
హోంరూల్ ఉద్యమం
అమెరికా అధ్యక్షుడు ఉండ్రో విల్సన్ ప్రకటించిన 14 సూత్రాల స్ఫూర్తితో ఐర్లాండ్‌లో హోంరూల్ ఉద్యమం ప్రారంభమైంది. ఐరిష్ జాతీయవాదులు స్వయం పాలన కోరుతూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేపట్టారు. ఈ సమయంలో అనిబిసెంట్ ఐర్లాండ్‌లో ఉంది. ఈ తరహా ఉద్యమం భారతదేశానికి చాలా అవసరమని భావించిన అనిబిసెంట్ హోంరూల్ భావనను భారతదేశానికి తీసుకువచ్చింది. అతివాద నాయకుడు బాల గంగాధర్ తిలక్ హోంరూల్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. 1916లో తిలక్, అనిబిసెంట్ నాయకత్వంలో భారతదేశంలో రెండు వేర్వేరు హోంలీగ్లు ప్రారంభమయ్యాయి. అయినా వీరు ఉద్యమాన్ని సంయుక్తంగా నిర్వహించారు. స్వదేశీ, జాతీయ విద్యా విధానం, భారతదేశానికి స్వయంపాలన అనేవి ఈ లీగ్ నినాదాలు. హోంరూల్ ఉద్యమానికి పరోక్ష కారణం మొదటి ప్రపంచ యుద్ధం.
విదేశాల్లో హోంరూల్ లీగ్
కెనడా, ఆస్ట్రేలియాల్లో హోంరూల్ లీగ్, న్యూయార్క్‌లో ఇండియన్ హోంరూల్ లీగ్‌లు స్థాపించారు. బాల గంగాధర్ తిలక్ 1919, ఫిబ్రవరి 9 నుంచి మే 6 వరకు అమెరికాలో పర్యటించి ఉద్యమ ప్రచారం చేశారు. లాల లజపతిరాయ్, హార్దికర్, కేడీ శాస్త్రిలు కూడా అమెరికాను సందర్శించారు.
లక్నో సమావేశం
1916, లక్నో సమావేశానికి ఏసీ మజుందార్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రెండు పరిణామాలు చోటుచేసుకున్నాయి.
1. లక్నో కలయిక: మితవాదులు, అతివాదులు కలవడంలో అనిబిసెంట్, తిలక్ ప్రముఖ పాత్ర పోషించారు. 1907లో విడిపోయిన అతివాదులు, మితవాదులు కలవడంతో జాతీయ కాంగ్రెస్ శక్తిమంతమైంది. ఇందులోనే తిలక్, ఆయన అనుచరులు ఐఎన్సీలో చేరారు.
2. లక్నో ఒప్పందం: కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల మధ్య రాజ్యాంగ సంస్కరణల విషయమై జరిగిన ఒడంబడికలో భాగంగా కాంగ్రెస్, ముస్లింలీగ్‌లు ఒక ఒప్పందాన్ని చేసుకుని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. లక్నో ఒప్పందానికి ప్రధాన కారకుడు మహ్మద్‌అలీ జిన్నా. ఇతనికి హిందూ ముస్లింల ఐక్యతకు రాయబారి అని పేరు. ఈ సమావేశంలోనే ముస్లింలీగ్ కాంగ్రెస్ తో కలిసి ఉమ్మడిగా హోంరూల్ ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ముస్లిం లీగ్ నాయకుడైన జిన్నా హోంరూల్ లీగ్‌లో చేరి బొంబాయి శాఖకు ప్రాతినిధ్యం వహించారు.
ఉద్యమ ఫలితాలు
ప్రజలలో రాజకీయ చైతన్యం, జాతీయ స్ఫూర్తి ఏర్పడటం
జాతీయవాదులు, మితవాదులు, కాంగ్రెస్, ముస్లింలీగ్ కార్యకర్తలు అందరూ కలసి పాల్గొనడం
ప్రభుత్వ భారత ప్రభుత్వ చట్టాన్ని (1919) ఆమోదించడం
1919 చట్టంతో భారతీయులకు కొంత మేరకు ప్రభుత్వ నిర్వహణలో పాల్గొనే అవకాశం
1920లో హోంరూల్ లీగ్‌కు గాంధీజీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ అనే స్వరాజ్యసభగా పేరు మార్చుకుంది.
అనిబిసెంట్ హోంరూల్ లీగ్: 1916, సెప్టెంబర్‌లో అనిబిసెంట్ మద్రాస్ ప్రాంతంలోని గోఖలే హాల్లో హోంరూల్ లీగ్‌ను స్థాపించి, ఆ సంస్థకు ఆమెనే అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఏడుగురు సభ్యులతో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ కౌన్సిల్లో కార్యనిర్వాహక కార్యదర్శి జార్జి అరుండేల్, ఉపాధ్యక్షుడు రామస్వామి అయ్యర్, కోశాధికారిగా బీడబ్ల్యూ వాడియాను నియమించారు. లీగ్ ప్రథమ సమావేశంలో వాడియా హోంరూల్ లీగ్ అనే అక్షరాలతో కూడిన బంగారు బ్యాడ్జిని అనిబిసెంట్‌కు బహూకరించారు. చార్లెస్ బ్రాడ్లా పరిచయంతో అనిబిసెంట్ సోషలిస్టు భావాలను అందిపుచ్చుకున్నారు. ఈ ఉద్యమంలో అనిబిసెంట్‌కు జమునదాస్, ద్వారకదాస్, మోరేశ్వర్ అభ్యంకర్, ఇందూలాల్ యాజ్ఞిక్, జార్జి అరుండేల్, మోతీలాల్ నెహ్రూ, చక్రవర్తి, బెనర్జీ సహకరించారు. ఈ ఉద్యమంలో జవహర్లాల్ నెహ్రూ సభ్యత్వం తీసుకున్నారు. 1916లో హోంరూల్ ఉద్యమంలో భాగంగా అనిబిసెంట్ ఆంధ్ర రాష్ట్రంలోని మదనపల్లిలో జాతీయ కళాశాల లేదా థియోసాఫికల్ కళాశాలను స్థాపించారు.
ఈ కళాశాల మొదటి ప్రిన్సిపల్ హె.జె.కజిన్స్. వారణాసిలో వారణాసి సంస్కృత విద్యాపీఠాన్ని కూడా ఏర్పాటు చేశారు. 1917లో డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద అనిబిసెంట్‌ను అరెస్టు చేశారు. ఉద్యమ తీవ్రతను గమనించి 1917, ఆగస్టు 20న ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వ కార్యదర్శి మాంటేగ్ ఛేమ్స్‌ఫర్డ్ దశల వారీగా భారతీయులకు అధికారాలు సంక్రమింపజేస్తామని ప్రకటన చేశాడు. దీన్నే ఆగస్టు లేదా మాంటేగ్ ప్రకటన అంటారు. ఈ ప్రకటనకు సంతోషం వ్యక్తం చేస్తూ అనిబిసెంట్ ఉద్యమాన్ని నిలిపివేసింది. కానీ తిలక్ ఉద్యమాన్ని కొనసాగించారు. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగియడంతో హోంరూల్ ఉద్యమం కూడా ముగిసింది. ఆగస్ట్ డిక్లరేషన్‌ను సురేంద్రనాథ్ బెనర్జీ ఆహ్వానించారు. దానిని మాగ్నాకార్టాగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 1917లో ఇండియన్ లిబరల్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేశారు.
తిలక్ హోంరూల్ లీగ్: 1908లో అరెస్టయి మాండలే కారాగారంలో జైలు జీవితం అనుభవించిన తిలక్ 1914, జూన్‌లో విడుదలయ్యారు. ఆ సమయంలో పాండిచ్చేరిలో అరబిందో ఘోష్ సన్యాసిగా, లజపతిరాయ్ అమెరికాలో ఉన్నారు. 1915, ఏప్రిల్ 20న తిలక్ బొంబాయి రాష్ట్ర రాజకీయ సమ్మేళన ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1915లో గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతాలు మరణించడంతో తిలక్‌కు మళ్లీ కాంగ్రెస్‌లో చేరే అవకాశం లభించింది. తిలక్ స్థాపించిన హోంరూల్ లీగ్ మహారాష్ట్ర (బొంబాయి మినహా), కర్ణాటక, మధ్యప్రదేశ్, బీరార్ ప్రాంతాలకే పరిమితమైంది. హోంరూల్ అనేది బ్రిటీష్ సామ్రాజ్యంలో అంతర్భాగమని, అందులో ఆంగ్ల అధికారుల స్థానంలో ప్రజలకు బాధ్యత వహించే అధికారులు ఉంటారని తెలిపారు.