న్యూఢిల్లీ : ఐపీఎల్ కొత్త సీజన్ వచ్చే ఏడాది మార్చి 14–మే 25వ తేదీల మధ్య జరగనుంది. ఈ మేరకు లీగ్ ప్రాథమిక షెడ్యూల్‌ను బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తెలియజేసింది. 2026, 2027 ఎడిషన్ల ఐపీఎల్‌ను కూడా ఇదే విండోలో నిర్వహిస్తామని తెలిపింది. 2026 సీజన్ లీగ్ మార్చి 15న మొదలై మే 31న జరిగే ఫైనల్‌తో ముగిసేలా, 2027 ఎడిషన్ మార్చి 14న ఆరంభించి మే 30న ముగించేలా ప్లాన్ చేస్తున్నట్టు ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చింది. ఈ మూడు ఫైనల్స్ ఆదివారం జరిగేలా షెడ్యూల్ రూపొందించింది.
అలాగే, వచ్చే సీజన్ నుంచి మ్యాచ్‌ల సంఖ్యను పెంచాలని ప్లాన్ చేసిన బీసీసీఐ లీగ్‌కు మొత్తంగా పదిన్నర వారాల సమయం ఉండేలా చూస్తోంది. మరోవైపు గాయం నుంచి కోలుకుంటున్న ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్, ఇండియాలో పుట్టి అమెరికాకు ఆడుతున్న పేసర్ సౌరభ్ నేత్రవాల్కర్, అన్‌క్యాప్డ్ ముంబై కీపర్ హార్దిక్ తమోరెను జెడ్డాలో ఆది, సోమవారాల్లో జరిగే ఐపీఎల్ మెగా వేలం జాబితాలో చేర్చాలని నిర్ణయించింది.