- తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఇజ్రాయెల్ హెచ్చరిక
- ఇరు దేశాల మధ్య టెన్షన్
- ఇజ్రాయెల్‌కు అమెరికా వార్ షిప్స్
జెరూసలెం: పశ్చిమాసియా దేశాలలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ తాజాగా శనివారం ఆ దేశ నౌకను సీజ్ చేసింది. గల్ఫ్ తీరంలో హార్మజ్ జలసంధి వద్ద ఈ నౌకను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు. అనంతరం షిప్ ను ఇరాన్ జలాల్లోకి మళ్లించారు. సముద్రంపై ప్రత్యేకంగా హెలిక్యాప్టర్లతో ఆపరేషన్ నిర్వహించి ఈ షిప్ ను స్వాధీనం చేసుకున్నారని ఐఆర్ఎన్ఏ ఏజెన్సీ వెల్లడించింది. ఈ విషయం తెలిసి ఇరాన్‌పై ఇజ్రాయెల్ మండిపడింది. దీంతో ఇరు దేశాల మధ్య టెన్షన్లు పెరుగుతాయని, తమ షిప్ ను సీజ్ చేసినందుకు ఫలితం అనుభవించాల్సి ఉంటుందని టెహ్రాన్‌ను హెచ్చరించింది.
డమాస్కస్‌లో దాడితో మొదలు..
సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఈ నెల మొదట్లో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇందులో ఇరాన్ ఉన్నతాధికారులు ఇద్దరు, మరో ముగ్గురు సిబ్బంది చనిపోయారు. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఇజ్రాయెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీకార దాడి చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గల్ఫ్ తీరంలో ఎంఎస్ సీ ఆరైస్ అనే ఇజ్రాయెల్ నౌకను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. హెలికాఫ్టర్‌తో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి నౌకలో ల్యాండయ్యారు. ఆపై నౌకను తమ దేశంవైపు మళ్లించారు.
ఇజ్రాయెల్‌కు మేమున్నం..
ప్రతిదాడికి ఇరాన్ ఏర్పాట్లు చేస్తోందని, ఏ క్షణంలోనైనా మిసైళ్ల వర్షం కురిపించే అవకాశం ఉందని అమెరికా శుక్రవారం ఓ రిపోర్టు విడుదల చేసింది. నౌకా విధ్వంసక క్షిపణులు, అదనపు సైనిక సామగ్రిని పశ్చిమాసియాకు తరలించారు. తూర్పు మధ్యధరా సముద్రంలోకి రెండు నేవీ డిస్ట్రాయర్లను చేరవేశారు. ఇదిలా ఉండగా, తమ మధ్య తలదూర్చొద్దని అగ్రరాజ్యాన్ని ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో.. ఇజ్రాయెల్- హమాస్‌ల వరకు పరిమితమైన ప్రస్తుత యుద్ధం.. మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే అవకాశం ఉందనే ఆందోళన నెలకొన్నది. ఈ యుద్ధం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపడంతోపాటు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
ఫ్లైట్ రూట్ మార్పు
ఇరాన్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆ దేశ గగనతలంపై నుంచి విమానాల రాకపోకలు ఆపేసిన్నట్టు వెల్లడించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దేశాలకు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ఇండియన్స్‌కు విదేశాంగ శాఖ ఇప్పటికే సలహా ఇచ్చింది.
నౌకలో 17 మంది ఇండియన్లు
3ఎంఎస్సీ ఆరైస్ నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది కాగా అందులో 17 మంది భారతీయులే. వీరంతా ప్రస్తుతం నౌకలోనే ఇరాన్ గార్డ్స్ బందీలుగా ఉన్నారు. వీరిని క్షేమంగా విడిపించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. టెహ్రాన్, ఢిల్లీ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని, తమ పౌరులను సేఫ్ గా పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరినట్లు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.