భూగర్భంలో ఇరాన్ మిసైల్ సిటీ.. వెపన్స్ దాచిన సొరంగం వీడియో రిలీజ్

భూగర్భంలో ఇరాన్  మిసైల్ సిటీ..  వెపన్స్ దాచిన సొరంగం వీడియో రిలీజ్
  • వెపన్స్ దాచిన సొరంగం వీడియో రిలీజ్
  • ట్రంప్ అల్టిమేటం నేపథ్యంలో రెండు దేశాల మధ్య టెన్షన్

టెహ్రాన్: భూగర్భంలో దాచిన ఆయుధాలకు సంబంధించిన వీడియోను ఇరాన్ బుధవారం బయటపెట్టింది. సైనిక విన్యాసాల సందర్భంగా ఆ దేశ టాప్ మిలిటరీ కమాండర్, మేజర్ జనరల్ మహమ్మద్ హుస్సేన్ బఘేరి, ఏరోస్పేస్ చీఫ్ అమీర్ అలీ హజిజాదేతో కలిసి ఈ రహస్య స్థావరాన్ని సందర్శించినట్లు ప్రకటించింది. 85 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోలో ఖైబర్ షేకన్, గదర్‌‌‌‌‌‌ హెచ్, సెజ్జిల్ వంటి ఖండాంతర క్షిపణులు, యుద్ధ విమానాలతోపాటు అన్ని రకాల వెపన్స్‌‌ను, వాటన్నింటినీ నిల్వ చేసేందుకు వీలున్న ‘మిసైల్ సిటీ’ అని పిలిచే విస్తారమైన భూగర్భ సొరంగాన్ని చూపించారు. అమెరికా, ఇజ్రాయెల్​తో విభేదాలు పెరుగుతున్న వేళ ఇరాన్​ తన వ్యూహాత్మక స్థావరాన్ని ప్రదర్శంచింది. తద్వారా అమెరికాకు ఇరాన్‌‌ తన ధిక్కారాన్ని చూపించినట్లయింది. ఈ స్థావరం పర్షియన్ గల్ఫ్‌‌లో భూమిలోపల అరకిలోమీటర్ కింద  ఉందని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వెల్లడించాయి. క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగించినా ఈ సిటీని ఛేదించడం సాధ్యంకాదని చెప్తున్నాయి.

హౌతీలకు ఇరాన్ మద్దతిచ్చుడే అసలు సమస్య?

ఇరాన్ మద్దతున్న యెమెన్​లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలోని నౌకలను టార్గెట్ చేస్తున్నారు. ప్రతీకారంగా అమెరికా యెమెన్​పై వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ గొడవలకు స్వస్తి పలికేందుకు ట్రంప్ అధికారంలోకి రాగానే ఇరాన్​పై ఒత్తిడి పెంచారు. అందులో భాగంగానే మార్చి మొదటివారంలో ఇరాన్​కు అల్టిమేటం జారీ చేశారు. యురేనియం నిల్వలు, మిసైళ్ల కెపాసిటీ, న్యూక్లియర్ సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గించుకునేలా ఉన్న ఓ కొత్త న్యూక్లియర్ ఒప్పందంపై సంతకం పెట్టాలని డిమాండ్ చేశారు. రెండు నెలల డెడ్​లైన్ విధించారు. కుదరదంటే కఠిన చర్యలు తప్పవని, సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ డిమాండ్లను ఇరాన్ తిరస్కరించింది. దేశ భద్రతకు న్యూక్లియర్ నిల్వలు ఉండాల్సిందేనని వాదించింది. దీంతో అమెరికా.. మిడిల్ ఈస్ట్​లో భద్రత, నిఘా పెంచింది. ఎర్ర సముద్రంలో విమాన వాహక నౌకలను మోహరించింది.  ఇరాన్​ కూడా దీటుగా సైనిక విన్యాసాలను ప్రారంభించింది. అందులో 
భాగంగానే మిసైల్ సిటీ వీడియోను రిలీజ్ చేసింది.