ఇరాన్​ సత్తా ఎంత?

ఒక వేళ అమెరికాతో యుద్ధమే చేయాల్సి వస్తే ఇరాన్​ తట్టుకోగలదా? అమెరికాను ఛాలెంజ్​ చేసేంత మిలిటరీ పవర్​ ఇరాన్​కు ఉందా? మామూలు డ్రోన్లతోనే టార్గెట్లను పేల్చేసే మోడర్న్​ టెక్నాలజీ ఉన్న అమెరికాతో ఇరాన్​ కొంతైనా పోటీ పడగలదా? ఇరాన్​ యుద్ధానికి సిద్ధమైతే వెంట వచ్చే దేశాలేమైనా ఉన్నాయా? అసలు ఎక్కడో కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న అమెరికాతో ఇరాన్​ ఎట్లా యుద్ధం చేయగలదు?

అమెరికాతో తలపడే సైనిక సంపత్తి ఇరాన్​ దగ్గర లేదు. ప్రపంచంలో మిలిటరీ పరంగా పవర్​ ఇండెక్స్​లో అమెరికా టాప్​లో ఉండగా, ఇరాన్​ 14వ స్థానంలో ఉంది. 1979లో ఇస్లామిక్​ రివల్యూషన్​ తర్వాత అమెరికా తరచు ఇరాన్​పై ఏదో ఒక కారణంతో ఆంక్షలు విధిస్తూ వచ్చింది. దాంతో ఇరాన్​ ఆయుధాలను కొనడానికిగానీ, సొంతంగా తయారు చేసుకోవడానికిగానీ వెసులుబాటు లేకుండా పోయింది. అయినప్పటికీ, రకరకాల విభాగాలను కలుపుకుంటే ఇరాన్​కు దాదాపు ఐదున్నర లక్షల మంది సైనికులున్నారు. ఇరాన్ సైన్యానికి ప్లస్ పాయింట్ అక్కడి ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ)’. ఈ ఆర్గనైజేషన్​లో లక్షా యాభై వేల మంది సైనికులు ఉన్నారు. ఐఆర్జీసీకి అనుబంధంగా ఉన్న నేవల్ ఫోర్స్​లో మరో 20 వేల మంది ఉన్నారు. ఐఆర్జీసీ ఇప్పటిది కాదు. 40 ఏళ్ల కిందట ఈ ఆర్గనైజేషన్​ని ఏర్పాటు చేశారు. ఐఆర్జీసీలో కీలక విభాగం ‘కుద్స్ ఫోర్స్’. ఇది ఎక్కువగా దేశం బయట మిలటరీ ఆపరేషన్స్ నిర్వహిస్తుంటుంది.

ఈ లెక్కలు పక్కనబెడితే, ప్రపంచంలోనే ఇరాన్​ మిలిటరీకి ఒక ప్రత్యేకత ఉంది. ఆర్మీ, నేవీ, ఎయిర్​ ఫోర్స్​లు మూడింటితో యూనిఫైడ్​ మిలిటరీని ఏర్పాటు చేసుకుంది ఇరాన్​. 1953లో ఖజార్​ రాచరికంపై తిరుగుబాటు జరిగాక అమెరికా, ఇతర వెస్ట్రన్​ దేశాలు ఇరాన్​పై ఆంక్షలు విధించడంతో… ఇజ్రాయెల్​ నుంచి ఆయుధాలు కొనుక్కొనేది.  ఆ తర్వాత తానే సొంతంగా ఆయుధాల ఫ్యాక్టరీ పెట్టుకుంది. కానీ, దీనికి ప్రపంచస్థాయి గుర్తింపు ఉండేది కాదు. వేరే దేశాలద్వారా అమెరికా ఆయుధాలను సంపాదించుకుని, స్పేర్​ పార్టుల్ని మాత్రం అమెరికా నుంచే కొనడం మొదలెట్టింది. ఇరాక్​తో ఎనిమిదేళ్ల పాటు యుద్ధం చేసిన సమయంలో రష్యా నుంచి సమకూర్చింది. వీటిలో సబ్​మెరైన్లు, లాంగ్​రేంజ్​ అటాకింగ్​ జెట్​లు ఉన్నాయి. గల్ఫ్​ యుద్ధం సమయంలో ఇరాక్​కి చెందిన మిలిటరీ ఎయిర్​ క్రాఫ్ట్​ల్ని ఇరాన్​ స్వాధీనం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ఇరాన్​ భీకర యుద్ధానికి పాల్పడే పరిస్థితి లేదంటున్నారు ఎనలిస్టులు. ఇరాన్​ మన దేశం మాదిరిగానే ‘నో ఫస్ట్​ స్ట్రయిక్​’ పద్ధతిని పాటిస్తోంది. అంటే, శత్రువు దాడి చేసేవరకు వేచి చూసే పద్ధతి. అక్కడి రాజ్యాంగం ఒప్పుకోకపోవడంతో విదేశాలేవీ మిలిటరీ బేస్​లను ఏర్పాటు చేసుకోలేదు.

అయితే, ఇరాన్​కి రెగ్యులర్​ ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​తోపాటుగా మరో ప్రత్యేక విభాగం రివల్యూషనరీ గార్డ్స్​ పేరుతో  సొంతంగా పనిచేస్తుంది. దీనికి నేవీ, ఎయిర్​ఫోర్స్​, ఆర్మీలతోపాటు ఖుద్స్​ ఫోర్స్​ పేరుతో ఒక ప్రత్యేక దళం, బాసిజ్​ అనే పారామిలిటరీ వలంటీర్​ ఫోర్స్​ కూడా ఉంది. బాసిజ్​లో మొత్తం కోటి 26 లక్షల మంది వలంటీర్లుగా ఉంటారని అంచనా. వీళ్లలో మహిళా వలంటీర్లుకూడా ఉంటారు. వీళ్లను నింజా రేంజర్స్​గా చెబుతారు. దీనిలో 2,500 బెటాలియన్లు పనిచేస్తున్నాయి. బాసిజ్​ వలంటీర్లలో 6 లక్షల మందికి వార్​ ట్రైనింగ్​ ఇవ్వడంతో ఎప్పుడు యుద్ధం వచ్చినా రెడీగా ఉన్నట్లు మిలిటరీ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. వీళ్లు కాకుండా మరో కోటి 10 లక్షల మందికూ‌‌డా రెగ్యులర్​ ఆర్మీకి సాయంగా ఉన్నారు.

మిస్సైల్స్ ఒక ప్లస్ పాయింట్

ఇరాన్ మిలటరీకిగల ఏకైక పెద్ద ఆయుధం మిసైల్​. పశ్చిమాసియాలో ఇరాన్ దగ్గర ఉన్న మిస్సైల్ పవర్ మరే ఇతర దేశంలో లేదని గతంలో అమెరికా డిఫెన్స్ డిపార్టుమెంట్ పేర్కొంది. ఇరాన్ మిస్సైళ్లలో షార్ట్ రేంజ్​, మీడియం రేంజ్ మిస్సైల్స్ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇరాన్ దగ్గర గతంలో ‘లాంగ్ రేంజ్’వి కూడా ఉండేవి. అయితే 2015 లో కుదిరిన న్యూక్లియర్ డీల్ కారణంగా ‘లాంగ్ రేంజ్ మిస్సైల్స్’ ప్రోగ్రాంను ఇరాన్ ఆపివేసింది. ఆ దేశం దగ్గర ప్రస్తుతం ఉన్న  షార్ట్ రేంజ్, మీడియం రేంజ్ మిస్సైళ్లతో  గల్ఫ్, అలాగే సౌదీ అరేబియా ప్రాంతాల్లోని టార్గెట్​ను పేల్చేయవచ్చు అంటున్నారు.

సైబర్ స్పేస్ సత్తా

2010లో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్​పై దాడులు జరిగాయి. అప్పటినుంచి సైబర్ స్పేస్ కెపాసిటీని పెంచుకునే కార్యక్రమాన్ని ఇరాన్ చేపట్టింది. ఆర్మీలో కీలకంగా భావించే ఐఆర్జీసీకి సొంతంగా సైబర్ కమాండ్ ఉందని చెబుతారు. ఇరాన్ దగ్గర అణు బాంబు ఉందా? అనే అనుమానాలు చాలాసార్లు వస్తుంటాయి. అయితే న్యూక్లియర్ బాంబు ఉన్నట్లు కచ్చితమైన సమాచారం ఇప్పటివరకు లేదు.

ఇరాన్​ మిలిటరీ పవర్

రెగ్యులర్​ ఆర్మీ 3,98,000… గ్రౌండ్​ ఫోర్స్​3,50,000…. నేవీ ఫోర్స్​ 18,000……ఎయిర్​ ఫోర్స్​.30,000…రివల్యూషనరీ గార్డ్స్ 1,25,000…బాసిజ్​ వాలంటీర్​ ఫోర్స్​ ​ 1,26,00,000 …. మిలిటరీ వాలంటీర్లు 6,00,000…..రిజర్వ్​ సైనికులు. 3,00,000

ఏమిటా 52 ప్రాంతాలు?

ఇరాన్​ గనుక తోక జాడిస్తే… ఆ దేశానికి చెందిన 52 ప్రాంతాలపై దాడులు చేస్తామని అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ బల్లగుద్ది చెబుతున్నారు.  ఇరాన్​ కమాండర్​ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చిన నేపథ్యంలో ట్రంప్​ ఈ మేరకు ట్విటర్​లో హెచ్చరించారు. సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్​ తమ ప్రజలపైనా, లేదా ఆస్తులపైనా దాడికి దిగితే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ ‘52 ప్రాంతాలు’ అనే మాట కేవలం ఇరాన్​ సైనిక స్థావరాలకు సంబంధించింది కాదు. నలభై ఏళ్ల క్రితం ఇస్లామిక్​ రివల్యూషన్​ సక్సెస్​ అయ్యాక, 1979 నవంబర్​లో టెహరాన్​లోని అమెరికా ఎంబసీని సీజ్​ చేసి,​ 52 మంది అమెరికన్లను బంధించింది. అప్పటినుంచీ ఈ దేశాల మధ్య గొడవలు సాగుతున్నాయి. నాడు ఇరాన్​ చేసిన పనికి నేడు ప్రతీకారం తీర్చుకుంటామన్నది ట్రంప్​ ఉద్దేశం.

పవర్​ఫుల్ డ్రోన్లు

కొన్నేళ్ల పాటు అమెరికా సహా అనేక దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ  డ్రోన్ల సత్తాను ఇరాన్ బాగా పెంచుకోగలిగింది. ‘ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)’కు వ్యతిరేకంగా ఇరాక్​లో 2016  నుంచి జరుగుతున్న పోరాటంలో ఇరాన్​కు చెందిన డ్రోన్లనే ఎక్కువగా వాడారు. ఇరాన్ డ్రోన్లు చాలా పవర్​ఫుల్. అనుమతి లేకుండా తమ గగనతలంలోకి చొచ్చుకువచ్చిందని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన గూఢచారి డ్రోన్​ను కిందటేడాది జూన్​లో ఇరాన్ డ్రోన్లు కూల్చివేశాయి.

సాయంగా వచ్చేవి నాలుగే

ఇరాన్ వైపు నిలిచేవి నాలుగు దేశాలే కనిపిస్తున్నాయి. అవి సిరియా, లెబనాన్, కువైట్, ఇరాక్. ఈ దేశాలు ఇరాన్ కు మద్దతు పలకడానికి వాటి లెక్కలు వాటికున్నాయి.