- ఈ ఏడాది భారీగా ఫండ్స్ సేకరించిన కంపెనీలు
- ఇన్వెస్టర్ల ముందుకొచ్చిన 238 ఎస్‌ఎంఈ ఐపీఓలు
- వచ్చే ఏడాదీ ఇలాంటి ట్రెండే ఉంటుందని అంచనా
న్యూఢిల్లీ: ఈ ఏడాది మొత్తం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓల) జోరు కొనసాగింది. ఏకంగా 90 కంపెనీలు (మొయిన్‌బోర్డ్) ఇన్వెస్టర్ల ముందుకొచ్చాయి. ఈ నెల చివరిలోపు ముగియనున్న ఐపీఓలు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. సుమారు రూ.1.6 లక్షల కోట్లను సేకరించాయి. ఇందులో వొడాఫోన్ ఐడియా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) ద్వారా సేకరించిన రూ.18 వేల కోట్లు కలిసి ఉన్నాయి. కిందటేడాది 57 కంపెనీలు ఐపీఓకి రాగా, రూ.49,436 కోట్లు సేకరించాయి. 2021 లో అయితే 63 కంపెనీలు రూ.1.2 లక్షల కోట్లను ఐపీఓ మార్గంలో సేకరించగలిగాయి.
మరిన్ని కంపెనీలు ఇన్వెస్టర్ల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొత్త ఏడాదిలో కూడా ఐపీఓల జోరు కొనసాగుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. లిస్టింగ్ రోజు లాభాలు పొందడానికి చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఐపీఓలకు అప్లయ్ చేస్తున్నారు. చిన్న, మధ్య, పెద్ద సైజ్ కంపెనీలు ఈ ఏడాది ఇన్వెస్టర్ల ముందుకు రాగా, సగటున రూ.1,700 కోట్లను సేకరించాయి. కిందటేడాది ఐపీఓకి వచ్చిన కంపెనీలు సగటున రూ.867 కోట్లను సేకరించాయి. ఈ ఒక్క నెలలోనూ 15 ఐపీఓలు ఓపెన్ అయ్యాయి.
‘రిటైల్ ఇన్వెస్టర్లు ఐపీఓలకు అప్లయ్ చేయడం పెరిగింది. ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) కూడా ప్రైమరీ మార్కెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రైవేట్ కంపెనీల క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెరగడం, ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేయడానికి ఖర్చులు పెంచడంతో కంపెనీలు ఫండ్స్ సేకరించడం ఊపందుకుంది’ అని ఆనంద్ రాతి అడ్వైజర్స్ డైరెక్టర్ వీ ప్రశాంత్ రావు అన్నారు. వచ్చే ఏడాది కూడా ఇలాంటి ట్రెండ్‌నే చూడొచ్చని అభిప్రాయపడ్డారు. ఐపీఓకి వచ్చేందుకు సెబీ అనుమతులు కోసం 75 కంపెనీలు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయని, కొత్త ఏడాదిలో రూ.2.5 లక్షల కోట్లను సేకరిస్తాయని ఈక్విరస్ ఎండీ మునిశ్ అగర్వాల్ అన్నారు.
ఎస్‌ఎంఈ ఐపీఓలకు పెరిగిన డిమాండ్..
ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో కూడా ఐపీఓలకు ఫుల్ డిమాండ్ కనిపించింది. ఈ ఏడాది 238 ఎస్‌ఎంఈ ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకొచ్చాయి. రూ.8,700 కోట్లు సేకరించాయి. కిందటేడాది ఎస్‌ఎంఈ ఐపీఓలు సేకరించిన రూ.4,686 కోట్లతో పోలిస్తే ఇది సుమారు రెండింతలు ఎక్కువ. రిస్క్ ఎక్కువగా ఉన్నా ఎస్‌ఎంఈ ఐపీఓలపై రిటైల్ ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరిగిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. రిస్క్ తగ్గించేందుకు సెబీ కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద అమ్మే వాటాలపై పరిమితులు విధించింది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం ‘లాట్స్‌ను డ్రా’ చేసే విధానాన్ని తీసుకొచ్చింది. ఐపీఓకి రావాలనుకునే ఎస్‌ఎంఈల లాభదాయకతపై రూల్స్ మార్చింది.
ఈ కంపెనీలు ఎక్కువగా..
ఈ ఏడాది హ్యుందాయ్ (సైజ్ రూ. 27,870 కోట్ల) తో పాటు స్విగ్గీ ( రూ.11,327 కోట్లు), ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ (రూ.10 వేల కోట్లు), బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (రూ.6,145 కోట్లు), ఓలా ఎలక్ట్రిక్ (రూ. 6,145 కోట్లు) ఐపీఓ మార్గంలో భారీగా ఫండ్స్ సేకరించాయి. విభోర్ స్టీల్ ట్యూబ్స్ కేవలం రూ.72 కోట్లే సేకరించింది. ఈ ఏడాది వచ్చిన చిన్న సైజ్ ఐపీఓగా నిలించింది. కానీ, ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ఏకంగా 320 రెట్లు సబ్‌స్క్రయిబ్ కావడం విశేషం. కేఆర్‌ఎన్ హీట్ ఎక్స్చేంజ్ అండ్ రిఫ్రిజిరేషన్, మన్బా ఫైనాన్స్, గాలా ప్రిసిసన్ ఇంజినీరింగ్ ఐపీఓలు 200 రెట్ల కంటే ఎక్కువ సబ్‌స్క్రిప్షన్ సాధించాయి.
వన్ మొబిక్విక్ సిస్టమ్స్, యూనికామర్స్ ఈసొల్యూషన్స్, డిఫ్యూజన్ ఇంజినీర్స్, బీఎల్‌ఎస్ ఈ–సర్వీసెస్, ఎగ్జికామ్ టెలి–సిస్టమ్స్ ఐపీఓలు 100 రెట్ల కంటే ఎక్కువ సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ బాగుండడంతో ఈ కంపెనీల షేర్లు లిస్టింగ్ రోజే 60 శాతానికి పైగా రిటర్న్ ఇచ్చాయి. కొత్త ఏడాదిలో హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ ఉంటుంది. ఈ కంపెనీ మార్గంలో రూ.12,000 కోట్లు సేకరించాలని చూస్తోంది. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ రూ.15 వేల కోట్లు, హెక్సావేర్ టెక్నాలజీస్ రూ.9,950 కోట్లు సేకరించనున్నాయి.