హైదరాబాదు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లారిగూడెంలో క్రీ.పూ.1500 సంవత్సరం నాటి ఇనుపయుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయి. బీచురాజుపల్లి పంచాయతీ పరిధిలోని ఎల్లారిగూడెం బస్ స్టేజీ సమీపంలో పురాతన నిలువురాయి(మెన్హర్)ని గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఆరు అడుగుల ఎత్తు, మూడు అడుగుల మందంతో తెలుపు రంగులో ఉన్న ఈ గ్రానైటు రకం రాయి గురించి కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్‌ను సంప్రదించగా ఇది ఇనుపయుగపు మెన్హర్(నిలువురాయి) స్మారకశిల అని నిర్ధారించారు. జీఎస్ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ కమతం మహేందర్‌రెడ్డిని సంప్రదించగా ఈ గ్రానైటు రాయి వాతావరణ వైపరీత్యాలకులోనై నలుపు రంగు నుంచి తెలుపురంగుకు మారిందని, దీని వయసు 2,500 మిలియన్ సంవత్సరాలని వెల్లడించారు. గతంలో ఇక్కడ కొన్ని రక్కీస బండలు(ఇనుప యుగపు సమాధులు) ఉండేవని, వ్యవసాయ భూముల విస్తరణలో కనుమరుగయ్యాయని స్థానిక రైతులు తెలిపారు. మరణించిన తమ వారి సమాధి దగ్గర ఇలాంటి నిలువురాతిని పాతిపెట్టే సంప్రదాయం ఇనుపయుగంలో ఈ ప్రాంతంలో ఉందని, రోడ్డు నిర్మాణంలో మూడు అడుగుల మేరకు పూడుకు పోయిందని, పురావస్తు ప్రాధాన్యతగల ఈ స్మారక శిలను పరిరక్షించాలని శివనాగిరెడ్డి బీచురాజుపల్లి, ఎల్లారిగూడెం గ్రామస్తులను కోరారు.