వచ్చే 24-48 గంటల్లో ఇజ్రాయెల్​పై ఇరాన్ దాడి

  • –అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడి

టెహ్రాన్ : రాబోయే 24 గంటల నుంచి 48 గంటల్లో ఇజ్రాయెల్ భూభాగంపై ఇరాన్  దాడి చేస్తుందని అమెరికా వెల్లడించింది. ఈమేరకు తమకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని ఆ దేశ అధికారి ఒకరు చెప్పారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ శుక్రవారం ప్రచురించింది. సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఈ నెల 1న ఇజ్రాయెల్ రాకెట్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇరాన్ కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులతో పాటు మరో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది.

ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడి చేస్తామంటూ హెచ్చరించింది. అన్నట్లుగానే మీడియం రేంజ్ అత్యాధునిక మిసైల్స్ తో దాడికి ఏర్పాట్లు చేస్తోందని, వచ్చే రెండు రోజుల్లో దాడి చేస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. అయితే, దాడికి సంబంధించి తమ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది.

ఇజ్రాయెల్ పై నేరుగా దాడి చేసిన తర్వాత ఏర్పడే పరిస్థితులపై ఖమేనీ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపింది. తమ మిసైల్స్ ను అడ్డుకుని ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తే ఏంచేయాలనే విషయంపైనా చర్చలు జరుగుతున్నాయని వివరించింది.