గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నా కూతురు అరెస్ట్ కావడంతో షాకయ్యా: IPS రామచంద్రరావు

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నా కూతురు అరెస్ట్ కావడంతో షాకయ్యా: IPS రామచంద్రరావు

బెంగుళూర్: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తన కూతురు రన్యా రావు అరెస్ట్‎ కావడంపై ఐపీఎస్ ఆఫీసర్ రామచంద్రరావు స్పందించారు. ఈ మేరకు బుధవారం (మార్చి 5) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీడియా ద్వారానే ఈ విషయం నా దృష్టికి వచ్చిందని.. విషయం తెలియగానే నేను కూడా షాక్ అయ్యానని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏవి తనకు తెలియదని.. ఇతర తండ్రుల్లాగానే నా కూతురు అరెస్ట్ అయ్యిందని తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. ఈ విషయం గురించి తనకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని క్లారిటీ ఇచ్చారు. 

ఎవరి విషయంలోనైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. నా కెరీర్‌పై ఇప్పటి వరకు ఎలాంటి నల్ల మచ్చ లేదన్నారు. ప్రస్తుతం తన కూతురు తమతో కలిసి ఉండటం లేదని.. తన భర్తతో కలిసి వేరే ఉంటుందని తెలిపారు. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తమకు దూరంగా ఉంటుందని చెప్పారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తన కూతురు అరెస్ట్ వ్యవహారానికి తాను దూరంగా ఉంటానని.. ఇందులో తాను కలగజేసుకోనని స్పష్టం చేశారు. ఈ విషయానికి సంబంధించి తాను ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేనని అన్నారు. 

కాగా, దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన రన్యా రావును బెంగళూరు విమానాశ్రయంలో మార్చి 3వ తేదీ రాత్రి  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 14.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. రన్యా రావు ఐపీఎస్ ఆఫీసర్ రామచంద్రరావు రెండో భార్య కుమార్తె. రామచంద్రరావు మొదటి భార్య మరణించిన తర్వాత తిరిగి మరో మహిళను వివాహం చేసుకున్నారు. ఆయన రెండో భార్యకు ఇద్దరు ఆడ పిల్లలు. ఇందులో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన రన్యా రావు ఒకరు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కూతురు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అవ్వడం కర్నాటకలో హాట్ టాపిక్‎గా మారింది.