ఇజ్రాయెల్​పై ఇరాన్.. మిసైళ్ల వర్షం

  • 300 డ్రోన్లు,  క్షిపణులతో ఇరాన్ దాడి
  • 99శాతానికి పైగా వెపన్స్​ను కూల్చేసిన ఇజ్రాయెల్
  • ఇరుదేశాల మధ్య కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు
  • సౌత్ ఇజ్రాయెల్​లో ఐడీఎఫ్ క్యాంప్ ధ్వంసం
  • సాయం చేస్తున్న అమెరికా, బ్రిటన్ దళాలు
  • దాడులను ఖండించిన ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, అమెరికా
  • ఇజ్రాయెల్​కు అండగా ఉంటామన్న బైడెన్ 
  • దాడులను తిప్పికొడ్తున్నామన్న బెంజమిన్​
  • పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు

జెరూసలెం : ఇజ్రాయెల్​పై ఇరాన్ భీకర దాడులు చేసింది. డ్రోన్లు, బాలిస్టిక్ మిసైల్స్, క్రూజ్ మిసైల్స్​తో విరుచుకుపడింది. దీంతో పశ్చిమాసియాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదివారం ఉదయం ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రెయిడ్ సైరెన్స్ మోగుతూ ప్రజలను అప్రమత్తం చేశాయి. అందరూ బంకర్లు, సేఫ్ జోన్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. 170కి పైగా డ్రోన్లు, 30 క్రూజ్ మిసైల్స్, 120 కి పైగా బాలిస్టిక్ మిసైల్స్ సహా మొత్తం 300 లకు పైగా ఆయుధాలను ఇరాన్ ప్రయోగించిందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది.

వీటిలో 99% వెపన్స్​ను కూల్చేసినట్లు తెలిపింది. ఈ దాడిలో కొన్ని భవనాలతో పాటు సౌత్ ఇజ్రాయెల్​లోని ఎయిర్ ​బేస్ ధ్వంసమైందని, అయితే, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ప్రకటించింది. బెడౌయిన్ అరబ్ టౌన్ పై జరిగిన మిసైల్ దాడిలో ఏడేండ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. కాగా, ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను కూల్చేయడంలో అమెరికా సాయం చేసిందని ఇజ్రాయెల్ తెలిపింది.

దీటుగా అడ్డుకుంటున్న ఇజ్రాయెల్

ఇరాన్ దాడిని ఇజ్రాయెల్ దీటుగా అడ్డుకుంటున్నదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ప్రకటించింది. దేశ భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపింది. యుద్ధం ఇంకా కొనసాగుతోందని వివరించింది. పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు దేశానికి కాపలా కాస్తున్నాయని ప్రకటించింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైల్స్ లో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే తమ భూభాగాన్ని తాకాయని వెల్లడించింది. తమ వ్యూహాత్మక భాగస్వాములతో కలిసి ఏరో డిఫెన్స్ సిస్టమ్ సాయంతో ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్స్​ను కూల్చేశామని తెలిపింది.

అమెరికా దళాలు ఇరాన్‌‌ ప్రయోగించిన దాదాపు 70కిపైగా డ్రోన్లు, 3 బాలిస్టిక్‌‌ క్షిపణులను కూల్చేశాయని అమెరికా అధికారులు ప్రకటించారు. మధ్యధరా సముద్రంలోని అమెరికా వార్​షిప్​లు కూడా రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదివారం కేబినెట్​తో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు.

ఇరాన్ దాడిని ఖండించిన పలు దేశాలు

ఇజ్రాయెల్​పై ఇరాన్ దాడుల కారణంగా వరల్డ్ వైడ్​గా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని ఫ్రాన్స్ హెచ్చరించింది. ఇరాన్ దాడిని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. ఇదొక అనాలోచిత చర్యగా అభివర్ణించింది. ఇజ్రాయెల్​పై దాడులు వెంటనే ఆపాలని జర్మనీ కోరింది. అమెరికా, కెనడా, యూనైటెడ్ నేషన్స్ ఇరాన్ దాడులను ఖండించాయి. జీ7 దేశాల అధ్యక్షులు అత్యవసరంగా సమావేశం అయ్యారు.

ఇరాన్ దాడిని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్​పై దాడులు వెంటనే ఆపాలని ఇరాన్​కు సూచించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఇజ్రాయెల్​కు అండగా ఉంటామని, ఇరాన్ దాడులను ఖండిస్తున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు.

ఇండియా ఏమన్నదంటే..

పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ఇండియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరిగిన ఘర్షణ వాతావరణంపై ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాలు సంయమనం పాటించాలని సూచించింది. చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది. పశ్చిమాసియాలో భద్రత, స్థిరత్వం ఎంతో ముఖ్యమని తెలిపింది. దౌత్య మార్గంలో

సమస్య పరిష్కరించుకుంటే బాగుంటుందని సూచించింది. దాడులతో ఎలాంటి సమస్య పరిష్కారం కాదని తెలిపింది. కాగా, ఇజ్రాయెల్​లో ఉన్న ఇండియన్స్ జాగ్రత్తగా ఉండాలని దేశ విదేశాంగ శాఖ సూచించింది. సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటించాలని ఆదేశించింది. అక్కడి అధికారులతో టచ్​లో ఉంటూ వారి ఆదేశాలు పాటించాలని తెలిపింది.

ఇజ్రాయెల్​పై ఇరాన్ దాడికి కారణమేంటి?

ఇజ్రాయెల్, హమాస్ మధ్య గతేడాది అక్టోబర్ నుంచి యుద్ధం జరుగుతున్నది. లెబనాన్​లోని హిజ్బుల్లా ఫైటర్లకు ఇరాన్ మద్దతు ఇస్తున్నది. ఇరాన్ సాయంతో హిజ్బుల్లా ఫైటర్లు తమపై దాడి చేస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతిగా డమాస్కస్ రాయబార కార్యాలయంపై దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సీనియర్ అధికారులు ఇద్దరు చనిపోయారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఇరాన్.. ప్రతీకారంగా ఇజ్రాయెల్​పై దాడులు చేస్తున్నది.

ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్

ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ ఎంతో అడ్వాన్స్​గా ఉంటుంది. 300కు పైగా డ్రోన్లు, బాలిస్టిక్, క్రూజ్ మిసైళ్లు ఇరాన్ ప్రయోగించినా ఇజ్రాయెల్ దీటుగా అడ్డుకోవడానికి కారణం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దేశం చుట్టూ మల్టీ లేయర్​గా ఈ సిస్టమ్ ఉంటుంది. 

ది ఏరో : ఇంటర్​సెప్ట్ లాంగ్ రేంజ్ మిసైల్స్​ను అడ్డుకుంటుంది. బాలిస్టిక్ మిసైల్స్​ను కూడా కూల్చేస్తుంది. అమెరికా సాయంతో దీన్ని రూపొందించారు.  

ది బాణం : ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల రకాలతో సహా దీర్ఘ-శ్రేణి క్షిపణులను అడ్డగించేలా అమెరికా సహకారంతో దీనిని రూపొందించారు. వాతావరణం వెలుపల పనిచేసే బాణం, యెమెన్‌‌లో హౌతీ మిలిటెంట్లు ప్రయోగించిన క్షిపణులను అడ్డుకోవడానికి ఉపయోగించింది.

డేవిడ్స్ స్లింగ్ : అమెరికా సాయంతో డేవిడ్స్ స్లింగ్ సిస్టమ్ రూపొందించారు. ఇంటర్​సెప్ట్ మీడియం రేంజ్ మిసైళ్లను అడ్డుకుంటుంది.  హిజ్బుల్లా ఫైటర్ల మిసైళ్లను అడ్డుకునేందుకు ఏర్పాటు చేశారు.

పేట్రియాట్ : ఇజ్రాయెల్ రక్షణ శాఖలోని పాత వ్యవస్థ. ఇరాక్ నేత సద్దాం హుస్సేన్​ ప్రయోగించిన స్కడ్ మిసైళ్లను పేట్రియాట్ అడ్డుకుంది. డ్రోన్లు,  విమానాలను కూల్చేయడానికి ఉపయోగిస్తున్నారు.

ఐరన్ డోమ్ : అమెరికా మద్దతుతో ఐరన్ డోమ్ వ్యవస్థను రూపొందించారు. షార్ట్ రేంజ్ రాకెట్ల దాడిని ఇది అడ్డుకుంటుంది. దశాబ్ద కాలంగా ఇది సేవలు అందిస్తున్నది. ఇప్పటి వరకు వేలాది డ్రోన్లు, రాకెట్లను అడ్డుకున్నది. శత్రువులు ప్రయోగించిన దాడుల నుంచి కాపాడటంలో 90‌‌‌‌% పాత్ర ఐరన్ డోమ్ దే!

ఐరన్ బీమ్ : లేజర్ టెక్నాలజీతో జరిగే దాడులను ఐరన్ బీమ్ అడ్డుకుంటుంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో ఇదొక సరికొత్త ఆయుధం. అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. ఈ సిస్టమ్ ఇజ్రాయెల్​ను గేమ్ ఛేంజర్​గా మారుస్తుంది. దీన్ని ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ. అయితే, దీనిని ఇంకా ఉపయోగంలోకి తీసుకురాలేదు.

దాడులను అడ్డుకుంటాం : బెంజమిన్ నెతన్యాహు

ఇరాన్ దాడులను సమర్థవంతంగా అడ్డుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. కేబినెట్ భేటీకి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైళ్లు, క్రూజ్ మిసైళ్లతో పాటు డ్రోన్లను కూల్చేశాం. యాంటీ డ్రోన్ సిస్టమ్​తో అడ్డుకుంటున్నాం. అమెరికా, బ్రిటన్ సహకారంతో దాడులను తిప్పికొడ్తాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. సైరన్స్​తో అలర్ట్ చేస్తుంటాం. సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటించాలి’’అని సూచించారు. 

ఇజ్రాయెల్​కు ఇనుప కవచంలా ఉంటాం : బైడెన్

ఇజ్రాయెల్​పై దాడులు వెంటనే ఆపేయాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్​ను హెచ్చరించారు. ఇజ్రాయెల్​కు ఇనుప కవచంలా అమెరికా ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుతో బైడెన్​తో ఫోన్​లో మాట్లాడారు. ‘‘ఇజ్రాయెల్​కు అమెరికా అండగా ఉంటుంది. ఇరాన్ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్న.

దాడులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్‌‌ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించింది. మా సైనికులు కూడా అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారు. భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తాం. సోమవారం జీ7 దేశాధినేతలతో సమావేశం అవుతున్నాను’’అని బైడెన్ తెలిపారు.

దాడిని సమర్థించుకున్న ఇరాన్

యూనైటెడ్ నేషన్స్ చార్టర్‌‌లోని ఆర్టికల్‌‌ 51 ప్రకారమే తాము ఇజ్రాయెల్​పై దాడి చేసినట్లు ఇరాన్​ ప్రకటించింది. మళ్లీ ఇజ్రాయెల్‌‌, అమెరికాలు తమపై దాడులు చేస్తే మాత్రం ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇజ్రాయెల్ న్యూట్రల్​గా ఉందని, ఎదురుదాడి చేయలేదని ప్రకటించింది. తాము కొన్ని ప్రాంతాలను మాత్రమే టార్గెట్ చేసుకున్నామని ఇరాన్ తెలిపింది.

తమ దాడులకు ఆ దేశం భయపడుతున్నదని తెలిపింది. ఆదివారం దాడులు జరిపిన నేపథ్యంలో ఇరాన్‌‌ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇరాన్‌‌ జాతీయ జెండాలు పట్టుకుని రోడ్లు, వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు.