IPL లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. రాజస్థాన్ తో జరిగిన ఫైట్ లో 8 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. 175 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయలేక రాజస్థాన్ చేతులెత్తేసింది. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఒన్ మ్యాన్ షోతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది చెన్నై.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది. చివర్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మెరుపులతో చెన్నై భారీ స్కోరు చేసింది. ధోని 46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 రన్స్ చేశాడు.
బ్యాటింగ్ లో చైన్నై టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. రాయుడు ఒక పరుగుకే ఔట్ అయ్యాడు. వాట్సన్ 13 రన్స్ మాత్రమే చేశాడు. సురేష్ రైనా కాసేపాడిన, జాదవ్ వెంటనే ఔటయ్యాడు. వికెట్లు పడటంతో చెన్నై స్కోరు మరీ స్లోగా నడిచింది. 17 ఓవర్లు పూర్తయ్యే వరకు కూడా చెన్నై 115 పరుగులు మాత్రమే చేసింది. చివరి 2 ఓవర్లే చెన్నై ఇన్నింగ్స్ ను మలుపు తిప్పాయి. అప్పటిదాకా కూల్ గా ఆడిన ధోని సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో చివరి 2ఓవర్స్ లోనే చెన్నై ఏకంగా 52 పరుగులు చేసింది. కులకర్ణి వేసిన 18వ ఓవర్లో ధోని సిక్స్, బ్రేవో ఫోర్, సిక్స్ కొట్టడంతో పాటు నోబాల్, వైడ్ కలుపుకొని 24 పరుగులు వచ్చాయి. అర్చర్ 19వ ఓవర్లో 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక మిగిలింది ఒకే ఓవర్ . చివరి ఓవర్ లో చెలరేగి ఆడాడు ధోని. మొదట జడేజా సిక్సర్ బాదగా… చివరి 3బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు ధోని. ధోని మెరుపులతో 175 పరుగుల భారీ స్కోరు సాధించింది.
176 రన్స్ ఛేజింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ రహానే ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. సంజూ సామ్సన్ 8 పరుగులు, బట్లర్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. కష్టాల్లో ఉన్న రాజస్థాన్ ను రాహుల్ త్రిపాఠి, స్టీవ్ స్మిత్ గట్టెక్కించే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్ కు 61 పరుగుల పాట్నర్ షిప్ చేశారు. 75 పరుగుల దగ్గర త్రిపాఠి ఔటయ్యాడు. వెంటనే స్మిత్ కూడా పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ మళ్లీ కష్టాల్లోకి వెళ్లింది.
ఈసమయంలో ఆర్చర్ తో కలిసి స్టోక్స్ దూకుడుగా ఆడాడు. స్టోక్స్ 26 బంతుల్లో 46 రన్స్ చేశాడు. విజయానికి చివరి ఓవర్లో 12 పరుగులు కవాల్సి ఉండటంతో రాజస్థాన్ శిబిరంలో ఆశలు చిగురించాయి. ఫస్ట్ బాల్ కే స్టోక్స్ ఔటవడంతో ఆ ఆశలు ఆవిరైపోయాయి. రాజస్థాన్ ప్లేయర్స్ చేతులెత్తేయడంతో ఈసీజన్ లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది చెన్నై.