స్టాక్ మార్కెట్‌లో తగ్గిన ఐపీఓల జోష్‌‌

స్టాక్ మార్కెట్‌లో తగ్గిన ఐపీఓల జోష్‌‌
  • మార్కెట్ పడుతుండడమే కారణం
  • గత మూడు వారాలుగా ఒక్క మెయిన్ బోర్డ్ ఐపీఓ కూడా లేదు
  • సెబీ అనుమతుల పొందినవి.. 45 కంపెనీలు
  • వెయిటింగ్‌‌లో మరో  69 కంపెనీలు 

న్యూఢిల్లీ: మార్కెట్ పడుతుండడంతో ఐపీఓల జోరు తగ్గింది.  గత మూడు వారాలుగా ఒక్క మెయిన్‌‌ బోర్డ్ ఐపీఓ కూడా ఇన్వెస్టర్ల ముందుకు రాలేదు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ వార్‌‌‌‌కు తెరతీయడంతో ఇండియన్ మార్కెట్లు గత కొన్ని నెలలుగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  ఈ ఏడాది జనవరిలో ఐదు కంపెనీల ఐపీఓలే ఓపెన్ అయ్యాయి. ఫిబ్రవరిలో ఈ నెంబర్ 4 కి పడిపోయింది. కిందటేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో 16 ఐపీఓలు ఓపెన్ అయ్యాయి.  

చివరిసారిగా క్వాలిటీ పవర్‌‌‌‌ ఎలక్ట్రిక్ ఎక్విప్‌‌మెంట్ ఇన్వెస్టర్ల ముందుకొచ్చింది. ఫిబ్రవరి 14 న ఓపెనైంది. ఐపీఓలకు ఇన్వెస్టర్ల నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో అడ్వాన్స్డ్‌‌ సిస్‌‌టెక్‌‌, ఎస్‌‌ఎఫ్‌‌సీ ఎన్విరాన్‌‌మెంటల్‌‌ టెక్నాలజీస్‌‌, వినయ్‌‌ కార్పొరేషన్ తమ  ప్లాన్‌‌ను వాయిదా వేసుకున్నాయి. కాగా,  కిందటేడాది ఐపీఓల జోరు కొనసాగింది. మొత్తం 91 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1.6 లక్షల కోట్లను సేకరించాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఫుల్ డిమాండ్ కనిపించింది. 

మార్కెట్ రికవర్ అయితే ..

మార్కెట్ రికవర్‌‌‌‌ అయితే మళ్లీ ఐపీఓలు లైన్ కడతాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. ‘చాలా కంపెనీలు లైన్‌‌లో ఉన్నాయి. మార్కెట్ పరిస్థితులు మెరుగైతే  ఇవి ఇన్వెస్టర్ల ముందుకొస్తాయి. ప్రస్తుతం 45 కంపెనీలు సెబీ అనుమతులు పొందాయి. ఇవి రూ.67 వేల కోట్లను సేకరించనున్నాయి. 69 కంపెనీలు సెబీ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిలో 45 కంపెనీలు తమ  ఐపీఓ పేపర్లను గత రెండు నెలల్లోనే సబ్మిట్ చేశాయి’ అని ఆనంద్ రాథి అడ్వైజర్స్‌‌  డైరెక్టర్‌‌‌‌ వీ ప్రశాంత్ రావు పేర్కొన్నారు. సత్వా గ్రూప్‌‌, బ్లాక్‌‌స్టోన్‌‌ స్పాన్సర్‌‌‌‌ చేస్తున్న నాలెడ్జ్‌‌ రియల్టీ ట్రస్ట్ రూ.6,200 కోట్లను రీట్ ద్వారా  సేకరించడానికి  సెబీ వద్ద ప్రిలిమినరీ పేపర్లను ఫైల్ చేసింది. 

ఎన్‌‌సీఎల్‌‌టీ అనుమతి వచ్చాక టాటా క్యాపిటల్‌‌ ఐపీఓ

ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ టాటా క్యాపిటల్  ఇన్వెస్టర్ల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఐపీఓ ద్వారా రూ.17 వేల కోట్లను సేకరించేందుకు సెబీ వద్ద త్వరలో పేపర్లను ఫైల్ చేయనుంది. టాటా మోటార్స్‌‌ ఫైనాన్స్‌‌, టాటా క్యాపిటల్ విలీనానికి  ఎన్‌‌సీఎల్‌‌టీ అనుమతులు వచ్చాక ఐపీఓ పేపర్లను సెబీ వద్ద ఫైల్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. రూ.96 వేల కోట్ల వాల్యుయేషన్‌‌తో ఐపీఓకి రానుంది. టాప్ ఎన్‌‌బీఎఫ్‌‌సీ కంపెనీ అయిన టాటా క్యాపిటల్ ఆర్‌‌‌‌బీఐ రూల్స్ ప్రకారం మార్కెట్‌‌లో లిస్ట్ కావాలి. 

ఏథర్ మరింత ముందుకు..

ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ కంపెనీ ఏథర్  ఎనర్జీ లిమిటెడ్ ఫండింగ్ రౌండ్లలో ఇష్యూ చేసిన ఔట్‌‌స్టాండింగ్ కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్ల (సీసీపీఎస్‌‌) ను ఈక్విటీగా మార్చింది. ఐపీఓకి రావడానికి రెడీ అవుతున్న కంపెనీ, మార్గాన్ని సులభం చేసుకుంది.  ఈ ఏడాది ఏప్రిల్‌‌లో కంపెనీల పబ్లిక్ ఆఫర్ ఉండొచ్చు. 1.73 కోట్ల సీసీపీఎస్‌‌ను  24.04 కోట్ల ఫుల్లీ పెయిడప్ ఈక్విటీ షేర్లుగా మార్చింది. ఫేస్ వాల్యూ రూ.1.