
హైదరాబాద్: ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేశారు. తెలంగాణ నుంచి రిలీవ్ కావడంతో ఏపీ సర్వీస్‌కి వెళ్లారు. తెలంగాణలో డీజీపీగా పని చేసిన ఆయనకు.. ఏపీ సర్కార్ ఏ పదవి ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. కాగా, రాష్ట్ర విభజన సమయంలో అంజనీ కుమార్ ఏపీకి అలాట్ చేయబడ్డారు. కానీ ఇన్నేళ్లు ఆయన తెలంగాణలోనే పని చేస్తున్నారు. ఈ క్రమంలో అంజనీ కుమార్‌ను ఏపీకి వెళ్లాలని కేంద్రహోంశాఖ ఆదేశించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం అంజనీ కుమార్‌ను రెండు రోజుల క్రితం రిలీవ్ చేసింది. దీంతో ఆయన ఏపీలో రిపోర్టు చేశారు.
క్యాట్‌ను ఆశ్రయించిన అభిలాష..
అంజనీ కుమార్‌తో పాటు రిలీవ్ అయిన మరో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అభిలాష బిష్ట్ క్యాట్‌ను ఆశ్రయించారు. ఏపీలో రిపోర్టు చేయాలన్న డీవోపీటీ ఉత్తర్వులపై స్టే విధించాలని ఆమె కోరారు. ఏపీకు వెళ్లాల్సిందిగా కొద్దిరోజుల క్రితం డీవోపీటీ ఆమెను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను క్యాట్‌ను ఆశ్రయించారు.
అభిలాష బిష్ట్ పిటిషన్‌పై స్పందించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు క్యాట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని క్యాట్ ఆదేశించింది. ప్రతివాదుల వాదనలు విన్న తరువాత తీర్పు వెళ్లడిస్తామని క్యాట్ స్పష్టం చేసింది. అయితే.. అప్పటి వరకు డీవోపీటీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఏపీకి వెళ్లి రిపోర్టు చేయాల్సిందిగా అభిలాష బిష్ట్ ను క్యాట్ ఆదేశించింది.