ఏజెన్సీలో ఇప్పపూల జాతర

ఏజెన్సీలో ఇప్పపూల జాతర

మార్చి 30న  చైత్ర మాసం ఆరంభం అయింది. అందరికి ఉగాదితో పండుగలు ప్రారంభం అయితే ఆదివాసీలు ఉగాది కంటే ముందు ఇప్పపూలు ఏరటం నుంచి పండుగలు మొదలు పెడతారు. ఈ సమయంలో గిరిజన అటవీ ప్రాంతాలలో ఇప్పచెట్లు విరగబూసి పూలతో  మత్తుగొలిపే వాసనను వెదజల్లుతుంటాయి. 

ఆదివాసీలు ఇప్పపూలను తెచ్చుకొని నిజంగా పూల ఉత్సవం జరుపుకుంటారు. ఇప్పపూలు, ఇప్పగింజలు సేకరించడం రెండో వ్యవసాయంగా ఆదివాసీలు భావిస్తారు.  చాలామందికి తెలియని ఈ ఇప్పచెట్టు (ఆక్కీమ్) ఆదివాసీల  సంస్కృతికి చిహ్నం.  గిరిజనుల  కల్పవృక్షం. ఈసారి పాల్గుణ మాసం నుంచే అడవిలో ఇప్పపూల జాతర మొదలైంది. ఏప్రిల్ మొదటి/రెండవ వారంలో  పువ్వు రాలటం ఆగిపోతుంది.  ఒక్కొక్క చెట్టు కింద రాశిలా ఇప్పపూలు దర్శనమిస్తున్నాయి. ఈ పూలను ఇప్పసారా,  ఇప్ప లడ్డూ,  గూడాలు వంటి ఆహార పదార్థాలుగా వినియోగిస్తుంటారు. 

అందువల్ల గూడేల్లోని  గిరిజనులు పిల్లాపాపలతో మసకమసక చీకటిలోనే అడవికి చేరుకుంటున్నారు.  ఇప్పచెట్ల కింద రాలిన పూలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి ఆరబెడుతున్నారు. ఏజెన్సీలోని అడవులలో ఉండే గొత్తి కోయలు, కోయలు ఇప్పపూల సేకరణకు వెళ్తున్నారు. ఈ సీజన్లో మొత్తంగా ఒక్కో కుటుంబం ఒక టన్ను వరకు ఇప్పపువ్వు సేకరించి విక్రయించగా వచ్చిన ఆదాయంతో జీవిస్తుంటుంది.

దేవతగా ఇప్పచెట్టుకు పూజలు

పూత పరిమళం మత్తుగొలిపే విధంగా ఉంటుంది. 30 సంవత్సరాల వయస్సు గల ఒక చెట్టు నుంచి సుమారు 100 నుంచి 150 కిలోగ్రాముల పువ్వులు లభిస్తాయి. ఆదివాసీలు సాధారణంగా ఉదయం పూటనే రాలిన పూలను సేకరించి ఎండలో ఆరబెడతారు. ఇలా ఎండిన పూలను ఒక కర్రతో  పొట్టుపోయేంత వరకు కొట్టి..గాలి దూరని విధంగా వెదురు బుట్టలలో నిల్వ చేస్తారు.  వీటిని తమ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటారు.  

ఇప్పపూలను గిరిజనులు రకరకాల ఆహార పదార్థాలుగా.  ఇప్పచెట్టును  దేవతగాను పూజిస్తారు. వారు ఆ చెట్టును ఎక్కడం, నరకడం కానీ చేయరు.  కేవలం చెట్టు కింద పడిన పువ్వులను మాత్రమే సేకరించి ఇంటికి తీసుకొచ్చి ఆరబోస్తారు. ఆరబోసిన నెల రోజుల తర్వాత వాటిని నీటిలో ఉడకబెట్టి ఆహారంగా తింటారు.  చేపలు, ఇతర ఆహార పదార్థాలలో కలిపి వండటం ఇక్కడి గిరిజనుల ప్రత్యేకత. గిరిజనులు జరుపుకునే సంప్రదాయ వేడుకలు సంబరాలు. పెళ్లి సందర్భాలలో ఇప్పపూల నుంచి తయారు చేసిన సారాయిని వాడటం వారు ఆచారంగా పాటిస్తారు. ఆది ప్రత్యేకించి ఆదివాసీ గిరిజన మహిళలు తయారు చేసే ప్రకృతి సిద్ధమైన పానీయం. 

పవిత్రతకు సంకేతం  ఇప్పపువ్వు

వనదేవతలకు తొలుత నైవేద్యంగా సమర్పించిన తర్వాతనే గిరిజనులు తమ సంప్రదాయ పండుగలు, శుభకార్యాలలో సేవించడం అనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ ఆచారాన్ని ఆసియాలోనే ప్రధానమైన మేడారం సమ్మక్క సారక్క జాతరలో గమనించవచ్చు.   తెలంగాణలోని ఆధ్యాత్మిక క్షేత్రమైన భద్రాచలంలోని సీతా రాముల దేవస్థానంలోని శ్రీరాముని పాదాల చెంతన ఇప్ప పువ్వును వైవేద్యంగా సమర్పించడం ఇప్పపువ్వు  పవిత్రతకు సంకేతం.  

ఉపాధి కూడా.  గొత్తికోయ గూడేలలోని కుటుంబాలు వేసవిలో ఇప్పపూలను సేకరించి నిల్వ చేస్తారు. వాటిని భద్రాచలం రామాలయం నుంచి వచ్చే వ్యాపారులు, గిరిజన సహకార సంస్థ (జీసీసీ), అధికారులు కిలో రూ.20 నుంచి 40 వరకు చెల్లించి కొనుగోలు చేస్తారు. ఒక్కో కుటుంబం ఈ సీజన్లో పూలను విక్రయించి రూ. 8 వేల నుంచి రూ.12వేల వరకు ఆదాయాన్ని పొందుతుంది.  వీటి ద్వారా వచ్చే డబ్బుతో  తమ అవసరాలు తీర్చుకుంటారు. అంతేకాకుండా, ఇక్కడి నుంచి చత్తీస్ గఢ్,  ఒడిశాకు ఎగుమతి చేస్తారు.  ఇతర జిల్లాలోని బంధువులకు సైతం ఇప్పపూలను పంపించడం ఇక్కడి చెంచుల ఆనవాయితీ!

- గుమ్మడి లక్ష్మీనారాయణ,
ఆదివాసీ 
రచయితల వేదిక