న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం ఇంకా మార్కెట్లను వెంటాడుతోంది. ముదురుతున్న మిడిల్ ఈస్ట్ టెన్షన్లతో పాటు కార్పొరేట్ కంపెనీల సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) రిజల్ట్స్, ఇండియా ఇన్‌ఫ్లేషన్ డేటా ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌ను నిర్ణయించనున్నాయి. క్రూడాయిల్ ధరలు, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ల (ఎఫ్‌పీఐ) ట్రెండ్‌ను గమనించాలని ట్రేడర్లకు ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు.
‘ఈ వారం రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి ఇండెక్స్ హెవీ వెయిట్ కంపెనీల రిజల్ట్స్ వెలువడనున్నాయి’ అని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. వీటితో పాటు సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇండియా రిటైల్ ఇన్‌ఫ్లేషన్, హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ డేటా సోమవారం వెలువడనున్నాయని అన్నారు.
జియో పొలిటికల్ టెన్షన్లు, క్రూడాయిల్‌పై వీటి ప్రభావం, విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ల కదలికలను కూడా గమనించాలని సలహా ఇచ్చారు. ఈ వారం ఇండియా, చైనా, యూకే దేశాల ఇన్‌ఫ్లేషన్ డేటాతో పాటు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) వడ్డీ రేట్ల నిర్ణయం, చైనా జీడీపీ నెంబర్లు, యూఎస్ రిటైల్ సేల్స్ డేటా వెలువడనున్నాయి. కిందటి వారం సెన్సెక్స్ 307 పాయింట్లు (0.37 శాతం ), నిఫ్టీ 0.20 శాతం నష్టపోయాయి. అంతకు ముందు వారంలో ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు 4 శాతానికి పైగా పతనమయ్యాయి.
భారీగా అమ్మేస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు..
ఫారిన్ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటి వరకు నికరంగా రూ.58,711 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఇండియా మార్కెట్ నుంచి విత్‌డ్రా చేసుకున్నారు. ఇజ్రాయెల్– ఇరాన్ మధ్య గొడవ ముదరడం, క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడం, చైనీస్ మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపించడంతో మన మార్కెట్ నుంచి వెళ్లిపోతున్నారు. యూఎస్ 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ పెరగడంతో కూడా ఎఫ్‌ఐఐలు నికర అమ్మకందారులుగా మారారు.