ముంబైపై లక్నో విక్టరీ.. రాణించిన రాహుల్‌‌‌‌‌‌‌‌, బౌలర్లు

ముంబైపై లక్నో విక్టరీ.. రాణించిన రాహుల్‌‌‌‌‌‌‌‌, బౌలర్లు

ముంబై : నికోలస్ పూరన్ (29 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 75) మెరుపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు తోడు బౌలర్లు ఆకట్టుకోవడంతో ఐపీఎల్‌‌‌‌‌‌‌‌17ను లక్నో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెయింట్స్ విజయంతో ముగించింది. సొంతగడ్డపై ఆఖరాటలో నిరాశ పరిచిన ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ పదో ఓటమితో చివరి స్థానంతో  లీగ్‌‌‌‌‌‌‌‌కు వీడ్కోలు పలికింది. శుక్రవారం వాంఖడే స్టేడియంలో జరిగిన  మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో లక్నో  18 రన్స్ తేడాతో ముంబైని ఓడించింది.  తొలుత లక్నో 20 ఓవర్లలో 214/6 స్కోరు చేసింది . కెప్టెన్ కేఎల్ రాహుల్ (41 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) ఫిఫ్టీతో రాణించాడు. ముంబై బౌలర్లలో నువాన్ తుషార, పియూష్‌‌‌‌‌‌‌‌ చావ్లా చెరో మూడు వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ముంబై 20 ఓవర్లలో 196/6 స్కోరు చేసి ఓడింది.  రోహిత్ శర్మ (38 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 68), నమన్ ధీర్ (28 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 నాటౌట్‌‌‌‌) పోరాడారు. పూరన్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.  కాగా, లక్నో 14 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఏడో విజయంతో14 పాయింట్లు సాధించినా రన్‌‌‌‌‌‌‌‌రేట్‌‌‌‌‌‌‌‌లో (- –0.66 ) వెనుకబడి ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌ అవకాశాన్ని కోల్పోయింది.  

నికోలస్ ధనాధన్

కెప్టెన్ రాహుల్ నిలకడ, నికోలస్ పూరన్‌‌‌‌‌‌‌‌ మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌తో లక్నో భారీ స్కోరు చేసింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఆ జట్టుకు తొలుత సరైన ఆరంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మూడో బాల్‌‌‌‌‌‌‌‌కే ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవదత్ పడిక్కల్‌‌‌‌‌‌‌‌ (0)ను ఎల్బీ చేసిన నువాన్‌‌‌‌‌‌‌‌ లక్నోకు షాకిచ్చాడు. రాహుల్ ఆచితూచి బ్యాటింగ్ చేయగా..  హిట్టర్ స్టోయినిస్ (28) కంబోజ్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో హ్యాట్రిక్ ఫోర్లతో ఆకట్టుకున్నాడు. చావ్లా వేసిన ఆరో ఓవర్లో రాహుల్ వరుసగా సిక్సర్లతో వేగం పెంచే ప్రయత్నం చేయగా.. ‌‌‌‌‌‌‌‌ చివరి బాల్‌‌‌‌‌‌‌‌కు స్వీప్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసిన స్టోయినిస్ ఎల్బీ అవ్వడంతో పవర్ ప్లేను లక్నో 49/2తో నిలిచింది. ఇక్కడి నుంచి రాహుల్ నింపాదిగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేయగా.. దీపక్ హుడా (11) నిరాశ పరచడంతో సగం ఓవర్లకు 69/3 స్కోరుతో నిలిచిన లక్నో 150–160 చేస్తే గొప్పే అనిపించింది. కానీ, పూరన్ రాకతో సీన్‌‌‌‌‌‌‌‌ మారింది. కంబోజ్ వేసిన 11వ ఓవర్లో సిక్స్‌‌‌‌‌‌‌‌తో అతను బౌండ్రీల ఖాతా తెరిచాడు. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న కెప్టెన్‌‌‌‌‌‌‌‌ను ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌లో నిలబెట్టిన పూరన్​ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కంబోజ్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనే 4, 4, 6, 6 కొట్టిన అతను హార్దిక్ ఓవర్లో రెండు సిక్సర్లు రాబట్టాడు.  నమన్ ధీర్ వేసిన 15వ ఓవర్లో 6, 6, 6, 4 తో రెచ్చిపోయిన పూరన్‌‌‌‌‌‌‌‌ 19 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తుషార బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను మరో షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసి ఔటవగా. అర్షద్‌‌‌‌‌‌‌‌ ఖాన్ (0) గోల్డెన్ డకౌటయ్యాడు. తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి బాల్‌‌‌‌‌‌‌‌కే రాహుల్‌‌‌‌‌‌‌‌ను చావ్లా పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చినా.. చివర్లో క్రునాల్ పాండ్యా (12 నాటౌట్‌‌‌‌‌‌‌‌), బదోనీ (22 నాటౌట్‌‌‌‌‌‌‌‌)  మెరుపులు మెరిపించి స్కోరు 200 దాటిం చారు. షెఫర్డ్‌‌‌‌‌‌‌‌ వేసిన ఆఖరి ఓవర్లో బదోనీ 6, 4, 4తో ఫిని షింగ్‌‌‌‌‌‌‌‌ టచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. 

రోహిత్ మెరిసినా

భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో  హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్ రోహిత్ అదరగొట్టినా.. అతను ఔటైన తర్వాత ముంబై విజయానికి దూరమైంది. రోహిత్ మాత్రం ఉన్నంతసేపు జోరు చూపెట్టాడు. ఇన్నింగ్స్ రెండో బాల్‌‌‌‌‌‌‌‌నే బౌండ్రీకి పంపిన అతను రెండో ఓవర్లో 6, 6తో ఊపందుకున్నాడు.  3.5 ఓవర్లలో ముంబై 33/0తో నిలిచిన దశలో వర్షంతో దాదాపు గంటపాటు ఆట ఆగిపోయింది. తిరిగి మొదలైన తర్వాత రోహిత్ అదే జోరు కొనసాగించి 29 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. నవీన్‌‌‌‌‌‌‌‌ వేసిన తొమ్మిదో ఓవర్లో 4, 6తో మరో ఓపెనర్ బ్రేవిస్ (23) కూడా వేగం పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, మరో షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసి క్రునాల్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 88 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. ఆపై సూర్యకుమార్ (0), రోహిత్‌‌‌‌‌‌‌‌ వరుస ఓవర్లలో ఔటవడంతో ముంబై 97/3తో డీలా పడింది. పేలవ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కెప్టెన్ హార్దిక్ (16) మరోసారి నిరాశ పరచగా.. నేహల్ వాధెర (1) సైతం ఫెయిలవడంతో ముంబై ఓటమి ఖాయమైంది. చివర్లో ఇషాన్‌‌‌‌(14)తో కలిసి నమన్ ధీర్ భారీ షాట్లతో అలరించాడు. కానీ, అతని పోరాటం  ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.

సంక్షిప్త స్కోర్లు

లక్నో: 20 ఓవర్లలో 214/6 (పూరన్‌‌‌‌‌‌‌‌ 75, రాహుల్ 55, తుషార 3/28, చావ్లా 3/29)
ముంబై: 20 ఓవర్లలో 196/6   (రోహిత్ 68, నమన్ 62*, బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌ 2/37)