T20 World Cup 2024: టాప్ ఫామ్‌లో ఐరీష్ కుర్రాళ్ళు.. ఆ ఇద్దరినీ అడ్డుకుంటేనే భారత్‌కు విజయం

T20 World Cup 2024: టాప్ ఫామ్‌లో ఐరీష్ కుర్రాళ్ళు.. ఆ ఇద్దరినీ అడ్డుకుంటేనే భారత్‌కు విజయం

భారత్, ఐర్లాండ్ మ్యాచ్ అంటే టీమిండియా విజయం నల్లేరు మీద నడకే అనుకుంటే పొరపాటే. ఐర్లాండ్ పసికూన జట్టే అయినప్పటికీ ఆ జట్టు ప్రపంచ క్రికెట్ లో తాము ఎంత ప్రమాదకరమో చెప్పింది. తమదైన రోజున అగ్ర శ్రేణి జట్లకు షాక్ ఇవ్వడం ఐర్లాండ్ కు అలవాటే. ఈ ఊపులో వరల్డ్ కప్ లో భారత్ కు ఊహించని షాక్ ఇవ్వాలని ఆ జట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ జట్టులో ఇద్దరు యువ ఆటగాళ్లు లార్కన్ టక్కర్, హెన్రీ టెక్టార్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. వీరిద్దరినీ టీమిండియా అడ్డుకోవడం చాలా కీలకం. 

పాకిస్థాన్ గత నెలలో జరిగిన సిరీస్ లో వీరిద్దరూ అద్భుతంగా రాణించారు. పటిష్టమైన పాక్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడారు. పాక్ తో జరిగిన రెండో మ్యాచ్​లో టక్కర్ 34 బంతుల్లోనే 51 పరుగులు.. మూడో టీ20లో 41 బంతుల్లోనే 73 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇక టెక్టార్ విషయానికి వస్తే..మూడు టీ20ల్లో వరుసగా 36,32,30 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఏడాది కాలంగా వీరిద్దరూ అద్భుత ఇన్నింగ్స్ లు ఆడుతూ  ఐర్లాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

వీరితో పాటు ఓపెనర్లు స్టిర్లింగ్, బాల్ బిర్ని అనుభవం ఆ జట్టుకు కొండంత బలం. బ్యాటింగ్ డెప్త్ ఉండడం ఐర్లాండ్ కు కలిసి వచ్చే అంశం.  ఈ పోరులో టీమిండియా ఫేవరేట్ అయినప్పటికీ ఐర్లాండ్‌ను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. గత టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు ఐర్లాండ్ షాక్ ఇచ్చింది. అంతేగాక ఇటీవల పాకిస్థాన్‌ను సిరీస్‌లో మట్టికరిపించింది. అగ్ర జట్లకు షాక్‌లు ఇవ్వడం ఐర్లాండ్ ఎప్పుడూ ముందుటుంది. ఈ జట్టులో ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉన్నారు.