ఇరాన్​ ప్రెసిడెంట్  రైసీ దుర్మరణం

  •  హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినట్లు ప్రకటించిన ఇరాన్
  • విదేశాంగ మంత్రి హొస్సేన్‌‌ సహా మొత్తం తొమ్మిది మంది మృతి
  • ఆదివారం అజర్​బైజాన్  అటవీ ప్రాంతంలో కూలిన హెలికాప్టర్
  • సోమవారం ఉదయం శకలాలను గుర్తించిన రెస్క్యూ బృందాలు
  • ఇరాన్​లో ఐదురోజులు సంతాప దినాలు.. రైసీ మృతిపై ప్రపంచ నేతల సంతాపం

దుబాయ్: హెలికాప్టర్​ ప్రమాదంలో ఇరాన్​ ప్రెసిడెంట్​ ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ ఆదివారం అజర్​బైజాన్​ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన ఆ దేశ అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. అయితే, భారీ వర్షాల కారణంగా రెస్క్యూ పనులకు ఆటంకం ఏర్పడింది.

సోమవారం ఉదయం రెడ్​ క్రీసెంట్​ సొసైటీ సంఘటనా స్థలానికి చేరుకొన్నది. ప్రమాదం జరిగిన స్థలాన్ని గుర్తించింది. ఆ తర్వాత కాసేపటికే  రైసీ ప్రాణాలు కోల్పోయినట్టు  ఇరాన్​ అధికారిక వార్తా సంస్థ ధ్రువీకరించింది. రైసీతోపాటు విదేశాంగ మంత్రి హొస్సేన్‌‌‌‌‌‌ అమీరబ్దొల్లహియాన్, తూర్పు అజర్‌‌‌‌బైజాన్‌‌‌‌ ప్రావిన్సు గవర్నర్ తదితరులు కన్నుమూసినట్టు ప్రకటించింది.

డ్యాంలను ప్రారంభించి వస్తుండగా ప్రమాదం

ఇరాన్​, అజర్​బైజాన్​ రెండు దేశాలు సంయుక్తంగా వాటి సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖొదాఫరీన్​​ అనే రెండు డ్యాంలను నిర్మించాయి. ఆదివారం ఉదయం అక్కడికి చేరుకొన్న ఇబ్రహీం రైసీ, అజర్​బైజాన్​ ప్రెసిడెంట్​ ఇల్హమ్​ అలియేవ్​తో కలిసి వాటిని ప్రారంభించారు. అనంతరం విదేశాంగ మంత్రి హోస్సేన్​అమీరబ్దొల్లహియాన్, ఈస్ట్​ అజర్​బైజాన్​ ప్రావిన్స్​ గవర్నర్​మలేక్‌‌‌‌ రహ్‌‌‌‌మతీ, ఇతర అధికారులతో కలిసి తబ్రిజ్​ పట్టణానికి మూడు హెలికాప్టర్లలో బయలుదేరారు.

మిగతా రెండు హెలికాప్టర్లు గమ్యస్థానానికి చేరుకోగా, రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ మాత్రం టెహ్రాన్​నగరానికి వాయువ్య దిశగా 600 కిలోమీటర్ల దూరంలోని జోల్ఫా నగర సమీపంలో కూలిపోయింది. ప్రమాదం విషయం తెలుసుకున్న ఇరాన్​ భద్రతా దళాలు రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టాయి. సోమవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకొన్న ఇరాన్​ రెడ్​క్రీసెంట్​ సొసైటీ, ప్రమాదానికి గురైన చాపర్​ను గుర్తించింది.

ముక్కలైన హెలికాప్టర్ శకలాలను పరిశీలించాక అందులో ఎవరూ బతికి ఉండే అవకాశంలేదని వెల్లడించింది. కాగా, ప్రెసిడెంట్ రైసీ మరణవార్తను అధికారిక వార్తాసంస్థ ధ్రువీకరించగానే ఇరాన్​ కేబినెట్ అత్యవసరంగా భేటీ అయింది. దేశసేవలో అధ్యక్షుడు ప్రాణత్యాగం చేశారని, ఆయన సేవలు మరువలేమని పేర్కొంది. నల్లరంగు వస్త్రంతో అలంకరించిన రైసీ కుర్చీపై ఆయన ఫొటో పెట్టి సంతాపం ప్రకటించింది. 

తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్​ మొఖ్బర్

దేశ మొదటి వైస్​ ప్రెసిడెంట్​ మహమ్మద్​ మొఖ్బర్​ను దేశ తాత్కాలిక ప్రెసిడెంట్​గా ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతొల్లా అలీ ఖమేనీ నియమించారు. సంతాప సందేశంలో భాగంగా ఖమేనీ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా, దేశంలో ఐదురోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ ప్రమాదం ఇరాన్ పాలనపై ఎలాంటి ప్రభావం చూపదని అయతొల్లా ఖమేనీ అన్నారు.

మరోవైపు, రైసీ మృతిపై ఓవైపు అంతా సంతాపం తెలుపుతున్న విషాదవేళ.. కొంతమంది మాత్రం సంబరాలు చేసుకున్నారు. హెలికాప్టర్​ ప్రమాదంలో అధ్యక్షుడు మృతిచెందిన వార్త తెలిసి వీధుల్లోకి వచ్చి పటాకులు కాల్చారు.  ఇస్లామిక్ చట్టాల అమలులో రైసీ కఠినంగా వ్యవహరించడంతో కొంతమంది ప్రజలు ఆయనను ద్వేషిస్తున్నారు.

ప్రపంచ దేశాల సంతాపం

ఇరాన్​ అధ్యక్షుడు ఇబ్రహీరం రైసీ మృతిపై ప్రపంచ దేశాలు సంతాపం ప్రకటించాయి. రైసీ మరణం విచారకరమని, తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని భారత ప్రధాని మోదీ తెలిపారు. ఇండియా–ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో రైసీ కృషి ఎప్పటికీ గుర్తుంటుందని అన్నారు. ఇరాన్​ అధ్యక్షుడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని, ఈ కష్ట సమయంలో ఇరాన్​కు అండగా నిలుస్తామని చెప్పారు.

రైసీ మృతికి మంగళవారం దేశంలో సంతాప దినంగా ప్రకటించారు. ఇరాన్ ప్రెసిడెంట్​, విదేశాంగ మంత్రి మరణవార్త తనను షాక్​కు గురిచేసిందని, ఆ దేశానికి అండగా ఉంటామని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్​ అన్నారు. పాకిస్తాన్​ ఒకరోజు సంతాపదినంగా ప్రకటించింది. ఈ విషాద సమయంలో ఇరాన్​కు తాము మద్దతుగా ఉంటామని, దీన్నినుంచి ఆ దేశం ధైర్యంగా బయటపడుతుందని పాకిస్తాన్​ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ట్వీట్​చేశారు.

ఇబ్రహీం రైసీ మృతి విచారకరమని ఇరాక్​ ప్రధాని షియా ఆల్​ సుదానీ పేర్కొన్నారు. హౌతీస్​ సుప్రీం రెవల్యూషనరీ కమిటీల చీఫ్​ మహమ్మద్​ అలీ ఆల్​హౌతీ సంతాపం ప్రకటించారు. రైసీ మృతిపై చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​విచారం వ్యక్తంచేశారు. మంచి స్నేహితుడిని కోల్పోయామని తెలిపారు.