బోనస్​ అక్రమాలకు ఐరిస్​ తో చెక్​

బోనస్​ అక్రమాలకు ఐరిస్​ తో చెక్​
  • ఏపీ, చత్తీస్​గఢ్​ బార్డర్ల నుంచి ధాన్యం రాకుండా చెక్​పోస్టుల ఏర్పాటు 

భద్రాచలం, వెలుగు :  వరిలో 33 రకాల సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్​ రూ.500లు ప్రకటించిన నేపథ్యంలో బోగస్​ను నియంత్రించేందుకు ఐరిస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కిన్నెరసాని, తాలిపేరు, మూకమామిడి, పెద్దవాగు ప్రాజెక్టులు, చెరువుల కింద 1.64లక్షల ఎకరాల్లో వరి సాగైంది. బోనస్​ ప్రకటించిన వేళ ఏపీ, చత్తీస్​గఢ్​ బార్డర్​ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అక్రమంగా రాకుండా అడ్డుకునేందుకు చెక్​పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. 

ఇలా చేస్తారు...!

ధాన్యంలో తేమశాతాన్ని పరీక్షించుకోవాలి. సన్నాలైతే బియ్యం గింజ పొడవు 6ఎంఎం, వెడల్పు 2 ఎంఎం ఉండాలి. ఇందుకు ప్యాడీ హస్కర్, గ్రెయిన్​ కాఫర్​లను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్​ ఏఈవోలు, సహకార సంఘం, వ్యవసాయ మార్కెటింగ్​, జిల్లా గ్రామీణాభివృద్ధి  శాఖ ఆఫీసర్లకు ఇప్పటికే ట్రైనింగ్​ఇచ్చారు. ఏఈవోలు సన్నాలుగా గుర్తించి ధ్రువీకరిస్తారు. 

ఐరిస్​విధానం ఇలా..

దళారుల ప్రమేయం లేకుండా ఐరిష్​ విధానం అమలు చేస్తున్నారు. ముందుగా కొనుగోలు కేంద్రం పరిధిలోని రైతుల వివరాలను సేకరిస్తారు. రైతు సాగు చేసిన వరి విస్తీర్ణం, ధాన్యం బస్తాలు ఎన్ని క్వింటాళ్లు దిగుబడి వస్తుందనే విషయాలు ఆన్​లైన్​ ప్రొక్యూర్​మెంట్​మేనేజ్​మెంట్​ సిస్టంలో నమోదు చేస్తారు. అదే సమయంలో రైతుల ఐరిస్​ను నమోదు చేసుకున్నారు.  అప్పుడు రైతు ఫోన్ నంబర్​కు ఓటీపీ పంపిస్తారు. 

ధాన్యం అమ్మినప్పుడు అసలైన రైతేనా అని ఐరిస్​ ద్వారా చెక్​ చేస్తారు. సిస్టంలో నమోదు చేసిన దాని ప్రకారం ఐరిస్​ చేసిన వెంటనే సిస్టంలోని వివరాలు ఓపెన్​ అవుతాయి. ఇలా నగదు నేరుగా రైతుల ఖాతాలో చేరిపోతుంది. గతంలో రైతుల ఆధార్​ నంబర్, బ్యాంకు అకౌంట్​ను నమోదు చేస్తే సెల్​ ఫోన్​కు ఓటీపీ వచ్చేది. రైతుల పేరిట వ్యాపారులు, దళారులు ఇతర ప్రాంతాల నుంచి ధాన్యాన్ని విక్రయించే వారు. కానీ ఇప్పుడు ఈ అక్రమానికి చెక్​ పడింది. 

 రైతుకే నేరుగా మద్దతు ధర, బోనస్​ రెండు రోజుల్లో చెల్లించేలా చర్యలు చేపట్టారు. ధాన్యం అమ్మాక రైతులకు రూ.3లక్షలకు మించి డబ్బులు చెల్లించాల్సి వస్తే స్థానిక వ్యవసాయాధికారి సర్టిఫై చేసి, ఆ రైతు పండించినట్లుగా సర్టిఫికెట్​ ఇస్తారు. అప్పుడు వారు డబ్బులు డ్రా చేసుకునే వీలుంటుంది. జిల్లాలో 160 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2.74లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. 

మరి కౌలు రైతుల సంగతేంటి..?

కౌలు, పోడు భూముల్లో సాగు చేసే రైతులకు ఐరిస్ విధానం వల్ల ఇబ్బందులు తలెత్తనున్నాయి. వారు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి అమ్ముకోవాలంటే కష్టతరం అవుతుంది. అయితే కౌలు రైతులకు ఇబ్బందులు రాకుండా ఆఫీసర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. స్థానిక ఏఈవోలను కలిసి ఎవరి నుంచి పొలం కౌలు తీసుకున్నారో వివరాలు తెలియజేయాలి. ఆ వివరాల ప్రకారం ఆన్​లైన్​ ప్రొక్యూర్​ మెంట్​ మేనేజ్​మెంట్ సిస్టంలో నమోదు చేస్తారు. పోడు రైతుల వివరాలను కూడా ఇదే తరహాలో నమోదు చేస్తారు. 

అవకతవకలకు ఆస్కారం లేకుండా.. 

అవకతవకలకు ఆస్కారం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం. బోనస్​ను దుర్వినియోగం కాకుండా చూస్తాం. రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాం. డబ్బుల చెల్లింపు, టెక్నికల్ ప్రోబ్లమ్స్​కు ఐరిస్​ చెక్​ పెడుతుంది. –  త్రినాథ్​బాబు , డీఎం, సివిల్​ సప్లయిస్​