- సౌత్ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి
- ఐదుగురు హెజ్బొల్లా ఫైటర్స్ మృతి
- నార్త్ ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరంపై హెజ్బొల్లా ప్రతి దాడి
జెరూసలేం : పశ్చిమాసియాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాలు.. తమ సరిహద్దుల వద్ద భారీగా సైనికులు, యుద్ధ ట్యాంకులను మోహరించాయి. నార్త్ ఇజ్రాయెల్‌లో ఉన్న మిలటరీ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతున్నది. అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై వైమానిక దాడులకు దిగుతున్నది. మంగళవారం మిలటరీ రైడ్స్‌లో భాగంగా జెనిన్ నగరంలో ఇజ్రాయెల్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పాలస్తీనియన్లు చనిపోయారు.
మృతుల్లో 14 ఏండ్ల బాలుడితో సహా నలుగురు యువకులు ఉన్నట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. అదేవిధంగా, సౌత్ లెబనాన్‌లోని ఓ గ్రామంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారని, పది మంది వరకు గాయపడ్డారని ఆ దేశ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చనిపోయిన వారంతా హెజ్బొల్లా ఫైటర్స్ అని తెలిపింది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా.. ఇజ్రాయెల్‌పై డ్రోన్లతో విరుచుకుపడింది.
నార్త్ ఇజ్రాయెల్ బార్డర్ నుంచి 20 కిలో మీటర్ల లోపల ఉన్న సైనిక స్థావరంపై దాడి చేసింది. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. గాజాలో వార్ మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్, హెజ్బొల్లా ప్రతి రోజూ దాడులు, ప్రతిదాడులకు దిగుతున్నాయి.
ప్రజలే లక్ష్యంగా దాడులు చేస్తున్నరు: ఇజ్రాయెల్
సాధారణ పౌరులే లక్ష్యంగా హెజ్బొల్లా డ్రోన్లతో దాడులు చేస్తున్నదని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆరోపించింది. కాగా, ఇజ్రాయెల్ కామెంట్లను హెజ్బొల్లా తీవ్రంగా ఖండించింది. కాగా, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్‌కు వెళ్లొద్దని సౌత్ కొరియా, జపాన్ తమ పౌరులకు సూచించింది.
కాగా, ఇరాన్‌కు అండగా నిలిచిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో మాట్లాడారు. ఇజ్రాయెల్‌పై జరిపే దాడుల్లో సాధారణ పౌరులు చనిపోకుండా చూడాలని సూచించినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయాలని చెప్పినట్లు తెలుస్తున్నది.
24 గంటల్లో 45 మంది పాలస్తీనియన్ ఫైటర్లు మృతి
గడిచిన 24 గంటల్లో గాజాలో 45 మంది పాలస్తీనియన్ ఫైటర్స్‌ను చంపేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ప్రకటించింది. హెజ్బొల్లా జరిపిన దాడులను ఐరన్ డ్రోమ్తో తిప్పికొడ్తున్నట్లు చెప్పింది. ఒక డ్రోన్ నహరియా టౌన్‌లోని రూట్4 హైవేపై పడటంతో పలువురికి గాయాలైనట్లు తెలిపింది. ఒకరి పరిస్థితి క్రిటికల్ ఉందని చెప్పింది. కాగా, రఫా సిటీకి దగ్గరలో తాము జరిపిన మెరుపు దాడిలో రెండు ఆర్మీ వాహనాలను ధ్వంసం చేసినట్లు హమాస్ ప్రకటించింది.