భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. తక్షణమే అమలులోకి ఉత్తర్వులు

భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. తక్షణమే అమలులోకి ఉత్తర్వులు

హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీ అంజనీకుమార్, టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్‌లను రిలీవ్ చేస్తూ, తక్షణమే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వెలువరించింది. 

ఇక కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి రిలీవ్‌పై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడం గమనార్హం. త్వరలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల జరగనున్న క్రమంలో ఈ బదిలీలకు ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తానికి స్వల్ప మార్పులు, కీలక పోస్టింగ్‌లతో అధికారులను పునర్విభజించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇక ఏ అధికారి ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ చేశారన్న వివరాలు చూస్తే..

* పి. విశ్వప్రసాద్, ఐపీఎస్ (2005): అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్, హైదరాబాద్ సిటీ నుంచి అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్, క్రైమ్స్, హైదరాబాద్ సిటీగా బదిలీ.

* డాక్టర్ బి. నవీన్ కుమార్, ఐపీఎస్ (2008): పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఈ అధికారి, ఇప్పుడు తెలంగాణ సీఐడీ, హైదరాబాద్‌కు ఎస్పీగా నియమితులయ్యారు.

* డాక్టర్ గజరావు భూపాల్, ఐపీఎస్ (2008): డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కోఆర్డినేషన్, తెలంగాణ, హైదరాబాద్ నుంచి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్, సైబరాబాద్‌గా బదిలీ.

* డి. జోయెల్ డేవిస్, ఐపీఎస్ (2010): జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్, హైదరాబాద్ సిటీగా నియమితులయ్యారు.

* సిరిశెట్టి సంకీర్థ్, ఐపీఎస్ (2020): గవర్నర్‌కు సహాయక అధికారిగా (ADC) తన హోదాను కొనసాగించనున్నారు.

* బి. రామ్ రెడ్డి, ఐపీఎస్ (2020): పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఈ అధికారి, ఇప్పుడు తెలంగాణ సీఐడీ, హైదరాబాద్‌కు ఎస్పీగా నియమితులయ్యారు.

* సి. శ్రీధర్, ఐపీఎస్ (2020): పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఈ అధికారి, తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా నియమితులయ్యారు.

* ఎస్. చైతన్య కుమార్, ఐపీఎస్ (2020): పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఈ అధికారి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎస్‌బీ, హైదరాబాద్ సిటీగా నియమితులయ్యారు.

* ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.