
ఐపీఎల్ సీజన్ 18లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బోణీ కొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి సీజన్ తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతాను చిత్తు చేసింది. ఓపెనర్స్ విరాట్ కోహ్లీ (59 నాటౌట్), సాల్ట్ (56) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపగా.. చివర్లో కెప్టెన్ పటిదార్ (34) ధనాధన్ ఇన్సింగ్ ఆడటంతో ఈడెన్ గార్డెన్స్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. తద్వారా ఆర్సీబీ ఘన విజయంతో టోర్నీని మొదలుపెట్టింది. కేకేఆర్ కెప్టెన్ రహానే హాఫ్ సెంచరీ (56)తో రాణించినప్పటికీ సొంత గడ్డపై కేకేఆర్‌కు తొలి మ్యాచులో ఓటమి తప్పలేదు.
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్స్ విరాట్ కోహ్లీ (65), ఫిల్ సాల్ట్ (56) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లేలో కేకేఆర్ బౌలర్లను ఊచకోత కోశారు. కోహ్లీ, సాల్ట్ పోటీ పడి మరీ ఫోర్లు, సిక్సులు బాదటంతో పవర్ ప్లేలోనే ఆర్సీబీ 80 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. సాల్ట్ 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులు బాది 56 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టి 59 పరుగులతో అజేయంగా నిలిచాడు.
పడిక్కల్ 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పటిదార్ (34) హోరెత్తించాడు. ఫోర్లు, సిక్సులతో కేకేఆర్ బౌలర్లపై విరుచుపడ్డాడు. చివరకు పటిదార్, కోహ్లీ కలిసి ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చారు. మరో 22 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ విజయం సాధించడం గమనార్హం. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్, వైభవ్ ఆరోరా, వరుణ్ చక్రవర్తి తలా ఓ వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ రహానే (56) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఓపెనర్ సునీల్ నరైన్ (44) పరుగులతో ఆకట్టుకున్నాడు. యంగ్ బ్యాటర్ రఘువంశీ 30 పరుగులతో చివర్లో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచులో కేకేఆర్‌కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే ఓపెనర్ డికాక్ (4) వికెట్ కోల్పోయింది.
ఈ దశలో కెప్టెన్ రహానే, సునీల్ నరైన్(45) ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. ఇద్దరూ బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరి ధాటికి తొలి 6 ఓవర్లలో 60 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా వీరి దూకుడు ఆగలేదు. చూస్తుండగానే వీరి భాగస్వామ్యం 100 పరుగులకు చేరుకుంది. ఈ క్రమంలో రహానే 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
రెండో వికెట్‌కు 103 పరుగులు జోడించిన తర్వాత రహానే, నరైన్ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఇక్కడ నుంచి కేకేఆర్ పతనం మొదలైంది. వెంకటేష్ అయ్యర్ (7), రింకూ సింగ్ (12), రస్సెల్ (4) సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. యంగ్ ప్లేయర్ రఘువంశీ 30 పరుగులు చేయడంతో కోల్‌కతా 170 పరుగుల మార్క్ అయినా అందుకుంది. తొలి 10 ఓవర్లలో 107 పరుగులు చేసిన కేకేఆర్ చివరి 10 ఓవర్లలో కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్య 3 వికెట్లు పడగొట్టాడు. హేజల్ వుడ్ కు రెండు వికెట్లు దక్కాయి. యష్ దయాల్, సాయుష్ శర్మ, రసిఖ్ దార్ సలాంలకు తలో వికెట్ దక్కింది.