ఇంటి గొడవ పట్టని ఇరాన్‌!

ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవం వచ్చి ఈ ఫిబ్రవరికి నలభై ఏళ్లు పూర్తయ్యాయి.1979లో అప్పటి ఇరాన్ రాజు షాకు వ్యతిరేకంగా ఆయతొల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ వాదులు ఉద్యమించారు. విప్లవబాటలో నడిచారు. రాజు షా నాయకత్వంలోని ఇరాన్ రాచరిక వ్యవస్థను కూలదోశారు. 1979 ఏప్రిల్ నెలలో ఇరాన్, ఇస్లామిక్ రిపబ్లిక్ గా అవతరించింది. ఈ నలభై ఏళ్లలో దేశ ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది. ప్రజలు తమ కోసం ఉపయోగించాల్సిన డబ్బును సిరియా, యెమెన్,ఇరాక్ దేశాల్లో లేనిపోని గొడవల కోసం ఉపయోగిస్తున్నారన్న అసంతృప్తి పెరిగింది.

ప్రపంచ చరిత్ర లో ఇరాన్ విప్లవం కీలక ఘట్టం . నలభై ఏళ్ల క్రితం ప్రజల తిరుగుబాటుతో ఇరాన్‌ రాజు పారిపోయాడు. విప్లవ సేనాని ఆయతొల్లాఖొమేనీ నాయకత్వం లో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. రాజు మహమ్మద్ రెజా పెహ్లావి ఇరాన్ నుంచి పోతూ పోతూ భారీ సంపదను పట్టుకుపోయాడు. విప్లవంచివరి దశలో రాజుకు అనుకూలంగాఉన్న వ్యాపారవేత్తలుకూడా కోట్లాది డాలర్లను గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలించారు. ఖొమేనీ అధికారానికి వచ్చేనాటికి ఇరాన్ లో పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండేది. అట్టడుగు స్థాయి నుంచి ఇరాన్ ను నిర్మించుకుంటూ రావడానికి ఆయతొల్లా ఖొమేనీ చాలా కష్టపడ్డారు. వ్యక్తి గతంగా ఆడంబరాలకు దూరంగా ఉన్నారు. ఇస్లామిక్ ఇరాన్ ని జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుని 1989 లో ఖొమేనీ చనిపోయారు. ఆ తర్వాత ఇరాన్ లో కొత్త అధ్యాయం మొదలైంది. ఛాందసవాది ఖమేనీ ఎంట్రీ ఆయతొల్లా ఖొమేనీ చనిపోయిన తర్వాత ఆయనకన్నా ఛాందసవాదిగా పేరు పడ్డా ఆయతొల్లా ఖమేనీ అధికారంలోకి వచ్చారు. ఖమేనీతో పోలిస్తే ఖొమేనీని చాలా ప్రోగ్రెసివ్ గానే భావించాలి. ఖమేనీ నాయకత్వం లో ఇరాన్ మతపరంగా ప్రయాణించింది. దీనికి వ్యతిరేకంగా 1990 లో దేశవ్యాప్తంగా సంస్కరణల ఉద్యమం మొదలైంది. పరిస్థితులు ఎంతగా ప్రతికూలంగా ఉన్నా సంస్కరణవాదులు వెనకడుగు వేయలేదు. మహిళల హక్కులు, ప్రజాస్వామిక పాలనకోసం ఉద్యమించారు. ఈ క్రమంలోనే సంస్కరణవాదాన్ని జనం ఆదరించి రెండుసార్లు అధికారం అప్పగించారు. 1997 నుంచి 2005 వరకు సంస్కరణవాదులు అధికారంలో కొనసాగారు.

2013లో లిబరలిస్టుగా పేరున్న హసన్ రౌహానీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పటికీ రౌహానీనే అధికారంలో ఉన్నారు. రోజువారీ పాలనలో రిలీజియన్‌ ఆర్గనైజేషన్ల ప్రాబల్యాన్ని తగ్గించడానికి సంస్కరణవాదులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మతాధికారులు చేసిన చట్టాలకు లోబడి ఉంటూనే, ఆయతొల్లా ఖొమేనీ సూత్రాలను ఆమోదిస్తూనే, సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి చేయాల్సిందంతా చేస్తున్నారు. దిగజారిన ఆర్థిక పరిస్థితులు రౌహా నీ ప్రభుత్వం ఏం చెప్పినా, సామాన్య ప్రజలకు సర్కార్ పై తీవ్ర అసంతృప్తి నెలకొంది. దేశ ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది. రెండేళ్ల కిందట ఇరాన్ లోని అనేక ప్రధాన నగరాల్లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సగటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి రౌహానీ సర్కార్ ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని ప్రజలు మండిపడ్డారు. తమ కోసం ఉపయోగించాల్సిన డబ్బును సిరియా, యెమెన్,ఇరాక్ దేశాల్లో లేని పోని గొడవల కోసం ఉపయోగిస్తున్నారని సామాన్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. సగటు ఇరానీయుల నిరసన ఇరాన్ పాలకులను ఖంగు తినిపించింది. వీటి వెనుక విదేశీ ఏజెంట్లున్నారని గవర్నమెంట్‌ సర్దిచెప్పుకుంది. అయితే ఇరాన్ లో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితికి మరో రూపమే ఈ నిరసన అనేది వాస్తవం. ఏ మహత్తర లక్ష్యల కోసమైతే ఇరాన్ ప్రజలు రాజు షాకు వ్యతిరేకంగా ఉద్యమించారో ఆ లక్ష్యాలు ఇప్పటికీ సిద్దించలేదు. విప్లవ స్ఫూర్తికి కట్టుబడ్డ ప్రజలు సామాన్య ఇరానీయులు 1979 నాటి ఇస్లామిక్ స్ఫూర్తికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నారు. అయితే ‘ఇస్లామిక్ రివల్యూషన్’ పేరిట సృష్టించిన ఇనుప సంకెళ్లను వ్యతిరేకిస్తున్నారు. ఛాందసవాదం నుంచి దేశం బయటపడాలని కోరుతున్నారు. ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధే పాలకుల అజెండా కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్ అంతర్జాతీయంగా ఇవాళ అనేక ఒత్తిడులను ఎదుర్కొంటోంది. న్యూక్లియర్ డీల్ పై చాలా ఇబ్బందికర పరిస్థితు లను ఎదుర్కొంటోంది. ఒకవైపు అనేక అంశాలపై అంతర్జాతీయంగా ఆంక్షలు ఎక్కువవుతుంటే, మరో వైపు ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి పెరుగుతోంది. ఇలాంటి రకరకాల కారణాలతో ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారింది. ఇన్ని సమస్యల మీద సగటు ఇరాన్ ప్రజలు బతుకుబండి నెట్టుకొస్తున్నా రు.