
- విషమయంగా భూగర్భ జలాలు
- పల్లి, వరి పంటలపై ఐరన్ డస్ట్
- వాటిని మేస్తున్న బర్లు, ఆవులకు క్యాన్సర్
- మూడు నెలలుగా ఒక్కొక్కటిగా చనిపోతున్న పశువులు
- కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టింపు కరువు
మహబూబ్‌నగర్/బాలానగర్, వెలుగు: ఆవులు, గేదెలు, పంటలపై ఐరన్ కంపెనీల ఎఫెక్ట్ పడుతోంది. ఇనుము తయారు చేసిన తరువాత దాన్ని చల్లార్చేందుకు వినియోగించిన వాటర్, ఇతర కెమికల్స్‌ను డ్రిల్ చేసి, భూమిలోకి వదులుతుండటంతో ఆ నీరు చుట్టూ ఉన్న బోర్లలోకి చేరుతోంది. దీంతో ఈ పరిశ్రమలు ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా ఉమ్మడి బాలానగర్ మండలంలోని మాచారం, ఈదమ్మగడ్డ తండా, బండపల్లి, మాచారం తండా, ఉడిత్యాల్ గ్రామాల్లో గ్రౌండ్‌వాటర్ పాయిజన్‌గా మారుతోంది. బోర్ ఆన్ చేస్తే నీళ్లు ఎర్రగా వస్తున్నాయి. ఆ నీటిని పంటలకు పెడితే మొక్కలు ఎండిపోతున్నయి. ఈ నీరు పారిన చోట భూమి పైపొర తెల్లగా మారుతోంది. నీటిని తాగిన ఆవులు, బర్రెలు అనారోగ్యానికి గురవుతున్నాయి. బాలానగర్ మండలంలో ఈ యాసంగిలో 41 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. అందులో అత్యధికంగా వరి, పల్లి, మక్క, జొన్నలు ఉన్నాయి. మండలంలో 14 వేల బర్రెలు, ఆవులు, గొర్లు, మేకలు 24 వేలు ఉన్నాయి. మండలం చుట్టుపక్కల 9 ఐరన్పరిశ్రమలు ఉన్నాయి. కంపెనీల నుంచి తెల్లవారుజామున, సాయంత్రం పూట గాల్లోకి వదిలే వాయువు నుంచి ఐరన్డస్ట్ వరి, పల్లి పంటల మీద పడుతోంది. దీంతో ఆ పంటలు చేతికొస్తలేవు. చేతికొచ్చినా ఎకరాకు కనీసం పది బస్తాల వడ్లు కూడా రావడం లేదు. పల్లి కూడా ఎకరానికి ఐదు బస్తాలు మించి రావట్లేదు. రకరకాల తెగుళ్లు, రోగాలు ఆశిస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట నష్టపోతున్న రైతులకు ఐరన్ కంపెనీల యజమానులు పరిహారం కూడా ఇస్తలేరు. రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్లకు చెబితే వారు కనీసం పంటలను పరిశీలించడం లేదు. ప్రస్తుతం ఈ కంపెనీల పొంటి ఉన్న పొలాలు పడావుగా మారాయి. ఆరు గ్రామాల్లో ఉన్న 480 బోర్లలో నీళ్లు వస్తున్నా, వాటిలో కెమికల్స్ కలవడంతో ఈ యాసంగిలో ఎలాంటి పంటలు వేయలేదు. కొందరు మాత్రం వరి వేశారు. రెండు నెలలు అవుతున్నా ఈ పొలాల్లో ఇప్పటివరకు గింజ పట్టలేదు.
పశుసంపదకు తీవ్ర నష్టం
పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో మేత మేస్తున్న ఆవులు, బర్రెలు రోగాల బారిన పడుతున్నాయి. 2021 నుంచి ఇప్పటివరకు మాచారం, ఈదమ్మగడ్డ తండా, బండమీదిపల్లి, మాచారం తండా, ఉడిత్యాల్ గ్రామాల్లో దాదాపు 40 పశువుల వరకు చనిపోయాయని బాధిత రైతులు చెబుతున్నారు. ఐరన్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే డస్ట్ వల్ల పశువులు శ్యాసకోశ వ్యాధుల బారిన పడుతున్నయి. గ్రౌండ్ వాటర్‌లో మెటల్స్ కలవడం వల్ల ఈ నీటిని తాగిన పశువుల్లో క్యాన్సర్ గడ్డలు ఏర్పడుతున్నాయి. గడ్డి మేయడం లేదు. బక్కచిక్కిపోయి జీవిడుస్తున్నాయి. ఇక్కడ మేత మేస్తున్న ఆవులు, బర్రెలు కడ్తలేవు. ఈనడం లేదు. కొన్ని పశువులు రెండు, మూడు సంవత్సరాలు కావస్తున్నా ఎదుగుతున్నాయే తప్ప ఈతకొస్తలేవు. మరికొన్ని రెండు, మూడుసార్లు కడుతున్నా ఈనడం లేదు. వెటర్నరీ డాక్టర్ల వద్దకు తీసుకెళ్లి మందులు, సూదులు ఇప్పించినా ఫలితం ఉండటం లేదు. ఇక్కడి జీవాలు పాలు కూడా తక్కువగా ఇస్తున్నాయి. ఒక చల్క ఆవు, బర్రె రోజుకు కనీసం నాలుగు లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ఇక్కడున్నవి కనీసం సేరు పాలు కూడా ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. పంటలు దెబ్బతిని, పశువులు జీవిడుస్తున్నా ఆఫీసర్లు పట్టించుకుంటలేరు. వీటికి సంబంధించిన వివరాలను ఈ మండలానికి చెందిన రెండు శాఖల అధికారులు నోట్ చేయడం లేదు. ఇక్కడ పంటలెందుకు నాశనమైతున్నయని అగ్రికల్చర్ ఆఫీసర్లను సంప్రదిస్తే సరైన రీజన్స్చెప్పడం లేదు. ‘మేం కేవలం ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటల వివరాలనే సేకరిస్తాం. అక్కడ పంటలు ఎందుకు దెబ్బతింటున్నయే మాకు తెల్వదు. అవి మేం రికార్డ్ చెయ్యం. అట్ల ఎందుకైతుందో కలెక్టర్‌నే పోయి అడగండి’.. అని సమాధానమిస్తున్నారు.
ఆందోళన చేస్తే జైలుకే..
ఐరన్ ఫ్యాక్టరీలతో పంటలు దెబ్బతింటున్నాయని, జీవాలు చనిపోతున్నాయని ఆందోళన చేస్తున్నా ఫ్యాక్టరీల ఓనర్లు పట్టించుకోవడం లేదు. పైగా స్థానిక పోలీసులతో ఆందోళన చేస్తున్న రైతులను అరెస్టు చేయించి జైల్లో పెట్టిస్తున్నారు. నాలుగు నెలల కిందట ఈదమ్మగడ్డ తండా రైతులకు ఇదే పరిస్థితి ఎదురైంది. కంపెనీని మూసేయాలని ఆందోళన చేస్తే వారిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. తండాకు చెందిన కొందరు యువకులపై కేసులు పెట్టారు. దీంతో ప్రస్తుతం ఆందోళన చేసేందుకు ఎవరూ డేర్ చేయడం లేదు. పైగా అధికార పార్టీకి చెందిన కొందరు మెయిన్ లీడర్లకు ఫ్యాక్టరీ ఓనర్లతో ఉన్న పరిచయాలతో వారినెవరూ టచ్ కూడా చేయడం లేదు. వారం కిందట ఈ తండా రైతులు సర్పంచ్‌తో కలిసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు.
కేటీఆర్ తానికి పోండంటుర్రు
రెండేళ్ల కిందట మా పంటలు దెబ్బతిన్నయి. పరిహారం ఇయ్యాలని ఫ్యాక్టరీ వద్ద కొట్లాటకు దిగినం. ఏం చేసుకుంటరో చేసుకోపోండి అని మేనేజరు అన్నడు. నష్టం కట్టియ్యం. పైసా ఇయ్యం. కేటీఆర్తానికి పోతర.. పొండి అని చెప్పిండు. ఇంక మేం ఏం చేయాలె.. మా గోస ఎవరికి చెప్పుకోవాలె? మా పంటల పొంటి ఒక్కరూ చూడరు. పట్టించుకోరు.
– చెన్నయ్యగౌడ్, రైతు, బండపల్లి
ఎవరూ పట్టించుకుంటలేరు
మా గోసను గవర్నమెంట్పట్టించుకుంటలేదు. ఇక్కడ కంపెనీలు కూడా మాపై పెత్తనం చలాయిస్తున్నయి. ఫ్యాక్టరీ హౌజులో ఉన్న నీళ్లను భూమిలోకి పంపుతున్నరు. దీంతో మా పంటలు దెబ్బతిని, జీవాలు చనిపోతున్నయి. కంపెనీ దగ్గరకు పోతే మాపై కేసులు పెడుతున్నరు. ఏడాదిలో ఇప్పటివరకు నాలుగు సార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినం. కానీ ఇంతవరకు ఎవరూ పట్టించుకుంటలేరు.
–దేవుజానాయక్, సర్పంచ్, ఈదమ్మగడ్డ తండా