క్యాష్ రిచ్ లీగ్ గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఫ్రాంచైజీల ఆదాయం భారీగా తగ్గినట్లు ఓ నివేదిక వెల్లడించింది. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మినహా అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీల సగటు ఆదాయంలో కోత పడినట్లు మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ప్రైవేట్ సర్కిల్ నివేదికను బయటపెట్టింది. FY 2019 (COVIDకి ముందు కాలం)తో పోలిస్తే FY 2023 (ఆర్థిక సంవత్సరం)లో 23 శాతం క్షీణతను నమోదు చేసినట్లు నివేదికలో పేర్కొంది. అన్ని జట్ల సగటు ఆదాయం FY19లో రూ. 394.28 కోట్లు కాగా, FY23లో రూ. 307.5 కోట్లకు పడిపోయింది.
మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ 'ప్రైవేట్ సర్కిల్' ప్రచురించిన నివేదిక ప్రకారం.. అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్(కెకెఆర్) ఆదాయంలో 38 శాతం.. అత్యల్పంగా రిలయన్స్ గ్రూప్ యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ 9 శాతం తగ్గుదల నమోదు చేసినట్లు ప్రకటించింది.
స్పాన్సర్‌షిప్‌ల ద్వారా భారీ ఆదాయం
అదే సమయంలో స్పాన్సర్‌షిప్‌ల ద్వారా ఫ్రాంచైజీలకు భారీ ఆదాయం సమకూరినట్లు ప్రైవేట్ సర్కిల్ తమ నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా, ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB).. FY 2023లో స్పాన్సర్‌షిప్ ద్వారా అత్యధికంగా రూ. 83 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రూ. 78 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రెండవ స్థానంలో ఉంది. అనంతరం GMR గ్రూప్, JSW గ్రూప్ యాజమాన్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్(DC) 2023 ఆర్థిక సంవత్సరంలో స్పాన్సర్‌షిప్ ద్వారా రూ. 72 కోట్లు ఆర్జించాయి.
ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ మైదానం వెలుపల కూడా విజయం సాధించింది. FY 2022తో పోలిస్తే 2023 FYలో వారి స్పాన్సర్‌షిప్ ఆదాయంలో 19 శాతం పెరుగుదల కనిపించింది. అదే సమయంలో RPSG గ్రూప్ యాజమాన్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ వారి ప్రారంభ ఐపీఎల్ ఎడిషన్ (2022)తో పోలిస్తే.. FY 23లో స్పాన్సర్‌షిప్‌ల ద్వారా ఆదాయంలో 562 శాతం వృద్ధిని సాధించింది.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఓ సరికొత్త విప్లవమని చెప్పుకోవాలి. ఈ టోర్నీ ఎంతో మంది స్వదేశీ, విదేశీ ఆటగాళ్లని కోటీశ్వరులను చేసింది. లీగ్ కోట్ల ఖర్చుతో కూడుకున్న ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలకు లాభం కూడా అలానే ఉంటుంది. ఐపీఎల్‌లో మీడియా హక్కుల ద్వారానే ఫ్రాంచైజీలకు అత్యధిక ఆదాయం వస్తుంది. ఐపీఎల్ నిర్వహణలో వచ్చే ఆదాయం మొత్తంలో 60 నుంచి 70 శాతం ఆదాయం మీడియా హక్కుల ద్వారానే లభిస్తుంది. స్పాన్సర్‌షిప్ ల ద్వారా అందే ఆదాయం దీనికి అదనం.