- కమిన్స్, హెడ్, అభిషేక్‌నూ రిటైన్ చేసుకుంటున్న సన్ రైజర్స్
- వేలంలోకి పంత్, శ్రేయస్, రాహుల్
- ఐపీఎల్ ప్లేయర్ రిటెన్షన్స్ ప్రకటన నేడే
న్యూఢిల్లీ : గత సీజన్‌లో సూపర్ పెర్ఫామెన్స్ చేసిన ట్రావిస్ హెడ్, నితీశ్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కొనసాగనున్నారు. హెన్రిచ్ క్లాసెన్, కెప్టెన్ పాట్ కమిన్స్, ఓపెనర్ అభిషేక్ శర్మతోపాటు ఈ ఇద్దరినీ రిటైన్ చేసుకోవాలని సన్ రైజర్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. హార్డ్ హిట్టర్ క్లాసెన్‌ను తొలి ఆప్షన్‌గా తీసుకొని అతనికి రూ. 23 కోట్లు ఇస్తున్నట్టు సమాచారం. కమిన్స్‌కు 18 కోట్లు, అభిషేక్, హెడ్‌కు చెరో 14 కోట్ల ఇస్తున్న రైజర్స్ యంగ్‌స్టర్ నితీశ్‌ను రూ. 6 కోట్లతో రిటైన్ చేసుకోనుంది.
ఈ ఐదుగురి కోసం రూ. 75 కోట్లు మినహాయిస్తున్న సన్ రైజర్స్ కేవలం 45 కోట్లతోనే వేలంలో పాల్గొననుంది. ప్లేయర్ల రిటెన్షన్ ప్రకటనకు గురువారం సాయంత్రంతో గడువు ముగుస్తుండగా.. ఆయా జట్లకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్ తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను వదులుకోనుంది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ కూడా వేలంలోకి వస్తున్నారని సమాచారం. సునీల్ నరైన్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తితో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్ హర్షిత్ రాణాను కేకేఆర్ రిటైన్ చేసుకునే చాన్సుంది.
సీఎస్కే.. తమ మాజీ కెప్టెన్ ధోనీతో పాటు రుతురాజ్ గైక్వాడ్, జడేజా, శివం దూబే, శ్రీలంక పేసర్ మతీష పతిరణను కొనసాగించనుంది. మహీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రిటైన్ కానున్నాడు. గుజరాత్ టైటాన్స్‌కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన జీతం తగ్గించుకొని రెండో రిటెన్షన్‌గా ఉండేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. జీటీ తమ ఫస్ట్ రిటెన్షన్‌గా రషీద్ ఖాన్ పేరును ఖరారు చేయనుంది. ఆ తర్వాత గిల్, సాయి సుదర్శన్, అన్‌క్యాప్డ్ ప్లేయర్లు రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్‌ను రిటైన్ చేసుకోనుంది.
ఢిల్లీకి పంత్ గుడ్‌బై
టీమిండియా స్టార్ కీపర్ రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడి వేలంలోకి రానున్నాడు. తను జట్టుతోనే కొనసాగేలా ఒప్పించేందుకు ఢిల్లీ ఫ్రాంచైజీ చివరి నిమిషం వరకూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేఎల్ రాహుల్ లక్నోను వీడటం ఖాయం కాగా.. ఆర్‌సీబీ విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, అన్‌క్యాప్డ్ ప్లేయర్ యష్ దయాల్ ముగ్గురినే కొనసాగించే చాన్స్ ఉంది. పంజాబ్ కింగ్స్ ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు శశాంక్ సింగ్
ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను మాత్రమే రిటైన్ చేసుకొని వచ్చే సీజన్‌లో పూర్తి కొత్త జట్టుతో బరిలోకి దిగాలని చూస్తోంది. ముంబై ఇండియన్స్ రోహిత్, హార్దిక్, సూర్యకుమార్, బుమ్రా, తిలక్ వర్మను కొనసాగించొచ్చు. రాజస్తాన్ రాయల్స్ ఎలాంటి సంచలనాలు లేకుండా జైస్వాల్, శాంసన్, రియాన్ పరాగ్, హెట్‌మయర్, ధ్రువ్ జురెల్, సందీప్ శర్మ (అన్‌క్యాప్డ్)ను రిటైన్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.