ఇస్లామాబాద్ : బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని సున్ని మిలిటెంట్ గ్రూప్ స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడులను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. తమ భూభాగంలో ఇరాన్.. మిసైల్స్ దాడులకు పాల్పడిందని, దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులు చనిపోయారని, మరో ముగ్గురు గాయపడ్డారని ప్రకటించింది. మిలిటెంట్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామన్న ఇరాన్ ప్రకటనపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్లో ఉన్న తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంటామని వెల్లడించింది. అదేవిధంగా, తమ దేశంలోని ఇరాన్ రాయబారిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఎయిర్‌స్పేస్ నిబంధనలను ఉల్లంఘించిందని మండిపడింది. ఇలా ఏకపక్షంగా వ్యవహరిస్తే పొరుగు దేశాల మధ్య సంబంధాలు తెగిపోతాయని హెచ్చరించింది.
మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ పెరుగుతది..
హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ వాతావరణం ఉందని పాకిస్తాన్ గుర్తు చేసింది. ఇరాన్ చర్యలతో ఈ టెన్షన్ మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ చర్యలను ఖండిస్తూ ఆ దేశ రాయబారిని తమ విదేశాంగ కార్యాలయానికి పిలిపించుకున్న పాకిస్తాన్.. పద్ధతి మార్చుకోవాలని సూచించింది. దేశ సార్వభౌమత్వాన్ని ఇరాన్ దెబ్బతీసిందని పాకిస్తాన్ మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విమర్శించారు. పాకిస్తాన్ భూభాగంపై జరిగిన దాడి చూసి షాక్‌కు గురైనట్టు వివరించారు.
రెండు స్థావరాలు ధ్వంసం చేశాం : ఇరాన్
బలూచిస్తాన్ ప్రావిన్స్ పంచ్గుర్లోని జైష్ ఉల్ అడ్ల్ మిలిటెంట్ గ్రూప్‌కు చెందిన 2 స్థావరాలను డ్రోన్లు, క్షిపణులతో ధ్వంసం చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ బుధవారం ప్రకటించింది. పాక్ సరిహద్దు వెంట తమ బలగాలపై దాడులు చేసిన మిలిటెంట్ గ్రూపులే లక్ష్యంగా అటాక్ చేసినట్టు వెల్లడించింది.