![ఎమ్మెల్యే రఘునందన్ రావుకు నోటీసులు..రూ. వెయ్యి కోట్ల పరువు నష్టం దావా](https://static.v6velugu.com/uploads/2023/05/IRB-issued-legal-notices-to-MLA-Raghunandan-Rao_B0J8ShD6qQ.jpg)
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కు IRB సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. రూ. 1000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ IRB సంస్థ రఘునందన్ రావుకు లీగల్ నోటీసులు పంపింది. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టును HMDA సంస్థ IRB సంస్థకు లీజుకు ఇచ్చింది. అయితే ఈ టెండర్ కేటాయింపులో అక్రమాలు జరిగాయని...ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. నిబంధనలను తుంగలో తొక్కి HMDA.. IRB సంస్థకు ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్టు లీజును 30 ఏళ్లకు కట్టబెట్టిందని రఘునందన్ రావు వెల్లడించారు. రఘునందన్ రావు ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన IRB ఆయనపై రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ లీగల్ నోటీస్ పంపింది.
హైదరాబాద్ ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్టు టెండర్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్ట్ టెండర్ అంశంలో వేల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. వేల కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను తక్కువకే IRB సంస్థలకు ప్రభుత్వం అప్పగించిందంటూ విమర్శించారు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు IRB సంస్థపై పదునైన ఆరోపణలు చేశారు. దీంతో IRB సంస్థ రఘునందన్ రావుకు రూ. 1000 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. అయితే దీనిపై రఘునందన్ రావు ఎలా స్పందిస్తారన్నది ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.