ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాకతో క్రికెట్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వ్యాఖ్యానించారు. రెండు దశాబ్దాల క్రితం క్రికెట్ మ్యాచ్ అంటే 250-300 మంచి స్కోరని, అదే ఇప్పుడు 400 పరుగులు క్రమం తప్పకుండా వస్తున్నాయని తెలిపారు. ఐపీఎల్ టోర్నీ వల్లే అది సాధ్యమైందని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రతిభను గుర్తించడంలో కానీ, ఆదాయం సృష్టించడంలో కానీ ఐపీఎల్ ముఖ్యమైన పాత్రను పోషించడమే కాకుండా మూడు రకాల ఆటలను మరింత పోటీగా మార్చిందని అరుణ్ ధుమాల్ అన్నారు. ప్రారంభ సీజన్ 2008 నాటి నుండి టీ20 క్రికెట్ విపరీతంగా అభివృద్ధి చెందిందని ఆయన మాట్లాడారు. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్ వంటి అనేక మంది ఆటగాళ్లు ఐపీఎల్ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శనల తర్వాతే జాతీయ జట్టుకు ఎంపికైన విషయాన్ని ఆయన ప్రత్యక్ష ఉదారణగా వివరించారు.
''కొత్త ఆటగాళ్లను గుర్తించే విషయంలో ఐపీఎల్ అద్భుతంగా పనిచేసింది. యువ ప్రతిభకు గొప్ప టోర్నమెంట్‌గా మారింది. ప్రతి సీజన్‌లో యశస్వి జైస్వాల్, రింకూ సింగ్ వంటి చాలా ప్రతిభావంతులైన యువకులు వస్తారని మేం ముందుగానే ఆశించాం. అనుకున్నట్లుగానే వచ్చారు. గొప్ప ప్రదర్శనల అనంతరం దేశానికి ఆడుతున్నారు. ఈ సీజన్ కూడా అలాగే ఉంటుంది.."
ప్రపంచంలో రెండో అత్యంత సంపన్న లీగ్
''ఖచ్చితంగా, గత 15 ఏళ్లలో ఐపీఎల్ ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న క్రీడా లీగ్‌గా అవతరించింది. USA నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) కంటే ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్ విలువ పరంగా రెండవ అత్యంత ఖరీదైనది. ఐపీఎల్ రాకతో క్రికెట్ ఎలా విపరీతంగా మారిపోయిందో మీరు ఊహించవచ్చు. టెస్టు మ్యాచ్‌లు ఎక్కువ ఫలితాలను ఇవ్వడం, వన్డేలు మరింత పోటీతత్వంతో ఉండడం ఐపీఎల్ వల్లనే చూస్తున్నాం.."
"రెండు దశాబ్దాల క్రితం 250-300 మంచి స్కోరు. ఇప్పుడు 400 క్రమం తప్పకుండా వస్తున్నాయి. వన్డేలో సచిన్ తొలిసారి 200 పరుగులు చేసినప్పుడు మేమంతా సంబరాలు చేసుకున్నాము. ఆ తర్వాత చాలా మంది 200 పరుగులు చేశారు. వేగంగా ఆడటంతో ఐపీఎల్ ఎంతో సహాయపడింది."
మార్చి 22 నుంచి ఐపీఎల్
ఈ ఏడాది మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభంకానున్నట్లు తెలిపిన అరుణ్ ధుమాల్, సార్వత్రిక ఎన్నికల తేదీలు ప్రకటించిన అనంతరం మిగిలిన ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తామని వెల్లడించారు.