
క్రికెట్ లో ఆఫ్ఘనిస్తాన్ కు మరో బ్యాడ్ న్యూస్. ఐర్లాండ్ క్రికెట్ ఆఫ్ఘనిస్తాన్ టూర్ ను రద్దు చేసుకుంది. ఆర్థిక కారణాలను చూపుతూ ఆఫ్ఘనిస్తాన్ తో జరగాల్సిన సిరీస్ ను రద్దు చేస్తున్నట్టు ఐర్లాండ్ క్రికెట్ ప్రధాన ప్రకటన చేసింది. సిరీస్ నుంచి తప్పుకొని ఐర్లాండ్ షాక్ ఇవ్వడం సంచలనంగా మారింది. చాలామంది రాజకీయ కారణాలే అని చర్చించారు. గతంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఆఫ్ఘనిస్తాన్ తో జరగాల్సిన సిరీస్ ను రద్దు చేసుకున్నాయి. మహిళా స్వేచ్ఛ, అమ్మాయిల విద్య, ఉద్యోగాలపై తాలిబన్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ సిరీస్ ను బహిష్కరిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
ఇంగ్లాండ్ కూడా ఇదే కారణాన్ని చూపిస్తూ ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ రద్దు చేసుకుంది. అయితే క్రికెట్ ఐర్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారెన్ డ్యూట్రోమ్ ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడకపోవడానికి ఆర్థికపరమైన కారణాలేనని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఐర్లాండ్ ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. రానున్న సమ్మర్ లో ఐర్లాండ్ బిజీ షెడ్యూల్ కారణంగా కూడా ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. మే 21 నుంచి ఐర్లాండ్ వెస్టిండీస్ తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఐర్లాండ్ వైదొలగడంతో ఆఫ్ఘనిస్తాన్ కు ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకుండా పోయాయి.
ప్రస్తుత క్రికెట్ లో ఆఫ్ఘనిస్తాన్ అగ్ర శ్రేణి జట్లలో ఒకటిగా మారుతోంది. ఆ జట్టు సాధిస్తున్న పురోగతి అద్భుతం. 2024 టీ20 వరల్డ్ కప్ లో అగ్ర జట్లకు షాకిస్తూ సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ ను ఓడించి సెమీస్ రేస్ లో నిలిచింది. అంతకముందు భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లో సెమీస్ కు దగ్గరకు వచ్చింది.