- మా శత్రువును ఐక్యంగా ఓడిస్తం
- హెజ్బొల్లా, హమాస్‌కు అండగా ఉంటాం
- ఇజ్రాయెల్‌పై దాడి చట్టబద్ధమే.. అవసరమైతే మళ్లీ అటాక్ చేస్తం
- నస్రల్లా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్
టెహ్రాన్/జెరూసలెం: ఇజ్రాయెల్ ఎక్కువకాలం ఉండదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. హమాస్, హెజ్బొల్లాకు అండగా ఉంటామని ప్రకటించారు. ఇజ్రాయెల్‌పై తాము చేసిన దాడి చట్టబద్ధమేనని, అదొక ప్రజాసేవ అని అభివర్ణించారు. అవసరమైతే మళ్లీ దాడి చేసేందుకు సిద్ధమని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనియన్లు, లెబనాన్ ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తామన్నారు. కలిసికట్టుగా శత్రువులను ఓడిస్తామని స్పష్టం చేశారు. ఐదేండ్లలో తొలిసారిగా శుక్రవారం సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ మసీదు వద్ద పక్కన గన్ పెట్టుకుని వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘హమాస్, హెజ్బొల్లాను ఓడించడం ఇజ్రాయెల్‌తో సాధ్యం కాదు.
ఎందుకంటే వాళ్లకు మేము అండగా ఉన్నాం. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం. హెజ్బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా మనతో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన మృతి హెజ్బొల్లాకు తీరని లోటు. ఎవరూ అధైర్యపడొద్దు.. ఇరాన్ తోడుగా ఉంటది. హసన్ నస్రల్లాను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్దాం. నస్రల్లా రుణం తీర్చుకుందాం’’అని ఖమేనీ పిలుపునిచ్చారు.
నస్రల్లా స్ఫూర్తితో ముందుకెళ్లాలి: ఖమేనీ
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హెజ్బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా ఎంతో ధైర్యంగా పోరాటం చేశారని అయతుల్లా అలీ ఖమేనీ గుర్తు చేశారు. ఆయన నేతృత్వంలో హెజ్బొల్లా ఎంతో బలంగా తయారైందని వివరించారు. ‘‘నస్రల్లా బలిదానం.. మనలో విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. శత్రువులకు వ్యతిరేకంగా నిలబడేందుకు ధైర్యం ఇస్తుంది. పౌరుల రక్షణ బాధ్యతను మరింత పెంచుతుంది. శత్రువులను కచ్చితంగా ఓడిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నం. లెబనాన్, పాలస్తీనా ఆక్రమణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నం. మా నిరసనను అడ్డుకునే హక్కు ఏ అంతర్జాతీయ చట్టానికీ లేదు. గాయపడిన లెబనాన్ ప్రజలకు సాయం చేయడం ప్రతి ముస్లిం బాధ్యత. లెబనాన్ జిహాద్ కోసం అందరూ మద్దతు ఇవ్వాలి. అల్ అక్సా మసీదు కోసం యుద్ధం చేయాలి’’అని ఖమేనీ పిలుపునిచ్చారు. భూమి, వనరుల కోసం ఇజ్రాయెల్‌ను అమెరికా ఒక పావుగా వాడుకుంటున్నదని విమర్శించారు. అమెరికా సపోర్టు చూసుకుని ఇజ్రాయెల్ రెచ్చిపోతున్నదని మండిపడ్డారు. కాగా, ఖమేనీ ప్రసంగం తర్వాత సౌత్ లెబనాన్ నుంచి హెజ్బొల్లా ఫైటర్లు ఇజ్రాయెల్ పై రాకెట్లతో దాడి చేశారు.
నస్రల్లా వారుసుడు హషీమ్ లక్ష్యంగా దాడులు
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. శుక్రవారం తెల్లవారుజామున బీరుట్‌పై వైమానిక దాడులు చేసింది. గడిచిన 24 గంటల్లో 37 మంది లెబనియన్లు చనిపోయారు. 150 మందికిపైగా గాయపడ్డారు. బీరుట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలోనూ ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని లెబనాన్ పేర్కొంది. నస్రల్లా తర్వాత అతడి వారసుడిగా భావిస్తున్న హషీమ్ సఫీద్దీన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది.
హెజ్బొల్లాకు మరో గట్టి దెబ్బ
బీరూట్‌లో ఉన్న హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై గురువారం వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. ఈ దాడుల్లో హెజ్బొల్లా కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ చీఫ్ మహ్మద్ రషీద్ సకాఫీ హతమైనట్లు వెల్లడించింది. తమ దాడుల్లో చనిపోయిన మహ్మద్ రషీద్ సకాఫీ.. 2000లో హెజ్బొల్లాకు కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ చీఫ్‌గా నియమితుడైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
హెజ్బొల్లాకు మరిన్ని సర్‌ప్రైజ్‌లు: ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్
హెజ్బొల్లా కోసం మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ హెచ్చరించారు. హెజ్బొల్లా, హమాస్‌లు కలిసి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. హెజ్బొల్లాను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. తమ దాడులతో హెజ్బొల్లాకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్నారు. నస్రల్లాను అంతమొందించామని, ఇజ్రాయెల్‌కు ఇదొక పెద్ద విజయమని తెలిపారు. ఇప్పటికే కొన్ని సర్‌ప్రైజ్‌లు పూర్తయ్యాయని, మరికొన్ని వెయిటింగ్లో ఉన్నాయని అన్నాడు.
ఇండియా చెప్తే ఇజ్రాయెల్ దాడులు ఆపుతది: ఇరాన్
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శాంతి స్థాపన ఇండియాతోనే సాధ్యమని భారత్‌లోని ఇరాన్ రాయబారి ఎరాజ్ ఇలాహీ అన్నారు. ఇండియా కల్గజేసుకుంటేనే పశ్చిమాసియా లో స్థిరత్వం నెలకొంటదని అభిప్రాయ పడ్డారు. ఇండియా చెప్తే ఇజ్రాయెల్ మాట వింటదని తెలిపారు. లెబనాన్‌పై దాడులు ఆపాల్సిందిగా ఇజ్రాయెల్‌కు సూచించాల న్నారు. ఇండియాకు ఇరాన్, ఇజ్రాయెల్ మంచి మిత్రులుగా ఉన్నాయని వివరించా రు. ఇరాన్ యుద్ధం కోరుకోవడం లేదన్నారు.