IRE vs PAK: వరల్డ్ కప్‌ ముందు పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. పసికూన చేతిలో ఘోర ఓటమి

IRE vs PAK: వరల్డ్ కప్‌ ముందు పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. పసికూన చేతిలో ఘోర ఓటమి

పాకిస్థాన్ టీంలో స్టార్ క్రికెటర్లకు కొదువ లేదు. బాబర్ అజామ్, మహమ్మద్ రిజవాన్ లాంటి టీ20 స్పెషలిస్ట్ లతో పాటు షహీన్ ఆఫ్రిది, నజీమ్ షా లాంటి ప్రపంచ స్థాయి పేసర్లు వారి సొంతం. పేపర్ మీద చూస్తే ఎంత పెద్ద జట్టుకైనా షాకిచ్చే పాకిస్థాన్ కు ఊహించని షాక్ తగిలింది. డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో పసికూన ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. బ్యాటింగ్ లో పర్వాలేదనిపించినా..  బౌలింగ్ లో తేలిపోయింది. మరోవైపు సమిష్టిగా రాణించిన ఐర్లాండ్.. పాకిస్థాన్ ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ బాబర్ అజం 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆయూబ్(45), ఇఫ్తికర్ అహ్మద్(37*) జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఐర్లాండ్ బౌలింగ్ లో యంగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఏడెర్, వైట్ తలో వికెట్ తీసుకున్నారు. భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఓటమి ఖాయమనుకున్నారంతా. అయితే బ్యాటర్లు సమిష్టిగా రాణించి అద్భుత విజయాన్ని అందించారు. 

183 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 5 వికెట్లు నష్టపోయి 19.5 ఓవర్లలో ఛేదించింది ఐర్లాండ్.  ఓపెనర్ ఆండ్రీవ్ బల్బర్నీ 55 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హ్యారీ టెక్టర్ (36) అతనికి చక్కనై సహకారం అందించాడు చివర్లో మ్యాచ్ ఉత్కంఠ నెలకొన్నా కాంప్ హెర్(15*), డెలానీ(10*) మ్యాచ్ ను ఫినిష్ చేసి పాకిస్థాన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ కు ముందు ఈ ఓటమి పాక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది.