5 సంవత్సరాల 10 నెలల 20 రోజులు.. పసికూన ఐర్లాండ్ తమ తొలి టెస్టు విజయాన్ని నమోదు చేయడానికి పట్టిన కాలం. 2018లో ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు టెస్ట్ హోదా పొందిన ఐదు సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు ఐర్లాండ్ ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి తమ మొట్టమొదటి టెస్ట్ విజయాన్ని నమోదు చేసుకుంది. అబుదాబిలోని నేడు (మార్చి 1) టాలరెన్స్ ఓవల్‌లో ఐర్లాండ్ ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. వరుసగా 8 టెస్టుల ఓటమి తర్వాత వారికి ఈ విజయం దక్కడం విశేషం.
111 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 39 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బాల్బిర్ని, వికెట్ కీపర్ టక్కర్ 72 పరుగుల అజేయ భాగస్వామ్యంతో మ్యాచ్ ను గెలిపించారు. నవీద్ జద్రాన్ వేసిన 32 ఓవర్లో టక్కర్ సింగిల్ తీయడంతో ఐర్లాండ్ జట్టులో సంబరాలు మొదలయ్యాయి. ఈ విజయంతో టెస్ట్ క్రికెట్ లో మొదటి విజయాన్ని నమోదు చేయడానికి తీసుకున్న మ్యాచ్‌ల సంఖ్య పరంగా ఇండియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే వంటి బలమైన జట్లను కూడా అధిగమించింది. ఈ జట్లన్నీ ఐర్లాండ్ కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడి తమ తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసుకున్నాయి.
AFGHANISTAN VS IRELAND ONLY TEST
— Majid speak (@majidamjad2017) March 1, 2024
DAY 3
MATCH FINISHED
AFG 155 & 218
IRE 263 & 111/4
IRELAND WON BY 6 WICKETS pic.twitter.com/nxxsW8H3xd
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 155 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో ఐర్లాండ్ 263 పరుగులు చేసి 108 పరుగుల విలువైన ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగులకు ఆలౌట్ కాగా.. 111 పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్ 4 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.