Aimee Maguire: ఇల్లీగల్ బౌలింగ్ యాక్షన్.. మహిళా క్రికెటర్‪పై సస్పెన్షన్ వేటు

Aimee Maguire: ఇల్లీగల్ బౌలింగ్ యాక్షన్.. మహిళా క్రికెటర్‪పై సస్పెన్షన్ వేటు

ఐర్లాండ్ స్పిన్నర్ ఐమీ మాగ్వైర్(Aimee Maguire)పై సస్పెన్షన్ వేటు పడింది. ఆమె బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఐసీసీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ససస్సెన్షన్ అమల్లోకి వస్తుందని ఐసీసీ గురువారం తెలిపింది.

జనవరి 10న రాజ్‌కోట్‌లో భారత్‌తో జరిగిన తొలి వన్డేలో మాగ్వైర్ అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్‌పై ఆన్‌ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఆ మ్యాచ్‌లో ఈ ఐరిష్ స్పిన్నర్ 8 ఓవర్లలో 57 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం జనవరి 21న యూకే, లాఫ్‌బరోలోని టెస్ట్ సెంటర్‌లో ఆమె బౌలింగ్ యాక్షన్‌ను ఐసీసీ పరీక్షించగా, నిబంధనలకు విరుద్ధంగా మోచేయి పొడిగింపు ఉన్నట్లు తేలింది. దాంతో, ఐసీసీ రూల్ 6.1 ప్రకారం, మాగ్వైర్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా సస్పెన్షన్ వేటు వేశారు. ఐరిష్ స్పిన్నర్ తన బౌలింగ్ యాక్షన్‌ సరైనదిగా నిరూపించుకునేంత వరకూ ఈ సస్పెన్షన్ అమలులో ఉండనుంది.

ఎవరీ మాగ్వైర్..? 

ఐమీ ఐర్లాండ్ ఓపెనింగ్ బౌలర్ జేన్ మాగ్వైర్ సోదరి. 2002లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 5/19 కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు సాధించి వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఐర్లాండ్ తరపున 11 వన్డేలు, 9 టీ20లు ఆడిన మాగ్వైర్ మొత్తం 25 వికెట్లు పడగొట్టింది.