్‌లో 161 మంది క్రికెటర్లను మాత్రమే పిలుస్తారు. ముందుగా పది మందితో కూడిన కీలక ప్లేయర్ల సెట్ (మార్కీ సెట్)తో ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇందులో అశ్విన్, డికాక్, ధవన్, డుప్లెసిస్, శ్రేయస్, వార్నర్ తదితరులు ఉన్నారు. ఆపై ప్లేయర్లను వాళ్ల స్పెషలైజేషన్ ఆధారంగా.. బ్యాటర్స్, పేసర్స్, స్పిన్నర్స్‌గా మొత్తం 62 సెట్లలో చేర్చారు. రొటేషన్ పద్ధతిలో ఒక్కో సెట్‌ను పిలుస్తారు. సెకండ్ డే ఆక్షన్ స్పీడప్ అవుతుంది. ఈ సారి రైట్ టు మ్యాచ్ ఆప్షన్ లేదు.
సైలెంట్ టై బ్రేకర్
ఓ ప్లేయర్ కోసం రెండు టీమ్స్ సేమ్ అమౌంట్ బిడ్ చేసిన తర్వాత వాటి ఖాతాలోని డబ్బు మొత్తం పూర్తయితే సైలెంట్ టై బ్రేకర్‌ను ఆశ్రయిస్తారు. ఇందులో భాగంగా సదరు ఫ్రాంచైజీ ఆ ప్లేయర్‌కు మ్యాగ్జిమమ్ ఎంత మొత్తం ఇవ్వగలదో చెబుతూ క్లోజ్డ్ బిడ్ వేయాలి. ఎక్కువ బిడ్ చేసిన టీమ్‌కు ఆ ప్లేయర్ దక్కుతాడు.
మ్యాగ్జిమమ్ 25 మంది
ఆక్షన్‌లో ప్లేయర్లను కొనుక్కునేందుకు ప్రతి టీమ్ మ్యాగ్జిమమ్ రూ. 90 కోట్లు ఖర్చు పెట్టొచ్చు. ఓ టీమ్ కనీసం 18 మంది, గరిష్టంగా 25 మందిని కొనుక్కోవచ్చు. రిటెన్షన్ పాలసీ ప్రకారం పాత 8 టీమ్స్‌కు నలుగురేసి ప్లేయర్లను, రెండు కొత్త టీమ్స్ ముగ్గురేసి ప్లేయర్లను రిటైన్ చేసుకునే చాన్స్ ఇచ్చారు. ఈ రిటెన్షన్స్ తర్వాత ఆయా టీమ్స్ ఖాతాలో మిగిలిన డబ్బు, ఖాళీగా ఉన్న స్లాట్స్ వివరాలు: సీఎస్‌కే(48 కోట్లు, 21 స్లాట్స్), ఢిల్లీ (47.5 కోట్లు, 21 స్లాట్స్), కేకేఆర్(48 కోట్లు, 21స్లాట్స్), లక్నో (59 కోట్లు,22 స్లాట్స్), ముంబై (48 కోట్లు, 21 స్లాట్స్), పంజాబ్ (72కోట్లు, 23 స్లాట్స్), రాజస్తాన్ (62కోట్లు, 22 స్లాట్స్), ఆర్‌సీబీ (57కోట్లు, 22 స్లాట్స్), ఎస్‌ఆర్‌హెచ్ (68కోట్లు, 22 స్లాట్స్), గుజరాత్ (52కోట్లు, 22 స్లాట్స్).
ఏ బేస్ ప్రైజ్‌లో ఎంత మంది
రూ. 2 కోట్లు‑ 48; రూ. 1.5 కోట్లు‑ 20; రూ. 1 కోటి-34; రూ. 75 లక్షలు‑25; రూ.50 లక్షల నుంచి రూ. 20 లక్షలు‑ 473.