ఏదైనా పరీక్ష రాయలంటే హాల్ టికెట్ తప్పనిసరి. మరి హాల్ టికెట్టే లేకుండా పరీక్ష కేంద్రానికి వెళ్తే... టీచర్లు వారి విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తే.. ఇంకేముంది పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నట్లేగా. అంతా జరిగాక ఆదరాబాదరా చేసే అధికారులు ఇలాంటి విషయాలను కనీసం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కామారెడ్డి జిల్లా హరిజన వాడలో ఓపెన్ టెన్త్ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలకు ఈ పరిస్థితి అద్దం పడుతోంది. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిజన వాడలో ఓపెన్ టెన్త్ పరీక్షలు జరుగుతుండగా, నలుగురు విద్యార్థులు హాల్ టిక్కెట్టు లేనిదే కేంద్రానికి వెళ్లారు. వారికి పరీక్ష రాయడానికి టీచర్లు సైతం అనుమతించారు.
సీన్లోకి అబ్జర్వర్
విద్యార్థులు నలుగురు పరీక్ష రాస్తుండగా ఎక్సామ్ స్టేట్ అబ్జర్వర్ వెంకటేశ్వరరావు వారి తరగతిలోకి వచ్చారు. ఇంకేముంది.. నలుగురు భయంతో పరీక్ష కేంద్రం నుంచి పరుగులు తీశారు. ఇన్విజిలేటర్లు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమన్వయకర్త తుల రవి నిందితులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
టీచర్లపై ఆరోపణలు..
విద్యార్థుల వద్ద హాల్ టిక్కెట్లు లేకపోతే పరీక్షకు అనుమతించవద్దని విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. అలాంటిది నలుగురు విద్యార్థులు హాల్ టిక్కెట్ లేకుండానే పరీక్ష రాశారంటే పలు అనుమానాలకు తావిస్తోంది. టీచర్లు, ఇన్విజిలేటర్లు కుమ్మక్కై విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.