వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభమవ్వడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ.. టీమిండియా ప్రదర్శన అంతంత మాత్రమే. మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతున్న సమయంలో వరల్డ్ కప్ కు అర్హత సాధించని వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలవ్వడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అందునా గాయాల బెడదతో కీలక ఆటగాళ్లు నెలల తరబడి జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)కే పరిమితమవ్వడం జట్టు సన్నద్ధతను ప్రశ్నిస్తోంది.
కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్
ఈ ముగ్గురూ భారత క్రికెటర్లే. కానీ ఎప్పుడు జట్టులో ఉంటారన్నది అంతుపట్టని విషయం. ఒక సిరీస్‌లో కనిపించారా! మరో ఏడాది పాటు ఏ సిరీస్‌లోనూ కనిపించరు. ఏ అంటే.. గాయాలు. వీళ్లే చేసుకుంటున్నారో! లేదా అవే అవుతున్నాయో! తెలియదు కానీ గాయాలే. ఈ సాకుతో నాలుగు నెలలు ఇంటిదగ్గర, మరో 6 నెలలు బీసీసీఐ జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో గడుపుతున్నారు. ఇదే భారత మాజీ దిగ్గజం కపిల్ దేవ్‌కు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
కొన్నిగంటల క్రితం టీమిండియా(Team India) సీనియర్ ఆటగాళ్లలో అహంకారం పెరుగుతోందని, అన్నీ తమకే తెలుసన్న ఉద్దేశ్యంతో ఎవరినీ సలహా అడగాలని అనుకోరనీ విమర్శించిన కపిల్ దేవ్(Kapil Dev).. తాజాగా మరోసారి ఆటగాళ్లపై మండిపడ్డారు. అయితే ఈ మాజీ దిగ్గజం ఈసారి ఆటగాళ్ల నిబద్ధతను ప్రశ్నించాడు. ఐపీఎల్(IPL)లో ఆడటానికి అడ్డురాని గాయాలు.. జాతీయ జట్టుకు వచ్చేసరికి ఎందుకు సాకుగా మారుతున్నాయని కపిల్ దేవ్.. ఆటగాళ్లను ప్రశ్నించారు.
బుమ్రా ఎక్కడ? ఏమైంది?
అసలు బుమ్రా ఎక్కడ? అతనికి ఏమైంది? అతడు కోలుకున్నాడని చెబుతున్నారు. ఒకవేళ గాయం కారణంగా ఏడాది పాటు జట్టుకు దూరమైన బుమ్రా(Jasprit Bumrah) ప్రపంచకప్ నాటికి అందుబాటులో లేకపోతే అతడి కోసం సమయం వృథా చేసినట్లే కదా! ఇక రిషభ్ పంత్. అతనొక గొప్ప క్రికెటర్. ఒకవేళ అతడే గనుక జట్టుతో ఉంటే మన టెస్టు క్రికెట్ పరిస్థితి మెరుగ్గా ఉండేది. కానీ ఏం జరిగింది? ప్రమాదంలో గాయపడ్డ అతడు కూడా దాదాపు ఏడు నెలలుగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు.." అంటూ కపిల్ దేవ్ యువ ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ALSO READ: ఐపీఎల్ డబ్బు వల్ల ఆటగాళ్లలో అహంకారం పెరుగుతోంది: కపిల్ దేవ్
ఐపీఎల్ మిమ్మల్ని నాశనం చేస్తుంది
ఇక ఐపీఎల్ గురించి మాట్లాడిన ఈ మాజీ దిగ్గజం ఈ టోర్నీ నిర్వహిస్తున్న బీసీసీఐని ఇండైరెక్ట్ గా కడిగిపడేశారు."ఐపీఎల్ గొప్ప లీగే కాదనను. అయితే, అదే మిమ్మల్ని దెబ్బతీస్తుంది. చిన్న చిన్న గాయాలతో మీరు ఐపీఎల్‌లో ఆడతారు. అన్ని మ్యాచులకు అందుబాటులో ఉంటారు. అదే జాతీయ జట్టు విషయానికొస్తే ఆడరు. విశ్రాంతి తీసుకుంటారు. బీసీసీఐ ఈ విషయంలో ఎందుకు ఆలోచించట్లేదు. ఎవరైనా ఈ రోజైనా ఆలోంచించారా! నేను చాలా ఓపెన్‌గా చెబుతున్నా.." అంటూ రాహుల్, బుమ్రా, అయ్యర్ వంటి సీనియర్లను ఉద్దేశిస్తూ కపిల్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"IPL is a great thing but IPL can spoil you also"
— CRICKETNMORE (@cricketnmore) July 31, 2023
- Kapil Dev ?️ pic.twitter.com/i23p96UAwP