- కొన్నింటిని అడ్డుకున్న ఐరన్ డోమ్
- హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మరణానికి ప్రతీకారంగానేనని వెల్లడి
- షెల్టర్లలో తలదాచుకున్న ఇజ్రాయెల్ పౌరులు
- టెల్ అవీవ్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పలువురి మృతి
- ఇజ్రాయెల్‌కు మద్దతుగా రంగంలోకి అమెరికా
జెరూసలెం/టెహ్రాన్: హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన ఇరాన్.. అన్నట్లుగానే మంగళవారం ఇజ్రాయెల్ పై దాడి చేసింది. వందలాది మిసైళ్లతో టెల్ అవీవ్ పై విరుచుకుపడింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మిసైళ్ల వర్షం కురిపించింది. ఇందులో కొన్నింటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకుంది. రాకెట్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తన పౌరులను అప్రమత్తం చేసింది. దీంతో పౌరులు షెల్టర్ హోమ్ లలో తలదాచుకున్నారు. మరోవైపు, టెల్ అవీవ్ లో టెర్రర్ దాడి జరిగిందని, ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడని సమాచారం. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోయారని పోలీసులు తెలిపారు.
నస్రల్లా హత్యకు ప్రతీకారంగానే..
హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియా, హెజ్బొల్లా చీఫ్నస్రల్లాతో పాటు రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ నిల్ఫోరోషన్ ల మరణాలకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు చేపట్టినట్లు రివల్యూషనరీ గార్డ్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇజ్రాయెల్‌లోని మనోళ్లకు ఎంబసీ హెచ్చరిక..
టెల్ అవీవ్‌పై ఇరాన్ రాకెట్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ లోని భారత సంతతి ప్రజలను అక్కడి మన ఎంబసీ అప్రమత్తం చేసింది. యుద్ధ పరిస్థితి కారణంగా అలర్ట్ గా ఉండాలని, సేఫ్టీ ప్రొటొకాల్స్ పాటించాలని కోరింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, ఎల్లప్పుడూ షెల్టర్ హోమ్ లకు దగ్గర్లో ఉండేలా జాగ్రత్త పడాలని సూచించింది. భారత సంతతి పౌరుల భద్రతపై ఇజ్రాయెల్ అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఎంబసీని ఫోన్ ద్వారా సంప్రదించాలని అధికారులు చెప్పారు.