బెంగళూరు: వన్డే మ్యాచ్‌లో 346 రన్స్. ఒక జట్టు కొడితేనే ఇది భారీ స్కోరు. అలాంటిది ఒకే బ్యాటర్ ఇంత పెద్ద స్కోరు చేస్తే ఎలా ఉంటుంది. ముంబైకి చెందిన 14 ఏండ్ల ఇరా జాదవ్ వన్డే మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసి ఔరా అనిపించింది. బీసీసీఐ విమెన్స్ అండర్19 వన్డే ట్రోఫీలో భాగంగా ఆదివారం మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో ఇరా ఈ అసాధారణ ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించింది. 157 బాల్స్‌లోనే 42 ఫోర్లు, 16 సిక్సర్లతో 346 రన్స్ చేసింది. 220.38 స్ట్రయిక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన ఆమె యూత్ లిస్ట్–ఎ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఇండియా తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.
అండర్–19 విమెన్స్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన స్మృతి మంధాన (2013లో 224 నాటౌట్) రికార్డును బ్రేక్ చేసింది. ఇరాతో పాటు కెప్టెన్ హుర్లే గాలా (116) సెంచరీ కొట్టడంతో తొలుత ముంబై జట్టు 50 ఓవర్లలో 563/3 స్కోరు చేసింది. అనంతరం ఛేజింగ్‌లో లో మేఘాలయ జట్టు 19 రన్స్‌కే ఆలౌటైంది. ఆ జట్టులో ఆరుగురు ప్లేయర్లు డకౌటయ్యారు. దాంతో ముంబై 544 రన్స్ భారీ తేడాతో విజయం సాధించింది. కాగా, అండర్ 19 విమెన్స్ వన్డే మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు వరల్డ్ రికార్డు సౌతాఫ్రికాకు చెందిన లిజెల్లే లీ పేరిట ఉంది. 2010లో ఆమె అజేయంగా 427 రన్స్ చేసింది.
కాగా, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, అజిత్ అగార్కర్ వంటి మేటి క్రికెటర్లను అందించిన ముంబైలోని శారదాశ్రమం విద్యామందిర్ ఇంటర్నేషల్ స్కూల్ స్టూడెంట్ ఇరా డబ్ల్యూపీఎల్ వేలానికి వచ్చిన యంగెస్ట్ ప్లేయర్‌గా నిలిచింది. కానీ, వేలంలో ఆమెను ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. అయితే, ఈ నెల 18 నుంచి మలేసియాలో జరిగే అండర్19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే ఇండియా టీమ్‌కు ఇరా జాదవ్ స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికైంది.