ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్.. కప్పు కొట్టినట్టేనా..? ఇతనే ఎందుకంటే..

ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్.. కప్పు కొట్టినట్టేనా..? ఇతనే ఎందుకంటే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఆ జట్టు యాజమాన్యం ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రజత్ పాటిదార్కు అప్పగించింది. గురువారం(ఫిబ్రవరి 13, 2025) జరిగిన కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(KSCA) ఈవెంట్లో ఆర్సీబీ ఫ్రాంచైజీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. పాటిదార్ 2021లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఆర్సీబీలోనే కొనసాగుతున్నాడు. పేస్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కోగలిగిన బ్యాట్స్ మెన్ గా రాణించాడు. ఆర్సీబీ తరపున మొత్తం 27 మ్యాచులు ఆడాడు. 799 పరుగులతో పాటిదర్ స్ట్రైక్ రేట్ 158.85గా ఉంది.

రూ.11 కోట్లకు ఆర్సీబీ జట్టు రజత్ పాటిదర్ను రిటైన్ చేసుకుంది. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టు కెప్టెన్గా పాటిదార్ ఇప్పటికే తన టీం ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో 9 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 428 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ లాంటి స్టార్ క్రికెటర్లు నడిపించిన ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం పాటిదార్కు దక్కింది. 

ALSO READ | పంత్ను యాక్సిడెంట్ నుంచి కాపాడిన యువకుడు చావుబతుకుల్లో..

ఐపీఎల్లో రజత్ పాటిదార్కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2022లో జరిగిన ఐపీఎల్ ప్లేఆఫ్స్లో లక్నో సూపర్ గెయింట్స్ జట్టుపై 54 బంతుల్లో 112 పరుగులతో సెంచరీ చేసి ఆర్సీబీ అభిమానుల మనసులను గెలిచాడు. ఈ సెంచరీ కేవలం పాటిదార్ను సమర్థవంతమైన బ్యాటర్ గానే కాదు తీవ్రమైన ఒత్తిడిలో కూడా రాణించగలిగిన క్రికెటర్ పాటిదార్ అని అందరికీ తెలిసేలా చేసింది. ఆర్సీబీ యాజమాన్యానికి పాటిదార్ పై పూర్తి నమ్మకం ఉంది. అందుకే.. రూ.11 కోట్లు చెల్లించడానికి కూడా ఏమాత్రం వెనుకాడలేదు.

అతని నాయకత్వంపై, మ్యాచ్ గెలిపించగలిగిన లక్షణాలపై ఆర్సీబీ యాజమాన్యానికి గురి కుదిరాకే కెప్టెన్సీ బాధ్యతలను రజత్ పాటిదార్ కు అప్పగించింది. ఐపీఎల్ లో ఒక్క సీజన్లోనైనా కప్ కొట్టలేక ఈసారైనా ఎట్టి పరిస్థితుల్లో ట్రోఫీ కైవసం చేసుకోవాలని ఆర్సీబీ గట్టి పట్టుదలతో ఉంది. విరాట్ కోహ్లీ నాయకత్వంతో దాదాపుగా ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. రజత్ పాటిదార్ నాయకత్వంలోనైనా ఆర్సీబీకి అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి.