ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది. ఇస్ఫహాన్ సిటీ వైమానిక స్థావరంపై డ్రోన్లతో దాడి చేసిన ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరాబ్డోల్లాహియాన్ ఇజ్రాయెల్ ను హెచ్చరించాడు. శుక్రవారం జరిగిన డ్రోన్ దాడి ప్రతీకారంతో ఇజ్రాయెలే చేసినట్లయితే తాము కూడా అంతకుమించి ప్రతిదాడులకు దిగుతామని వార్నింగ్ ఇచ్చాడు.
ఇస్ఫహాన్ లో పేలింది డ్రోన్ కాదని... అది పిల్లలు ఆడుకునే బొమ్మ అని హేళన చేశాడు. డ్రోన్ల దాడిని ఇజ్రాయెల్ దేశమే చేసిన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని, దీనిపై టెహ్రాన్ దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే తాము దానికి మించిన ప్రతిదాడులను చేస్తామని వెల్లడించారు. అలా కాకపోతే ఇక్కడితో ముగిస్తామన్నారు. తామే దాడుల జరిపినట్లు ఇజ్రాయెల్ మిలటరీ కూడా ప్రకటించలేదు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దక్షిణంగా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫహాన్ ఇరాన్ మిలటరీకి ప్రధాన ఎయిర్‌బేస్‌గా కూడా ఉంది. ఏప్రిల్ 19 తెల్లవారుజామున నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని, ఆకాశంలో డ్రోన్లు కన్పించాయని, అయితే అవి దేనికో అర్థం కాలేదని స్థానికులు తెలిపారు. ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు అణు కేంద్రాలు ఉండటంతో ఇరాన్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడితో అప్రమత్తమైన ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలను మోహరించడమే కాక, గగనతల రక్షణ వ్యవస్థను సిద్ధం చేసినట్టు తెలిపింది.