భీకరంగా బదులిస్తం.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్

టెహ్రాన్: తమ భూభాగంపై మళ్లీ దాడి చేస్తే వెనువెంటనే భీకరంగా బదులిస్తామంటూ ఇజ్రాయెల్​ను ఇరాన్ హెచ్చరించింది. ఈసారి ప్రతిదాడి చేయాల్సి వస్తే అది వేరే లెవెల్​లో ఉంటుందని స్పష్టంచేసింది. ఈమేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరాబ్ దొల్లాహియాన్ శనివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ హెచ్చరికలు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఇస్ఫహాన్ సిటీపై జరిగిన దాడిపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని తెలిపారు. ఈ దాడికి వాడిన డ్రోన్లు తమ దేశ పిల్లలు ఆడుకునే బొమ్మల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 

ఈ దాడితో ఇజ్రాయెల్​కు సంబంధం ఉందని తాము భావించడంలేదని, ఆధారాలు కూడా ఏవీ దొరకలేదని  ఆయన వివరించారు. ఆ డ్రోన్లు ఇరాన్ భూభాగంలో నుంచే పైకెగరాయని, దాదాపు వంద మీటర్లు ప్రయాణించేలోపే వాటిని కూల్చేశామని అమిరాబ్ దొల్లాహియాన్ వివరించారు. ‘ఇస్ఫహాన్  సిటీలో దూసుకొస్తున్న మూడు డ్రోన్లను మన దేశ ఎయిర్ డిఫెన్స్  కూల్చివేసింది. ఆ క్రమంలో కొన్ని పేలుళ్లు సంభవించాయి. అయితే, చొరబాటుదారులు ఆ డ్రోన్లు ప్రయోగించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. మా దేశ ప్రయోజనాల విషయంలో మేం చాలా సీరియస్ గా ఉన్నాం. 

మా దేశ ప్రయోజనాలపై దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తే ఇజ్రాయెల్ కు తీవ్రంగా జవాబు చెప్తాం. తర్వాత మేము చేసే దాడి వేరే లెవెల్ లో ఉంటుంది” అని అమిరాబ్ దొల్లాహియాన్  పేర్కొన్నారు. కాగా, ఇస్ఫహాన్  సిటీకి సమీపంలోని ఇరాన్ ఎయిర్ ఫోర్స్ పై దాడిచేయడానికి ఇజ్రాయెల్  డ్రోన్లు ప్రయోగించి ఉంటుందని ఇరాన్  మీడియా అనుమానిస్తోంది. ఇప్పటి వరకూ ఈ అటాక్ పై ఇరాన్  అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అలాగే ప్రతీకార దాడిలో అమెరికాకు ఎలాంటి సంబంధంలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్  తెలిపారు.